కొవిడ్‌-19 పూర్తిస్థాయి ఆస్పత్రిగా కిమ్స్‌ సవేరా

ABN , First Publish Date - 2020-04-14T10:37:05+05:30 IST

నగరంలోని కిమ్స్‌ సవేరా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్‌-19 ఆస్పత్రిగా

కొవిడ్‌-19 పూర్తిస్థాయి ఆస్పత్రిగా కిమ్స్‌ సవేరా

జిల్లా వ్యాప్తంగా 6 ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స ...

723 నాన్‌ ఐసీయూ, 70 ఐసీయూ బెడ్లు సిద్ధం ... ప్రతిరోజూ పరీక్షలకు 

300 శాంపిళ్లు: కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని కిమ్స్‌ సవేరా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కరోనా వైరస్‌ చికిత్స కోసం ఆరు రకాల ఆస్పత్రులను ఎంపిక చేశామన్నారు. అందులో లైన్‌-1 ఆస్పత్రిగా కిమ్స్‌ సవేరా, లైన్‌-2 బత్తలపల్లి ఆర్డీటీ, లైన్‌-3 అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి, లైన్‌-4 హిందూపురం ప్రభుత్వాస్పత్రి, లైన్‌-5 నగరంలోని వైఎ్‌సఆర్‌ మెమోరియల్‌ ఆస్పత్రి, లైన్‌-6 చంద్ర సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఎంపిక చేశామన్నారు. ఆయా ఆస్పత్రుల్లో మొత్తంగా 793 బెడ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందులో 723 నాన్‌ ఐసీయూ, 70 ఐసీయూ బెడ్లు సిద్ధం చేశామన్నారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో సీరియస్‌ అయితే రాష్ట్రస్థాయి ఆస్పత్రులైన నెల్లూరు లేదా తిరుపతి ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. శాంపిల్‌ కలెక్షన్‌, పరీక్షలకు సంబంధించి జేసీ ఢిల్లీరావ్‌ను నోడల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో 18 మొబైల్‌ శాంపిల్స్‌ కలెక్షన్‌ వ్యాన్‌లను ఏర్పాటు చేశామన్నారు. అందులో 17 వ్యాన్‌లు జిల్లా వ్యాప్తంగా తిరుగుతాయని, ఒక వ్యాన్‌ డీఎంహెచ్‌ఓ పరిధిలో ఉంటుందన్నారు.


ప్రత్యేకంగా అనంతపురం డివిజన్‌ పరిధిలో 5 వ్యాన్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కో మొబైల్‌ వ్యాన్‌లో ఈఎన్‌టీ స్పెషలిస్టుతో పాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉంటారని, వారందరికి పీపీఈలు, మాస్క్‌లు, గ్లౌజులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా శాంపిల్‌ కలెక్షన్‌ వ్యాన్‌ల ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శాంపిల్స్‌ను సేకరిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 3వ రౌండ్‌ సర్వే ప్రైమరీ, సెకండరీ లెవల్‌ బృందాలతో చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 98 శాతం పూర్తి చేశామన్నారు. ఇంటింటి సర్వేలో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే శాంపిల్స్‌ సేకరిస్తున్నామన్నారు.  ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అనంతపురంలోని వీఆర్‌డీఎల్‌ కేంద్రంలో మాత్రమే టెస్టింగ్‌ ఉండేదన్నారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో అనుమానిత శాంపిల్స్‌ను పరీక్షించి పాజిటివ్‌ వచ్చిన కేసులను ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వీఆర్‌డీఎల్‌ కేంద్రంలో టెస్టింగ్‌ చేస్తామన్నారు. ప్రతిరోజూ 310 శాంపిల్స్‌ను పరీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు.


అనంతపురం వీఆర్‌డీఎల్‌లో 70, బత్తలపల్లి ఆస్పత్రిలో 240 శాంపిల్స్‌ మంగళవారం నుంచి టెస్టింగ్‌ చేసే విధంగా సిద్ధం చేశామన్నారు. బత్తలపల్లిలో ఏర్పాటు చేసిన ట్రూనాట్‌ మిషన్‌లో టెస్టింగ్‌ చేసి పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన కేసులకు సంబందించి వీఆర్‌డీఎల్‌లో మళ్లీ చెక్‌ చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌లు చేసే వైద్యులు ఇంటికి వెళ్లకుండా వారి భద్రత కోసం నగరంలోని రెండు లాడ్జిల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని క్వారంటైన్‌ కేంద్రాల్లో డాక్టర్లకు పీపీఈలు, ఇతరత్రా సామగ్రి అందజేశామన్నారు.


ప్రస్తుతం 7073 పీపీఈ కిట్లు, 1700 ఎన్‌-95 మాస్క్‌లు, 71000 సర్జికల్‌ మాస్క్‌లు, డాక్టర్‌ కిట్లు అందరికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. హిందూపురంలో ఆర్గానిక్‌ టర్నెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో సోమవారం 41 శాంపిల్స్‌ ఫలితాలు రాగా, అన్నీ నెగిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. మరో 30 శాంపిల్స్‌ నెగిటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయన్నారు. అనంతపురం ఆస్పత్రిలో కరోనా నివారణకు ఓపీని సపరేట్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి పాల్గొన్నారు.

Updated Date - 2020-04-14T10:37:05+05:30 IST