-
-
Home » Andhra Pradesh » Ananthapuram » High alert on the border
-
సరిహద్దులో హై అలర్ట్
ABN , First Publish Date - 2020-03-24T10:34:50+05:30 IST
పట్టణ సమీపంలోని కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

హిందూపురం టౌన్/చిలమత్తూరు, మార్చి 23: పట్టణ సమీపంలోని కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వాహనాల రాకపోకలు పూర్తీగా నిలిపివేశారు. సరిహద్దు ప్రాంతమైన తూముకుంట చెక్‌పోస్టు వద్ద హిందూపురం మండల సీఐ శ్రీనివాసులు, గౌరీబిదునూరు రూరల్ ఎస్‌ఐ అవినాశ్ ఆధ్వర్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రయాణికులను వెనక్కు పంపుతున్నారు. గౌరీబిదునూరులో కరోనా వైర్‌సకు సంబంధించి పాజిటివ్ కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో వంద ఆటోలు దాకా సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే కరోనా వైరస్ నివారణకు మసీదు ముతువల్లిలు సహకరించాలంటూ తహసీల్దార్ శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ భవానీప్రసాద్, సీఐలు, సీఐలు బాలమద్దిలేటి, మన్సూరుద్దీన్ కోరారు.
ఈసందర్భంగా ఆల్‌హిలాల్ పాఠశాల ఆవరణంలో జామియా మసీదు కమిటీ ముతువల్లితో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యుడు ఆనంద్‌బాబు మాట్లాడుతూ ఇటీవల మక్కాకు వెళ్లి వచ్చిన వారిలో 27 మంది ఉన్నారని అయితే వారు కొంతమంది ఇతరులతో కలుస్తున్నారని ఇప్పటి వరకు అలాంటి కేసులు బయటపడలేదన్నారు. అయినా వారిని ముందస్తు జాగ్రత్తగా ఇంటికి పరిమితం చేసేందుకు ముతువల్లిలు అవగాహన కల్పించాలన్నారు. హిందూపురం రూరల్ సీఐ ధరణికిషోర్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు చిలమత్తూరు సమీపంలోని కర్ణాటక సరిహద్దును మూసేశారు. అయితే వివిధ పనుల నిమిత్తం కర్ణాటక నుంచి ఆంధ్రాకు వచ్చే వాహనాలు, ప్రయాణికులను అడ్డుకుని వెనక్కు పంపే ప్రయత్నం చేశారు. కాగా రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను అడ్డుకోవడంపై కర్ణాటక పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు.