ఆదాయానికి క్షవరం

ABN , First Publish Date - 2020-11-26T06:35:31+05:30 IST

కసాపురం దేవస్థానానికి తలనీలాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ సంవత్సరం భారీగా గండి పడనుంది.

ఆదాయానికి క్షవరం
కసాపురం ఆలయం

నెట్టికంటి ఆలయానికి తలనీలాల భారం

టెండర్‌ కేటాయింపులో జాప్యం

కసాపురం దేవస్థానంలో వింత పరిస్థితి

గుంతకల్లు, నవంబరు 25: కసాపురం దేవస్థానానికి తలనీలాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ సంవత్సరం భారీగా గండి పడనుంది. ఏటా తలనీలాల టెండరు కేటాయింపు ద్వారా దేవస్థానానికి రూ.కోటి దాకా ఆదాయం లభించేది. ఈ సంవత్సరం తలనీలాల టెండరు తగిన ధరకు పాడకపోవటం, కరోనా కారణంగా రెండువిధాలా నష్టం ఏర్పడింది. ఇప్పటికి పలుమార్లు టెండర్‌ పిలిచి, వేలం నిర్వహించినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. రావాల్సిన ఆదాయం రాక పోగా, ప్రతి వారం భక్తులు సమర్పించే తలనీలాలను ప్రమాణాల ప్రకారం భద్రపరచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నెలాఖరులో మరలా తలనీలాల టెండర్‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారైనా టెండర్‌ కేటాయింపు కార్యక్రమం పూర్తయితే అంతేచాలన్నట్లు దేవస్థాన అధికారులు ఎదురు చూస్తున్నారు.


మూడుసార్లు టెండర్‌ నిర్వహించినా..

తలనీలాల టెండరు ద్వారా దేవస్థానానికి గరిష్టంగా రూ.1.75 కోట్ల దాకా ఆదాయం లభించింది. మూడేళ్లుగా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఆ మొత్తం తగ్గుతూ వస్తోంది. గత సంవత్సరం రూ.90.09 లక్షల ఆదాయం లభించింది. గత డిసెంబరులో కొత్త బిడ్లను ఆహ్వానించగా వేలంలో పాల్గొనడానికి కాంట్రాక్టర్లు రాకపోవడంతో టెండర్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత రెండుమార్లు సీల్డు టెండర్‌, బహిరంగ వేలం, ఆన్‌లైన్‌ బిడ్‌ రూపంగా కాంట్రాక్టర్ల ప్రతిపాదనలు స్వీకరించినా వారి నుంచి స్పందన కరువై, టెండర్‌ కేటాయింపు సాధ్యపడ లేదు. ఇప్పుడు మరలా 27వ తేదీన టెండర్లను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


భారీ నష్టం

ఈ సంవత్సరం జనవరిలో తలనీలాల టెండర్‌ కేటాయింపు జరక్కపోవడంతో ప్రతివారం భక్తులు సమర్పించే కురులను ఆలయ అధికారులే భద్రపరచాల్సి వస్తోంది. ఈ తలనీలాలను సైజులవారీగా నాణ్యత దెబ్బ తినకుండా భద్రపర్చాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 11 నెలలపాటు తలనీలాలను భద్రపరిచారు. ఇలా భద్రపరచిన తలనీలాలను వేరుగా వేలం వేసి, అమ్మేటప్పుడు మాత్రం కాంట్రాక్టర్లు సవాలక్ష సాకులు చెప్పి, అతి తక్కువ ధరకు దక్కిచుకోవడానికి అన్నిరకాల యత్నాలు చేస్తారు.  రూ.కోటి కంటే ఎక్కువ విలువచేసే తలనీలాలను రూ.40 లక్షలకు కూడా కొనట్లేదు. గతంలో ఇటువంటి అనుభవాలున్నాయి. ఈనెల 27వ తేదీన భద్రపరచిన తలనీలాలకు, రానున్న కాలానికి సంబంధించిన టెండర్‌ను నిర్వహించనున్నారు. సీల్డు కవర్‌ బిడ్‌, ఓపెన్‌ ఆక్షన్‌, ఆన్‌లైన్‌ బిడ్‌ రూపంగా టెండర్లను చేపట్టనున్నారు. ఈసారైనా టెండర్‌ ఖరారు కావాలని ఆలయ అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - 2020-11-26T06:35:31+05:30 IST