డైటింగ్‌లో ఉన్నా.. భోజనం వద్దు..

ABN , First Publish Date - 2020-06-16T16:48:29+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్..

డైటింగ్‌లో ఉన్నా.. భోజనం వద్దు..

అనంతపురం(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తాడిపత్రి పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా సాగింది. నేనున్నాను... ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉం టుందన్న భరోసాను పార్టీ శ్రేణుల్లోకి పంపినట్లయింది.  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిల అరెస్టు నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్‌ సోమవారం తాడిపత్రికి వచ్చారు. దీంతో టీడీపీ జిల్లా నాయకత్వమంతా లోకేష్‌ వెంట నడిచింది. దాదాపు రెండు గంటల పాటు నారా లోకేష్‌ జేసీ నివాసంలోనే గడిపారు.


అనంతరం జిల్లాలోని ముఖ్య నేతలతో ఆయన సమాలోచనలు జరిపారు. అధికార పార్టీ సాగిస్తున్న అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలపై ఆరా తీశారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమష్టిగా అధికార పార్టీ నేతల దాడులను ఎదుర్కోవాలని, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించే గొంతుక కావాలని ఆయన జిల్లా నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. బాధితుల పక్షం టీడీపీ అన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సి బాధ్యతను భుజానికెత్తుకోవాలని సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా జిల్లాలో లోకేష్‌ పర్యటన ఆ పార్టీ నాయకత్వం, శ్రేణుల్లోనూ నూతనోత్తేజాన్ని నింపింది. 


డైటింగ్‌లో ఉన్నా.. భోజనం వద్దు..

జేసీ నివాసంలో ఏర్పాటు చేసిన భోజనాన్ని తీసుకొనేందుకు నారా లోకేష్‌ నిరాకరించారు. కొన్నినెలలుగా డైటింగ్‌లో ఉన్నానని జేసీ పవన్‌తో చెప్పారు. అయినా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ పవన్‌ల బలవంతంపై స్వల్పంగా ఆహారం తీసుకున్నారు. అనంతరం అందరికి వీడ్కోలు పలుకుతూ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో  అమరావతికి బయలుదేరి వెళ్లారు.  నారా లోకేష్‌ పర్యటనలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-16T16:48:29+05:30 IST