ఉత్సవాలకు లేపాక్షి ముస్తాబు

ABN , First Publish Date - 2020-03-04T06:54:51+05:30 IST

ఉత్సవాల పండగకు లేపాక్షి ముస్తాబవుతోంది. శిల్పకళల కాణాచిగా పేరు గాంచిన ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు రెండు రోజుల ఉత్సవాలకు సిద్ధమవుతోంది.

ఉత్సవాలకు లేపాక్షి ముస్తాబు

చకా చకా సాగుతున్న ఏర్పాట్లు  

రేపు ‘పురం’లో  5కే రన్‌


హిందూపురం/ లేపాక్షి మార్చి 3: ఉత్సవాల పండగకు లేపాక్షి ముస్తాబవుతోంది. శిల్పకళల కాణాచిగా పేరు గాంచిన ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు రెండు రోజుల ఉత్సవాలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 7, 8వ తేదీల్లో లేపాక్షి 2020 ఉత్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఉత్సవాల గడువు దగ్గర పడతున్న నేపథ్యంలో మంగళవారం లేపాక్షిలోని సభా వేదికకు వచ్చే రహదారికి ఇరువైపులా.. నవోదయ పాఠశాల నుంచి కేజీబీవీ వరకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కొడికొండ చెక్‌పోస్టు, లేపాక్షి, హిందూపురంలలో ఉత్సవ సంబరాలను సూచించే పెద్ద బెలూన్లు ఎగురువేయగా.. అవి ఆహ్వానం పలుకుతున్నాయి. ఉత్సవాల భారీ వేదిక, మౌలిక వసతుల  ఏర్పాట్లపై ఆయా శాఖల అధికార యంత్రాంగం బిజీగా ఉన్నారు.   ఉత్సవాల కోసం వచ్చే అథితుల విడిది కోసం ఇప్పటికే హిందూపురం, పెనుకొండ, చిలమత్తూరు, పరిగి, లేపాక్షిలలో   ఏర్పాట్లు  చేస్తున్నారు. ఈనెల 5వతేదీన 5కేరన్‌, అదేవిధంగా 6న సైకిల్‌ర్యాలీ, 7న శోభయాత్ర, 8న ఉత్సవ జాతర నిర్వహించనున్నారు.


ఈ ఉత్సవాలపై డీఈఓ శామ్యూల్‌ హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో మంగళవారం ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డ్వామాపీడీ నాగరాజు, ఎంఈఓ గంగప్ప, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్సవాల షెడ్యూలుపై బుధవారం జిల్లాకేంద్రంలో కలెక్టర్‌  సమీక్ష సమావేశం  నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉత్సవాలకు పలువురు సినీ గాయకులు వస్తున్నారు. బుధ, గురువారాల్లో ఉత్సవాలకు ఎవరెవరు వస్తారు, ఏఏ కార్యక్రమాలుంటాయి అనే పూర్తీషెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2020-03-04T06:54:51+05:30 IST