రూపాయికి 5

ABN , First Publish Date - 2020-11-25T06:53:26+05:30 IST

రూపాయికి చిన్న చాక్లెట్‌ కూడా రాని ఈ రోజుల్లో రైతులు ఆరుగాలం శ్రమించి, పండించిన నిమ్మకాయలు ఏకంగా ఐదు ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీనిని బట్టి నిమ్మ ధరలు ఎంత దారుణంగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

రూపాయికి 5
తోటలో కోసిన నిమ్మకాయలు

దారుణంగా పడిపోయిన నిమ్మ ధరలు

బస్తా రూ.200 నుంచి రూ.300లోపే..

పెట్టుబడి కూడా దక్కని దుస్థితి

పూర్తిగా నష్టపోతున్న అన్నదాతలు

యాడికి, నవంబరు 24: రూపాయికి చిన్న చాక్లెట్‌ కూడా రాని ఈ రోజుల్లో రైతులు ఆరుగాలం శ్రమించి, పండించిన నిమ్మకాయలు ఏకంగా ఐదు ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీనిని బట్టి నిమ్మ ధరలు ఎంత దారుణంగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో పె ట్టుబడి కాదు కదా.. కనీసం పంట కోత కూలీలు, మార్కెట్‌కు తరలించే రవాణా చార్జీలు కూడా దక్కక అన్నదాత పూర్తిగా నష్టపోతున్నాడు. మండలంలోని వెంగన్నపల్లి, కోనుప్పలపాడు, ఓబుళాపురం, కత్తిమానుపల్లి, గుడిసెలు, లక్షుంపల్లి, కేశవరాయునిపేట తదితర గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేశారు. గతేడాది, అంతకు ముందు ఏడాది నిమ్మకాయల ధర బస్తా రూ.5 వేల వరకు పలికింది. దీంతో నిమ్మ సాగువైపు రైతులు ఎక్కువ మక్కువ చూపారు. ఈ ఏడాది పరిస్థితి తిరగబడింది. బస్తా నిమ్మకాయల ధర కేవలం రూ.200 నుంచి రూ.300 మాత్రమే పలుకుతోంది. దీంతో కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. బస్తాకు 1100 నిమ్మకాయలు నింపుతారు. ఆ ప్రకారంగా రైతు రూపాయికి 5 నిమ్మకాయల చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు నిమ్మపంటను రాయలచెరువులోని మండీల్లో విక్రయిస్తుంటారు. ఇక్కడి నుంచి కర్నూలు, పత్తికొండ, బళ్లారి, హుబ్లీ, మైసూర్‌ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో నిమ్మకాయల వాడకం పెరిగినా.. చలికాలం వచ్చేసరికి వ్యాపారం ఏమాత్రం ఉండదని ఈ కారణంతోనే నిమ్మకాయల రేటు భారీగా పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.


కూలీల ఖర్చు కూడా రావట్లేదు: వెంకటరెడ్డి, నిమ్మ రైతు, వెంగన్నపల్లి

ప్రస్తుతం నిమ్మకాయల బస్తా ధర రూ. 200 పలుకుతోంది. చెట్లమీదనే కాయలు వదిలేయలేక, కోస్తున్నాం. కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కట్లేదు. బహిరంగ మార్కెట్‌ లో నిమ్మకాయలకు డిమాండ్‌ ఉన్నప్పటికీ, రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు. దీంతో రైతులు అప్పుల పాలు కావాల్సి వస్తోంది.

Updated Date - 2020-11-25T06:53:26+05:30 IST