ఇలా అయితే ఎలా ?

ABN , First Publish Date - 2020-07-20T11:23:21+05:30 IST

జిల్లా అంతటా కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 5 వేలు దాటింది. కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం,

ఇలా అయితే ఎలా ?

మద్యం దుకాణాల వద్ద అమలుకాని నిబంధనలు  

ఎగబడుతున్న మందుబాబులు

నియంత్రణలో నిర్వాహకులు, పోలీసులు విఫలం


అనంతపురం, జూలై19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా అంతటా కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 5 వేలు దాటింది. కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడమే ఏకైక మార్గమని  చెబుతున్నా ఎవరికీ చెవిచెక్కడం లేదు. ఆంక్షలను అమలు చేయడంలో ఇటు యంత్రాంగం, అటు పోలీసులు విఫలమవుతున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను కట్టడి చేయడంలో చూపుతున్న శ్రద్ధ మద్యం దుకాణాలపై పెట్టలేకపోతున్నారు. వైన్‌షాపుల ఎదుట వందలాది మంది క్యూ కడుతుండటం వైరస్‌ వ్యాప్తికి మరింత అనుకూలంగా మారుతోంది. ఆదివారం జిల్లా కేంద్రానికి సమీపంలోని వడియంపేట, బుక్కరాయసము ద్రంలలో ఉన్న మద్యం దుకాణాల ఎదుట నిబంధనలు పాటించకుండా  మందుబాబులు బారులు తీరారు.


ఎవ రూ భౌతికదూరాన్ని పాటించకుండా ఒకరినొకరిని తాకుతూ మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. గొడుగులు ఉంటేనే మద్యం విక్రయిస్తామని వైన్‌షాపుల నిర్వాహకులు చెబుతుండటంతో మందు కొనుగోలు కోసమే నామమా త్రంగా గొడుగులు చేతబట్టుకుంటున్నారు తప్పా భౌతిక దూరాన్ని పాటించడానికి కాదు. కొందరు మాస్కులు ధరించడం లేదు. దీన్నిబట్టి చూస్తే మద్యం దుకాణాలవైపు అధికారులెవ్వరూ దృష్టి సారించడం లేదన్నది తెలుస్తోంది. ఇలా అయితే  వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుందా అన్న అభిప్రాయం స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వైన్‌షాపు నిర్వాహకులు సైతం మద్యం విక్రయాలు జరిగితే చాలన్న కోణంలోనే చూస్తున్నారుగానీ కరోనా నుంచి మందుబాబులను కాపాడాలన్న ధోరణి వారిలో కనిపించడం లేదు. నిబంధనలు అమలు చేయకుండా పోలీసులు తూతూ మంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు.  


గొడుగులతో ఉపాధి  

గొడుగుంటేనే మద్యం విక్రయిస్తామనే నిబంధన కొందరికి ఉపాధి కల్పిస్తోంది. కొందరు మహిళలు, యువత వైన్‌షాపులు తెరిచే సమయానికి ఒక్కొక్కరు ఐదారు గొడుగులతో దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు.  మద్యం కొనుగోలు చేసేందుకు గొడుగుల్లేకుండా వచ్చే మందుబా బులకు  గంటకు అద్దె రూ. 40లు చొప్పున ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. మరికొందరు యువకులతో పాటు కొందరు నడివయస్కులు మద్యం దుకాణాల వద్ద వేచి ఉండటం కనిపించింది. ఎందుకని వారిని ప్రశ్నిస్తే క్యూలో నిలబడి మద్యం తీసుకొచ్చి ఇస్తే రూ. 50 కూలి  ఇస్తు న్నారని చెబుతున్నారు. మరికొందరు మహిళలు  క్యూలో నిలబడి మద్యం కొనుగోలు చేసి బయట అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

Updated Date - 2020-07-20T11:23:21+05:30 IST