ఖద్దరు, ఖాకీ దోస్తీ..!

ABN , First Publish Date - 2020-03-12T10:12:10+05:30 IST

‘జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు అభ్యంతరకరంగా ఉంది. కండువా లేని వైసీపీ నాయకుల్లా వారు వ్యవహరిస్తున్నారు.’ ఇదీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముఖ్య నాయకుల ఆరోపణ.

ఖద్దరు, ఖాకీ దోస్తీ..!

విందు రాజకీయం

 రాప్తాడు ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి ఇళ్ల్లే వేదిక

ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో కలిసి పోలీసు అధికారుల భోజనం 

సోషల్‌ మీడియాలో ఫొటో హల్‌చల్‌ 

నివ్వెరపోతున్న జనం

విపక్షాల ఆరోపణలకు ఊతం


అనంతపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ‘జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు అభ్యంతరకరంగా ఉంది. కండువా లేని వైసీపీ నాయకుల్లా వారు వ్యవహరిస్తున్నారు.’ ఇదీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముఖ్య నాయకుల ఆరోపణ. ఇందుకు ఊతమిచ్చేలా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి నివాసంలో మాజీ ఐజీ, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు తాడిపత్రి రమే్‌షరెడ్డి సరసన కూర్చొని అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఇటుకలపల్లి సీఐ భాస్కర్‌గౌడ్‌, అనంతపురం నాలుగవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ సీఐ కత్తి శ్రీనివాసులు భోజనం చేస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియా, వాట్సా్‌పలో హల్‌చల్‌ చేస్తోంది. ఖాకీ, ఖద్దరు విందు రాజకీయానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోందనే 12విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటోను చూసిన జనం నివ్వెరపోతున్నారు. మేధావివర్గాలు, రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులు ఇలా వ్యవహరించడమేమిటనే ప్రశ్న ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. పోలీసులు ఎవరిపక్షమూ కాదని చెప్పే సాహసం చేయలేని పరిస్థితి ఉందనడానికిది తాజానిదర్శనం. ఉన్నతాధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారని అనేక గొంతుకలు ప్రశ్నిస్తున్నాయి.


స్థానిక సంస్థల ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పా ర్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు అధికారుల తీరు ఎలాంటి సంకేతాలు పంపుతుందో చెప్పకనే చెప్పవచ్చు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నాయకులతో అంటకాగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రాయదుర్గం రూరల్‌ సీఐ రాజా టీడీపీ నాయకులపై ప్రదర్శిస్తున్న జులుం ఇందుకు మరో నిదర్శనంగా చెప్పవచ్చు. ‘ఇంకా రెండేళ్లు ఇక్కడే ఉంటా.. మీ అంతు చూస్తాన’ంటూ విపక్షాలపై ఆయన విరుచుకుపడుతున్న వైనం చూస్తుంటే.. అధికార పార్టీ నేతలతో కొందరు పోలీసు అధికారులు జతకట్టారనే విపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. కాగా, ఖాకీ, ఖద్దరు విందు రాజకీయం ఫొటో సోషల్‌ మీడియాలో..  హల్‌చల్‌ చేస్తున్న విషయానికి వద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల రోజే ఆ ఫొటో తీసినట్లు సమాచారం. నగరంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 6న నిర్వహించారు. ఆ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశానంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యాహ్న భోజనానికి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి నివాసానికి వెళ్లగా.. మంత్రి బొత్స సత్యనారాయణ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంలోనే ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌తో కలిసి డీఎస్పీ, సీఐలు మధ్యాహ్న భోజనం చేశారు. రాజకీయ నాయకులతో కలిసి పోలీసులు భోజనం చేయడాన్ని ప్రజాస్వామ్యహితం కోరే అన్ని వర్గాలు తప్పుబడుతున్నాయి.


ఆ మరుసటిరోజే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలవుతుందని అటు రాజకీయ పక్షాలు.. ఇటు పోలీసులకూ తెలుసు. అధికార పార్టీ నాయకులకు ఆ సమాచారం ముందస్తుగానే ఉంటుందనడంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులతో కలిసి విందులో పాల్గొంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడం సాధ్యమేనా? అనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో పనిచేయగలరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2020-03-12T10:12:10+05:30 IST