రాష్ట్ర వినాశనానికే మూడు రాజధానుల నిర్ణయం

ABN , First Publish Date - 2020-08-01T09:53:10+05:30 IST

రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ..

రాష్ట్ర వినాశనానికే మూడు రాజధానుల నిర్ణయం

సీఎం తీరుపై మాజీమంత్రి కాలవ పైర్‌


అనంతపురం, జూలై31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేస్తుందని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. విభజన చట్టానికి అనుబంధంగా రూపుదిద్దుకున్న రాజధాని నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయటం అన్యాయమన్నారు. రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా, ప్రజామోదంతో ఎంపిక చేశామన్నారు.


అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతికి అంగీకారం తెలిపారన్నారు. అమరావతిలో సుమారు రూ.50 వేలకోట్ల విలువ చేసే నిర్మాణాలు చేపడుతున్న వాస్తవాన్ని ఎవరూ దాచ లేరన్నారు. ఇప్పటికే శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టులు అమరావతి నుంచి నిర్విఘ్నంగా పని చేస్తున్నాయన్నారు. దాదాపు 1000 కి.మీ., దూరంలో ఉన్న విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించటం ద్వారా రాయలసీమకు జగన్మోహన్‌రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్‌ ఏకపక్షంగా ఆమోదించటం బాధ్యతారాహిత్యమేనన్నారు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై భారత అటార్నీ జర్నల్‌ న్యాయ సలహా తీసుకోవాలని ప్రతిపక్షాలు పదేపదే చేసిన విజ్ఞప్తులను సైతం గవర్నర్‌ పెడచెవిన పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-01T09:53:10+05:30 IST