వైసీపీలో సీట్ల తకరారు

ABN , First Publish Date - 2020-03-13T10:51:39+05:30 IST

నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైసీపీలో సీట్ల తకరారు మొదలైంది. ఆ పార్టీ తరపున పోటీలో నిలిచేవారి సంఖ్య పెరుగుతోంది.

వైసీపీలో సీట్ల తకరారు

ఒకే డివిజన్‌లో ఇద్దరి కంటే ఎక్కువమంది పోటీ

నేటి ఉదయం వరకు ఉత్కంఠే

 సిట్టింగులను మార్చవద్దని ఆదేశం..?


అనంతపురం కార్పొరేషన్‌,మార్చి 12 : నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైసీపీలో సీట్ల తకరారు మొదలైంది. ఆ పార్టీ తరపున పోటీలో నిలిచేవారి సంఖ్య పెరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాగైనా గెలుస్తామనే భావనతో కొందరు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పార్టీని మోసిన వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు ఇస్తున్నారని ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరపాలక సంస్థలోని 50డివిజన్లకు గాను ఆ పార్టీ తరపున ఇప్పటివరకు 20 మందిలోపు పేర్లనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒకే డివిజన్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉండడమే. అలాంటి డివిజన్ల విషయంలో ఎవరికి అవకాశం కల్పిస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. గతంలో గెలిచిన వారికి కూడా ఈసారి అవకాశం కల్పించే విషయంలో ఆమోదం రాకపోవడంతో ఆ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు శుక్రవారం కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, పార్టీ హైకమాండ్‌ నుంచి సిట్టింగులను మార్చవద్దని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. 


ఒకే డివిజన్‌ నుంచే..

వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. ఒకే డివిజన్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇప్పటికే 1వ డివిజన్‌కు వైసీపీ తరపున హనుమంతు, లాలెప్ప నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఎవరికి అవకాశం ఇస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 15వ డివిజన్‌లో జాహ్నవి, మల్లికార్జున పోటీ పడుతున్నట్లు తెలిసింది. 42వ డివిజన్‌లో తమకు అవకాశం ఇవ్వాలని రహంతుల్లా, చంద్రశేఖర్‌యాదవ్‌ కోరుతున్నారు. 43వ డివిజన్‌టికెట్‌ మాజీ కార్పొరేటర్‌ దుర్గే్‌షతో పాటు రిజ్వాన్‌ కోరుతున్నట్లు తెలిసింది. మహాలక్ష్మి శ్రీనివాస్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న 25వ డివిజన్‌లో తనకు అవకాశం ఇవ్వాలని మరో యువనాయకుడు కోరినట్లు సమాచారం.


అయితే ఇదే డివిజన్‌లో వైసీపీ నుంచి భార్యాభర్తలు నామినేషన్లు వేయడం గమనార్హం. 23వ డివిజన్‌లో బోయవీధి నుంచి బోయ లలిత, మరో ఇద్దరు మహిళలు నామినేషన్లు వేసినట్లు సమాచారం. అలాగే 44వ డివిజన్‌ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు నాయకులు పోటీపడుతున్నట్లు తెలిసింది. 14వ డివిజన్‌ నుంచి అబుల్‌సాలెహ, మురళీకృష్ణ, 15వ డివిజన్‌ నుంచి శ్రీనివాసులు, ఉమామహేశ్వరి, 26, 27డివిజన్ల నుంచి ఇద్దరు చొప్పున, 8వ డివిజన్‌ నుంచి ఇద్దరు, 20 నుంచి ఇద్దరు, 10 నుంచి ముగ్గురు, 11 నుంచి ఇద్దరు చొప్పున, రెండో డివిజన్‌ నుంచి ఏకంగా ఐదుగురు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. 

Updated Date - 2020-03-13T10:51:39+05:30 IST