పులకించిన లేపాక్షి
ABN , First Publish Date - 2020-03-08T11:38:36+05:30 IST
లేపాక్షి వైభవం చాటుతూ నిర్వహించిన ఉత్సవాలకు లేపాక్షి పర్యాటక గ్రామం పులకించింది. రెండు రోజుల లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా శోభాయాత్ర నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. ఇందులో కలెక్టర్ గంధం

హిందూపురం/లేపాక్షి: లేపాక్షి వైభవం చాటుతూ నిర్వహించిన ఉత్సవాలకు లేపాక్షి పర్యాటక గ్రామం పులకించింది. రెండు రోజుల లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా శోభాయాత్ర నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. ఇందులో కలెక్టర్ గంధం చంద్రుడు, పర్యాటక శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లపై సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా వేషధారణలతో వారు ముందుకు సాగగా, వెనుక ఎడ్ల బండ్లు, కీలుగుర్రాలు, గొరవయ్యలు, కోలాటం, కర్రసాము, డ్రమ్ములు, మరగాళ్లు, ఉరుములు, చెక్కభజనలు, పగటి వేషగాళ్లు, తప్పెట్లు, వీధి నాటకాలు, కొమ్ములతో ఆయా కళాకారులు అబ్బురపరిచారు. అనంతరం ఏపీజేబీసీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదికపై పర్యాటక ఎండీ, కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. లేపాక్షి శిల్పకళ ఉట్టిపడేలా ఏర్పాటుచేసిన సెట్టింగులు ఉత్సవాలకు ఊపునిచ్చాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్యం, లేపాక్షి వైభవం తెలిపే పాటలు, సినీ గాయకుల గీతాలు, మిమిక్రీ, లేజర్‌షో ఆకట్టుకున్నాయి. అలాగే సభా ప్రాంగణంలో పల్లె వాతావరణం ఉట్టిపడింది. అలనాటి ప్రజల జీవన విధానం, కుమ్మరి, వడ్రంగి, పాడిఆవులు, పెరటి కోళ్లు, సోది చెప్పడం, చేనేత ప్రదర్శన, చిలక జోస్యం, స్టాల్స్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, కూచిపూడి, భరతనాట్యం, శివతాండవం, గ్రామీణ క్రీడాపోటీలు, రాయలసీమ రుచులు, లేపాక్షి చేతి వృత్తులు తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ లేపాక్షి వైభవాన్ని చాటేందుకు ఏపీ పర్యాటక శాఖ ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ఈ ఉత్సవాల్లో లేపాక్షి ఘనచరిత్ర, రాయలసీమ సంస్కృతీసంప్రదాయాలు భవిష్యత్తులో గుర్తుండిపోయేలా నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటక శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు లేపాక్షి వైభవాన్ని ఒక వేదికగా చేసుకున్నామన్నారు. సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. లేపాక్షి, పుట్టపర్తి, కడప జిల్లాలోని గండికోట, కర్నూలు జిల్లాలోని ఓర్వగల్లును ఒక సర్క్యూట్‌గా చేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ఢిల్లీరావు, జేసీ-2 రామ్మూర్తి, పెనుకొండ సబ్‌కలెక్టర్ నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, టూరిజం ఆర్డీ ఈశ్వరయ్య, ఏఎస్పీ రామాంజనేయులు, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.