విద్యార్థుల ఇంటికే మధ్యాహ్న భోజన సరుకులు

ABN , First Publish Date - 2020-03-24T10:38:35+05:30 IST

కోవిడ్‌- 19 కారణంగా విద్యార్థులకు ఇళ్ల వద్దకే మధ్యాహ్న భోజన పథకం కింద రైస్‌, కోడి గుడ్లు ఇతర పదార్థాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విద్యార్థుల ఇంటికే మధ్యాహ్న భోజన సరుకులు

వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా సరఫరా.. 19 నుంచి 31తేదీ 

వరకూ లెక్కకట్టి అందజేత..  ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఉత్తర్వులు


అనంతపురం విద్య, మార్చి 23 : కోవిడ్‌- 19 కారణంగా విద్యార్థులకు ఇళ్ల వద్దకే మధ్యాహ్న భోజన పథకం కింద రైస్‌, కోడి గుడ్లు ఇతర పదార్థాలను  అందించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా వీటిని విద్యార్థుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లి వారి తల్లిదండ్రులకు ఇవ్వనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా వైర్‌సప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 19 వ తేదీనుంచి 31వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే సెలవుల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఎం డీఎం(మధ్యాహ్న భోజనం) సరుకులను విద్యార్థులకు అం దించేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. 


8 గుడ్లు, బియ్యం, చిక్కీలు...

సెలవులు ఇచ్చిన 19వ తేదీ నుంచి 31వతేదీ వరకూ లెక్క కట్టి విద్యార్థులకు సరుకులు అందించనున్నారు. ప్రైమరీస్కూల్‌ విద్యార్థులకు కేజీ బియ్యం, అప్పర్‌ ప్రైమరీ విద్యార్థులు, హై స్కూల్‌ విద్యార్థులకు 1.5 కేజీల బియ్యం ఇవ్వనున్నారు. అదేవిధంగా అన్ని తరగతుల విద్యార్థులకు 8 కోడిగుడ్లు, 4 చిక్కీలు (25 గ్రాములు ఉండే శనగకాయల బర్ఫీలు) అందించనున్నారు. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆయన ఆర్జేడీలు, డీఈఓలను ఆదేశించారు.

Read more