దడ పుట్టిస్తున్న కోయంబేడు మార్కెట్‌

ABN , First Publish Date - 2020-05-13T10:15:36+05:30 IST

తమిళనాడులో కరోనాకు కేంద్రబిందువైన చెన్నై కోయంబేడు మార్కెట్‌ తాజాగా జిల్లా వాసులను దడ పుట్టిస్తోంది

దడ పుట్టిస్తున్న కోయంబేడు మార్కెట్‌

తాడిపత్రి ప్రాంతంలో 250 మంది వరకు వ్యాపార సంబంధాలు

రెండు రోజుల్లో గుర్తించిన 160 మందికి క్వారంటైన్‌


  తాడిపత్రి, మే 12 : తమిళనాడులో కరోనాకు కేంద్రబిందువైన చెన్నై కోయంబేడు మార్కెట్‌ తాజాగా జిల్లా వాసులను దడ పుట్టిస్తోంది. అక్కడి మార్కెట్‌తో నేరుగా వ్యాపార సంబంధాలు సాగించిన వారికి కరోనా సోకి ఉండవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్‌కు అందిన జాబితాలో ఎక్కువగా తాడిపత్రి పరిసర ప్రాంతంలో 250 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కరివేపాకు, చీనీ, జామ తదితర పంట ఉత్పత్తులను కోయంబేడు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రధానంగా తాడిపత్రి పరిసర మండలాలకు కోయంబేడు కేంద్రంగా ఉంది. ప్రతిరోజూ వందకు పైగా ఐచర్‌ వాహనాలతో పాటు ఇతర వాహనాలు వివిధ రకాల పండ్లను తీసుకొని కోయంబేడు మార్కెట్‌కు పోతున్నాయి.


అక్కడి వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్నారు. ఈ క్రమంలో లావాదేవీలు జరిపిన వ్యాపారులతో పాటు నెలరోజుల నుంచి కోయంబేడుకు వెళ్లిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల లిస్టును అక్కడి వైద్యసిబ్బంది, పోలీసులు తయారుచేశారు. ఈ మేరకు ఇప్పటివరకు తాడిపత్రి ప్రాంతంలోని తాడిపత్రి పట్టణ, మండలంతో పాటు పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లోని 160 మందిని క్వారంటైన్‌కు తరలించారు. మరో వందమందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికోసం వివిధశాఖల అధికారులు గాలింపు జరుపుతూ దొరికిన వారిని క్వారంటైన్‌కు పంపుతున్నారు.  

Read more