హెచ్చెల్సీలో ఆఫ్ అండ్ ఆన్
ABN , First Publish Date - 2020-12-01T06:20:44+05:30 IST
తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటి సరఫరాను మంగళవారం నిలిపివేయనున్నారు. ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో నీటిని తీసుకునేందుకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా కోరటంతో బోర్డు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నేడు నీటి సరఫరా బంద్
11న పునఃప్రారంభం
వరి కోతలతో నీటి ఆవశ్యకత లేనందునే..
బోర్డుకు ఇరు రాష్ర్టాల విన్నపం..
ఆ మేరకు నిర్ణయం..
రాయదుర్గం, నవంబరు 30: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటి సరఫరాను మంగళవారం నిలిపివేయనున్నారు. ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో నీటిని తీసుకునేందుకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా కోరటంతో బోర్డు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పది రోజులపాటు నీటి విడుదలను నిలిపేయనున్నారు. 11వ తేదీన కాలవకు ఇరురాష్ట్రాల ఇండెంట్ నీటిని ఒకేసారి సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో తుంగభద్ర ఎగువ కాలువలో నీటి గలగలలు ఆగిపోనున్నాయి. ఇప్పటివరకు జలాశయం నుంచి అందిన జలాలను నేరుగా పీఏబీఆర్తోపాటు ఎంపీఆర్కు తరలిస్తూ మరోవైపు హెచ్ఎల్ఎంసీ, జీబీసీల పరిధిలో పంట సాగు, జిల్లా తాగునీటి అవసరాల కోసం వినియోగించారు. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ నుంచి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జలాల సరఫరా ప్రక్రియ ఎగుడుదిగుడుగా సాగింది. వర్షాలు సమృద్ధిగా కురవటంతో నీటి వినియోగంలో కొంత ఊరట కలిగింది. ప్రస్తుతం ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో పది రోజులపాటు నీటిని నిలుపుదల చేయగా ఆ సమయంలో కనీసం బలహీనంగా ఉన్న గట్లకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాకు 17.440 టీఎంసీల నీటి చేరిక
తుంగభద్ర జలాశయం నుంచి ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద ఇప్పటివరకు 17.440 టీఎంసీల జలాలు జిల్లాకు చేరాయి. ఈ ఏడాది జలాశయంలో 168 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బోర్డు.. హెచ్చెల్సీకి 25.755 టీఎంసీలు కేటాయించింది. అందులో జలాశయం వద్ద ఇప్పటివరకు 19.378 టీఎంసీలు విడుదల చేయగా ఆంధ్ర సరిహద్దుకు నీటి నష్టాలు పోను 17.440 టీఎంసీలు చేరింది. రోజుకు 2040 క్యూసెక్కుల ప్రకారం కాలువలో ప్రవాహం కొనసాగింది. ఈ ఏడాదికి సంబంధించి కేసీ కెనాల్ వాటా నుంచి 1.697 టీఎంసీల నీటిని హెచ్చెల్సీకి మళ్లించారు. దీంతో హెచ్చెల్సీ ద్వారా 27.452 టీఎంసీల నీరు జిల్లాకు అందనుంది. ప్రస్తుతం జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిశీలిస్తే పీఏబీఆర్లో 5.214, ఎంపీఆర్లో 3.792, సీబీఆర్లో 10.061, మాల్యవంతంలో 6.311, చాగల్లులో 0.950, పెండేకల్లులో 0.508, సత్యసాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 0.081 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నీటి సరఫరాకు పది రోజుల విరామం
తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా జిల్లాకు అందే జలాలకు పది రోజుల విరామం ప్రకటించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పంటలు కోత దశకు చేరటంతో నీటి అవసరం లేదని భావించి, పది రోజులపాటు సరఫరా నిలిపేయాల్సిందిగా కోరారు. దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇండెంట్ కలిసి, కాలువలో ఆంధ్ర సరిహద్దు వరకు ప్రవహించేవి. కర్ణాటక తనవాటా తీసుకోనపుడు ఆంధ్ర మాత్రమే తీసుకుంటే నీటి ప్రవాహ నష్టం అధికంగా భరించాల్సి ఉంటుంది. దీంతో ఇరు రాష్ట్రాలు కలిసి, నీటిని తీసుకున్నపుడే నష్టాలు కూడా పంచుకునే అవకాశం ఉంటుంది. నివర్ తుఫాను కారణంగా హెచ్ఎల్ఎంసీ, జీబీసీకు సంబంధించి పంటలు కోత దశకు చేరుకున్నాయి. పది రోజుల విరామం ప్రకటించినా.. పొలాల్లో తడికి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా నీటిని ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించాయి.
మరమ్మతులపై దృష్టి
ఎగువ కాలువలో నీటి ప్రవాహం రెండు వేల క్యూసెక్కులకుపైగా ఉన్నపుడు కొన్ని చోట్ల పైపింగ్లు ఏర్పడ్డాయి. అందులో ప్రధానంగా కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువుతో పాటు ఎగువనున్న బొమ్మనహాళ్ మండలంలో చిన్నపాటి పైపింగ్ పడింది. దీంతో పదిరోజుల్లో వాటిపై అధికారులు దృష్టిపెట్టి, మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర ఎగువ కాలువ గట్లు కూడా చాలాచోట్ల బలహీనంగా ఉన్నాయి. కొన్నిచోట్ల లైనింగ్ లేకపోగా.. ఎంబ్యాక్మెంట్ ప్రాంతంలో మరమ్మతులు చేయని ప్రదేశాల్లో కాలువలో నీటి ప్రవాహం పెంచితే నిత్యం ప్రమాదకర పరిస్థితిలో కాలువ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టి, కనీసం మిగిలిన నీటిని వృథా కాకుండా సకాలంలో తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కుంగిపోయిన గట్లను సరిచేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సి ఉంది. నివర్ తుఫాను కారణంగా కొన్నిచోట్ల గట్లు పూర్తిగా కుంగిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. వాటిపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.