మంత్రిగా వున్నావ్‌... నీళ్లివ్వలేవా?

ABN , First Publish Date - 2020-09-16T18:30:39+05:30 IST

‘మంత్రిగా ఉన్నావ్‌.. సొంత నియోజకవర్గానికే హంద్రీనీవా జలాలు తీసుకురాలేకపోయావ్‌..

మంత్రిగా వున్నావ్‌... నీళ్లివ్వలేవా?

శంకరనారాయణను నిలదీసిన రైతులు


హిందూపురం/పరిగి(అనంతపురం): ‘మంత్రిగా ఉన్నావ్‌.. సొంత నియోజకవర్గానికే హంద్రీనీవా జలాలు తీసుకురాలేకపోయావ్‌. ఏడాదిన్నరగా చెరువులను నింపుతామన్న మాటలే తప్పా... ఎప్పుడు నింపుతావ్‌’ అంటూ రైతులు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణను నిలదీశారు. మంగళవారం పరిగిలో జరిగిన ‘వైఎ్‌సఆర్‌ ఆసరా’ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న మంత్రి కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు. వారికి జలసాధన సమితి నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రితో రైతులు వాగ్వాదానికి దిగారు. గత ఏడాది నుంచి మండలంలోని చెరువులన్నింటిని నింపుతానని మాటిస్తున్నావు... మండలం దాటి మడకశిరకు హంద్రీనీవా కాలువలో నీరు పోతున్నా, పరిగిలో చెరువులకు మాత్రం చుక్కనీరు తీసుకురాలేకపోయావంటూ నిలదీశారు.


నీళ్లిచ్చేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర ఉప కాలువ కింద చెరువులకు నీరు ఇవ్వాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాన్వాయ్‌కు అడ్డుగా ఉన్న రైతులను పోలీసులు పక్కకు నెట్టివేశారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. అంతలోనే మంత్రి స్పందిస్తూ... ‘నాకు తెలుసు. అది నా బాధ్యత. అన్ని చెరువులకు నీళ్లు వస్తాయి’ అంటూ రైతులపైనే అగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులను పోలీసులతో పాటు వైసీపీ నాయకులు బలవంతంగా నెట్టివేయడంతో అక్కడున్న వారు ఆందోళన చెందారు. 

Updated Date - 2020-09-16T18:30:39+05:30 IST