జేసీ పవన్‌, ప్రభాకర్‌చౌదరిల మధ్య.. రాజుకున్న టికెట్ల తంటా

ABN , First Publish Date - 2020-03-13T17:54:54+05:30 IST

స్థానికసంస్థల ఎన్నికలు మరోసారి టీడీపీలో..

జేసీ పవన్‌, ప్రభాకర్‌చౌదరిల మధ్య.. రాజుకున్న టికెట్ల తంటా

అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పోరులో నేతల రాజకీయం

12 స్థానాల కోసం జేసీ పవన్‌ రెడ్డి పట్టు

తిరస్కరిస్తున్న ప్రభాకర్‌ చౌదరి

రాజీనామాకైనా సిద్ధమేనంటున్న వైనం

అధిష్ఠానానికి చేరిన పంచాయితీ


అనంతపురం(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికలు మరోసారి టీడీపీలో ఆ రెండు వర్గాల మధ్య విభేదాలకు కేంద్రబిందువుగా మారాయి. అనంతపురం నగరపాలకసంస్థ ఎన్నికల్లో తాను సూచించినవారికి కొన్ని కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జి జేసీ పవన్‌ పట్టుబట్టుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అనంతపురం అర్బన్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాత్రం అలా ఇచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి తెగేసి చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అవసరమైతే దేనికైనా (రాజీనామాకు సైతం)సిద్ధమనే సంకేతాలు ఆయన పంపినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.


అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసిన సందర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థికంటే తనకే అధికంగా ఓట్లు వచ్చాయని, ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేస్తున్న తన వర్గీయులకు కనీసం 12 కార్పొరేటర్‌ స్థానాలైనా ఇవ్వాలని జేసీ పవన్‌ జిల్లా నాయకత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆ రెండువర్గాల మధ్య టికెట్ల లొల్లి బహిర్గతమైంది. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు జిల్లా నాయకత్వం ఎదుట ఆ ఇద్దరు నేతలు భీష్మించుకుకూర్చున్నారు.


దీంతో జిల్లా నాయకత్వం చేసేదేమీలేక పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు శుక్రవారం అఖరు రోజు కావడంతో ఆ లోగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అనే మీమాంసలో ఆ పార్టీ శ్రేణులున్నాయి. కాగా, ఇప్పటికే 40 డివిజన్లకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరో 10 కార్పొరేటర్‌ స్థానాలకు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు ఉంటుందని ఆయా పార్టీల అధినాయకత్వాలు వెల్లడించిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో పొత్తులో భాగంగా.. నగరపాకలక సంస్థ ఎన్నికల్లో 3 లేదా 4 సీట్లు తమకు కేటాయించాలని ఆ పార్టీ జిల్లా నాయకత్వం అడుగుతున్నట్లు సమాచారం. అలా కేటాయించాల్సి వస్తే మరో 6, 7 స్థానాలకు మాత్రమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ఈ వివాదానికి తెరపడితే.. టికెట్ల వివాదం సమసిపోనుంది. లేనిపక్షంలో పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోవడంతోపాటు.. ఎన్నికల్లో నష్టపోయే అవకాశాలుంటాయనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతూండడం గమనార్హం. మరి అధిష్ఠానం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2020-03-13T17:54:54+05:30 IST