లాసెట్‌ ర్యాంకుల్లో వెనుకబడ్డ అనంత

ABN , First Publish Date - 2020-11-06T06:46:21+05:30 IST

న్యాయ శాస్త్ర (లా) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌-2020 ఫలితాలను గురువారం ప్రకటించారు.

లాసెట్‌ ర్యాంకుల్లో వెనుకబడ్డ అనంత
లాసెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న రెక్టార్‌ కృష్ణానాయక్‌, కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, ప్రొఫెసర్‌ పుల్లారెడ్డి తదితరులు

 ఫలితాలు విడుదల

 5వ ర్యాంకు సాధించిన జిల్లావాసి దివ్యశ్రీ


ఎస్కేయూ, నవంబరు5 : న్యాయ శాస్త్ర (లా) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌-2020 ఫలితాలను గురువారం ప్రకటించారు. ఎస్కేయూ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స హాల్లో రెక్టార్‌ ప్రొఫెసర్‌ కృష్ణానాయక్‌, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌, ప్రొఫెసర్‌ పుల్లారెడ్డి, డా. శ్రీరాములు, డా. రామగోపాల్‌ ఫలితాలను విడుదల చేశారు. రెక్టార్‌ కృష్ణానాయక్‌ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ వరుసగా 6వ సారి లాసెట్‌ను దిగ్విజయంగా నిర్వహించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లాసెట్‌కు 18371 మంది దరఖాస్తు చేసుకోగా 12284 మంది పరీక్షకు హాజరయ్యారని ఇందులో 11226 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తంగా ఉత్తీర్ణత శాతం 91.39 శాతంగా ఉందన్నారు. విద్యార్థులు గురువారం నుంచే ర్యాంకు కార్డులు డౌనలోడ్‌ చేసుకోవచ్చన్నారు. కొవిడ్‌తో పరీక్షకు హాజరుకాని వారి కోసం అక్టోబరు 31న 50 మందికి పరీక్ష నిర్వహించామన్నారు. లా కోర్సుకు గత ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2019లో 13389 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు.  


 వెనుకబడ్డ అనంత...

ఏపీ లాసెట్‌లో మెరుగైన ర్యాంకుల సాధనలో అనంత వెనుకబడింది. ప్రతి ఏటా టాప్‌-10లో మంచి ర్యాంకులు జిల్లా విద్యార్థులు సాధించేవారు. ఈ ఏడాది బుక్కపట్నం మండలం జూటూరు దివ్యశ్రీ మూడు సంవత్సరాల లా కోర్సులో 5వ ర్యాంకు సాధించింది. జిల్లాలో 6 సెంటర్లలో 924 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 714 మంది ఉత్తీర్ణత సాధించారు.  3 సంవత్సరాల లా కోర్సుకు 751 మంది దరఖాస్తు చేసుకోగా 541 మంది ఉత్తీర్ణత సాధించారు. 2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 49 మంది దరఖాస్తు చేసుకోగా 40 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 40 మంది ఉత్తీర్ణత సాధించారు. . 5 సంవత్సరాల లా కోర్సుకు 124 మంది రిజిస్టర్‌ చేసుకోగా 86 మంది పరీక్షకు హాజరయ్యా రు. 76 మంది ఉత్తీర్ణత సాధించారు.  


పేదలకు ఉచితంగా న్యాయసేవలు - దివ్యశ్రీ, లాసెట్‌ 5వ ర్యాంకర్‌

పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తానని 3 సం వత్సరాల లాసెట్‌ కోర్సులో 5వ ర్యాంకు సాధించిన జూటూరు దివ్యశ్రీ పేర్కొంది.  బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామానికి చెందిన జూటూరు దివ్యశ్రీ ఏపీ లాసెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. నాన్న చిన్నతనంలోనే చనిపోయినా... అమ్మ కష్టపడి చదివించింది. తన అక్క కూడా లా చదువుతోందని ఆమెనే ఆదర్శంగా తీసుకుని లాసెట్‌లో మంచి ర్యాంకు సాధించానని పేర్కొంది. పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిందని, క్రిమినల్‌ లాయర్‌గా స్థిరపడాలన్నది తన ఆశయమని పేర్కొంది. 



Updated Date - 2020-11-06T06:46:21+05:30 IST