అర్ధరాత్రి దాకా.. జడ్పీలో నామినేషన్ల జాతర

ABN , First Publish Date - 2020-03-12T10:23:17+05:30 IST

నామినేషన్ల చివరి రోజు బుధవారం జడ్పీటీసీ అభ్యర్థులు పోటెత్తారు. ఒక విధంగా చెప్పాలంటే జడ్పీలో నామినేషన్ల జాతర జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో పలుపార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలుచేశారు.

అర్ధరాత్రి దాకా.. జడ్పీలో నామినేషన్ల జాతర

భారీగా తరలివచ్చిన అభ్యర్థులు

జడ్పీటీసీ స్థానాలకు 456..

ఎంపీటీసీ స్థానాలకు 4,602 నామినేషన్లు

కిక్కిరిసిన ఆవరణ 


మాజీ మంత్రి సునీత  ఆధ్వర్యంలో పది మంది దాఖలు 


రొద్దం నుంచి టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా విశాలాక్షి..

ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే ప్రకాష్‌  ఆధ్వర్యంలో గిరిజమ్మ..

ఎమ్మెల్యే పద్మావతి ఆధ్వర్యంలోనూ పలువురి దాఖలు

5 కౌంటర్లు పరిశీలించిన కలెక్టర్‌ గంధం చంద్రుడు

తమ వంతు కోసం అర్ధరాత్రి దాటినా అభ్యర్థుల ఎదురుచూపులు


అనంతపురం విద్య, మార్చి 11:  నామినేషన్ల చివరి రోజు బుధవారం జడ్పీటీసీ అభ్యర్థులు పోటెత్తారు. ఒక విధంగా చెప్పాలంటే జడ్పీలో నామినేషన్ల జాతర జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో పలుపార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలుచేశారు. ఏకంగా 435మంది అభ్యర్థులకు 5 కౌంటర్ల వద్ద నామినేషన్లు వేసేందుకు టోకెన్లు జారీచేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఆఽధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు నామినేషన్లు వేయగా, ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో పలువురు అధికార పార్టీ వైసీపీ తరపున నామినేషన్లు వేశారు. బుధవారం ఆఖరు రోజు కావడంతో పెద్దఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రికి పైగా కొనసాగింది. 


పార్టీ పెద్దలు వెంట రాగా..

జడ్పీటీసీ స్థానాలకు పలు పార్టీల అభ్యర్థులు తమ పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి గాండ్ల విశాలాక్షి రొద్దం మండలానికి చెందిన జీవీఎస్‌ నాయుడు, ఇతర నాయకులతో వచ్చి నామినేషన్‌ వేశారు. అలాగే మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో రాప్తాడుకు వెంకటరమణ, రామగిరికి రంగయ్య, కనగానపల్లికి రామలింగయ్య, సీకేపల్లికి రామకృష్ణారెడ్డి, ఆత్మకూరుకు ప్రతాప్‌, బత్తలపల్లికి నారాయణరెడ్డి, ముదిగుబ్బకు సునీతాబాయి, తాడిమర్రికి అరుణతోపాటు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు, ఆత్మకూరు జడ్పీటీసీ స్థానాలకు గిరిజమ్మ, తనకల్లు స్థానానికి జక్కల జ్యోతి నామినేషన్లు వేశారు. అలాగే శింగనమల ఎమ్మెల్యే పద్మావతి ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు వైసీపీ తరపున నామినేషన్లు వేశారు.


కలెక్టర్‌ ఆకస్మిక పరిశీలన..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆకస్మికంగా జడ్పీలోని అనంతపురం, పెనుకొండ, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం కౌంటర్లను పరిశీలించారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్ల(ఏఆర్వోలు)నడిగి నామినేషన్లు ఎలా స్వీకరిస్తున్నారో తెలుసుకున్నారు. తరువాత వాటిని ఎక్కడ భద్రపరుస్తారు..ఏం చేస్తారంటూ ఆయన జడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణిని ఆరా తీశారు. అలాగే నామినేషన్లకు ఎంతమందిని అనుమతిస్తున్నారంటూ పోలీసు సిబ్బందిని అడిగారు. తరువాత పలువురు అభ్యర్థులను కూడా ఆయన పలకరించారు. ఇతర ఏర్పాట్లపైనా సీఈఓతో మాట్లాడారు.


అర్ధరాత్రి దాకా..

జడ్పీటీసీ స్థానాలకు చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సా యంత్రం 5 గంటల వరకూ అభ్యర్థులకు టోకెన్లు జారీచేశారు. కాగా, ఒక్కో అభ్యర్థి నామినేషన్‌ ధ్రువీకరించడానికి సుమారు అర్ధగంటకుపైగా సమయం పట్టింది. వందలాది అభ్యర్థులు తమవంతు కోసం ఎదురు చూస్తూవచ్చారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రికి పైగా కొనసాగింది. మొత్తం మీద ఎంపీటీసీ స్థానాలకు జిల్లాలో 4602 నామినేషన్లు దాఖలయ్యా యి. జెడ్పీటీసీ స్థానాలకు 456 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు ప్రకటిం చా రు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా యంత్రాంగం నామినేషన్ల ప్రక్రియలో నిమ గ్నమయింది.

Updated Date - 2020-03-12T10:23:17+05:30 IST