వంచక వలంటీర్!
ABN , First Publish Date - 2020-07-19T19:41:41+05:30 IST
శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన..

కడుపు చేసి.. ముఖం చాటేసిన గ్రామ వలంటీర్
పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి
అనంతపురం(ఆంధ్రజ్యోతి): శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన గ్రామ వలంటీర్ పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతికి మాయమాటలు చెప్పి, వంచించాడు. కడుపు చేసి, ముఖం చాటేశాడు. బాధిత యువతి.. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. యువతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నాగులగుడ్డం తండా గ్రామ వలంటీర్‌గా కిరణ్‌నాయక్ పనిచేస్తున్నాడు. కర్నూ లు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన వరలక్ష్మీబాయి తండ్రి అనంతపురం నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
వరలక్ష్మీబాయి ఇంటర్ చదువుతోంది. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. తన తమ్ముడికి చికిత్స నిమిత్తం గతేడాది ఆస్పత్రికి వెళ్లిన కిరణ్‌కుమార్.. వరలక్ష్మితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ప్రేమిస్తున్నాననీ, తల్లిదండ్రులను సంప్రదించి పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి, వంచించాడు. ఆమెకు గర్భం వచ్చింది. రెండు నెలల క్రితం వరలక్ష్మి కుటుంబ సభ్యులు.. గ్రామ వలంటీర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇద్దరికీ పెళ్లి చేస్తామని కొద్ది రోజులు నమ్మబలుకుతూ వచ్చారు. ఇప్పుడేమో యువతికి, తనకు ఎలాంటి సంబంధం లేదని గ్రామ వలంటీర్ ముఖం చాటేశాడు.
దీంతో కుటుంబ సభ్యులతో కలిసి యువతి ఈనెల 17న రాత్రి శింగనమల పోలీస్‌స్టేషన్‌కు న్యాయం చేయాలని వెళ్లారు. నాగులగుడ్డం తండా పెద్ద మనుషులు ఇద్దరికి పెళ్లి చేస్తామని శనివారం వరకూ సమయం కావాలని తెలిపారు. శనివారం ఆ వలంటీర్ మళ్లీ తనకు సంబంధంలేదని మొండికేయటంతో యువతి తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పెళ్లి చేస్తామని పిలిపించి.. దాడి
శుక్రవారం శింగనమల పోలీస్‌స్టేషన్ వద్ద కిరణ్‌నాయక్‌కు తమ కుమార్తెకు పెళ్లి చేస్తామని పిలిపించి, దాడి చేశారని వరలక్ష్మి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. నాగులగుడ్డంతండా వద్ద కొండ ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు తమను పిలిపించారన్నారు. అక్కడికి వెళ్లగానే కిరణ్‌నాయక్ కుటుంబసభ్యులు తమపై దాడి చేశారన్నారు.
న్యాయం చేయండి సార్...: బాధిత యువతి
సార్.. నాకు మాయమాటలు చెప్పి, కులాలు ఒక్కటే కదా పెళ్లి చేసుకుంటానంటూ లొంగదీసుకుని, గర్భం చేశాడు. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు. కిరణ్‌నాయక్ నాతో తీసుకున్న వీడియోలు, మాట్లాడిన రికార్డులు నా వద్ద ఉన్నాయి. నాకు న్యాయం చేసేవరకూ పోరాటం చేస్తా.