ప్రాజెక్టుల నిర్మాణంతో జిల్లా సస్యశ్యామలం

ABN , First Publish Date - 2020-12-10T06:39:27+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రాజెక్టుల నిర్మాణంతో జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంతో  జిల్లా సస్యశ్యామలం
వెంకటంపల్లెలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. వేదికపై మంత్రులు సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ, ఎంపీ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

వర్చువల్‌ విధానంలో మూడు రిజర్వాయర్లకు సీఎం వైఎ్‌స జగన్‌ శంకుస్థాపన

పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 9:  

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రాజెక్టుల నిర్మాణంతో జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వెంకటంపల్లెలో బుధవారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు రూ.804 కోట్లతో నిర్మించ తలపెట్టిన మండలంలోని దేవరకొండ, ఆత్మకూరు మండలంలోని ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన పైలాన్‌ను మాత్రం వెంకటంపల్లెలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ టీడీపీ హయాంలో రూ.804 కోట్లతో ఒకప్రాజెక్టును చేపట్టి, దానిని కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. ప్రస్తుతం అవే నిధులతో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. టీడీపీ పాలనలో జిల్లాను కరువు పట్టి పీడించిందన్నారు. ప్రస్తుతం మంచి వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు.


మత్స్యసంపద వృద్ధి

మూడు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల జిల్లాలో మత్య్ససంపద అభివృద్ది చెందుతుందని మంత్రి సీదిర్చి అప్పలరాజు పేర్కొన్నారు. దీంతో దాదాపు 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గం మరో కోనసీమగా మారుతుందన్నారు.


చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు వెన్నుపోటు పొడవటం తప్పా.. అభివృద్ధి  చేయటం తెలియదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. వైఎ్‌సఆర్‌ హయాంలో రూ.5,800 కోట్లతో హంద్రీనీవా పథకం పనులు 80 శాతం పూర్తి చేశారన్నారు. టీడీపీ హయాంలో చేసిందేమీ లేదన్నారు.


ఇచ్చిన మాటకు కట్టుబడి..

ఇచ్చిన మాటకు కట్టుబడి పేరూరు ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకొచ్చామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.804 కోట్లతో దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి ప్రాజెక్టులను నిర్మించి 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నియోజకవర్గానికి 26 వేల ఇళ్లు మంజూరయ్యాయనీ, త్వరలో పేదలకు పట్టాలను పంపిణీ చేస్తామన్నారు.   ఈ సభలో  కలెక్టర్‌ గందం చంద్రుడు, జేసీ నిశాంత్‌కుమార్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీలు మహమ్మద్‌ ఇక్బాల్‌, వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, వై.వెంకటరామిరెడ్డి, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, గంగుల భానుమతి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, ఏడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు వీరాంజనేయులు, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, మండల కన్వీనర్‌ నరిసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పేరు మార్పు

అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల పథకానికి డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ అప్పర్‌ పెన్నార్‌గా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వర్చువల్‌ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ ఉత్తర్వులను ప్రజల ముందుంచారు. దీంతో పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరును మార్చినట్లయింది. 


రక్తపుటేరులు పారించిన గడ్డపై సాగునీరు పారిస్తున్నాం

పరిటాల రవీంద్రపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ధర్మవరం : పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గడ్డపై రక్తపుటేరులు పారించారనీ, ప్రస్తుతం ఇక్కడే తాము సాగు నీరు పారిస్తున్నామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లిలో బుధవారం చేపట్టిన రిజర్వాయర్ల శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడారు. పరిటాల రవీంద్ర నక్సలిజం, ఫ్యాక్షనిజం ముసుగులో ఎందరో తలలు నరికి రక్తాన్ని పారించారన్నారు. ఇదంతా చంద్రబాబునాయుడు సహకారంతో సాగిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇదే గడ్డపై లక్ష ఎకరాల్లో సాగునీరు పారిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీని పదేళ్లు పాలించే అవకాశం ఉన్నా.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, అక్కడి నుంచి దొంగలా అమరావతికి పారిపోయి వచ్చాడని ప్రతిపక్ష నేతపై వివాదాస్పదంగా మాట్లాడారు. ఎంపీ వ్యాఖ్యలను సభలోనే పలువురు  తప్పుబట్టారు.సభ మధ్యలోనే జనం ఇంటిదారి..

చెన్నేకొత్తపల్లి మండలంలోని వెంకటంపల్లిలో బుధవారం నిర్వహించిన రిజర్వాయర్ల శంకుస్థాపన సభ వైసీపీ శ్రేణులకు కొంత నిరుత్సాహాన్ని మిగిల్చింది. సభ సాగుతుండగానే జనం నిష్క్రమించడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ కార్యక్రమం 1-30 గంటలకు ముగిసింది. ఆ తరువాత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. మంత్రులు ఒక్కొక్కరుగా ప్రసంగాలను మొదలుపెట్టారు. అప్పటికే సభా ప్రాంగణం నుంచి జనం వెళ్లిపోవటం కనిపించింది. వేదికపై ఉన్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా జనం పట్టించుకోకుండా  వెళ్లిపోవటం కనిపించింది. పరిస్థితిని గమనించిన మంత్రులు త్వరగా ప్రసంగాలను ముగించారు. సభను ముగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే సభలో దాదాపు సగభాగం కుర్చీలు ఖాళీ అయ్యాయి.

Updated Date - 2020-12-10T06:39:27+05:30 IST