సూర్య, చంద్రప్రభ వాహనంపై ఊరేగిన నారసింహుడు

ABN , First Publish Date - 2020-03-12T10:27:49+05:30 IST

కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నారసింహుడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

సూర్య, చంద్రప్రభ వాహనంపై ఊరేగిన నారసింహుడు

కదిరి, మార్చి 11 :  కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నారసింహుడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్యపూజా హోమం అనంతరం సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. సంధ్యా సమయంలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్‌దీపాలు, రంగురంగుల పూలతో అలంకరించిన వాహనాలను అధిరోహించిన శ్రీవారిని దర్శించుకోవడానికి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంబే శ్రీరామమూర్తి, అంబే రామచంద్ర కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. 


నేడు మోహినీ ఉత్సవం 

లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవానికి ఎంతోప్రాశస్త్యముంది. పాలసంద్రాన్ని మధించిన అనంతరం ఉద్భవించిన అమృతాన్ని దక్కించుకోవడానికి దేవతలు, అసురులు పోటీ పడతారు. రాక్షసులను ఏమార్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కే విధంగా చూడడానికి మహావిష్ణువు మోహినీ రూ పం దాలుస్తారని ప్రతీతి. ఇందులో భాగంగానే నారసింహుడు గురువారం మోహినీ రూపంలో దర్శనమిస్తారు.


సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు తిరువీధుల్లో మాత్రమే విహరిస్తారు. అయితే మోహినీ ఉత్సవం రోజు కోరిన భక్తుడి ఇంటి వద్దకు వెళ్లి ఆస్థానం నిర్వహించి, దర్శనమివ్వడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఏటా 100కు పైగా ఆస్థానాలు నిర్వహిస్తున్నారు. మల్లెలతో అలంకరించిన కుచ్చుల వాలుజడ, చంకన అమృత భాండాగారాన్ని ధరించి, హొయలు పోతున్న శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలి రానున్నారు. బ్రహ్మరథోత్సవానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో గురువారం నుంచి భక్తుల సంఖ్య పెరగనుంది..

Updated Date - 2020-03-12T10:27:49+05:30 IST