అనంతలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-07-22T10:09:33+05:30 IST

మండలంలో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురిసినట్లు తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. 21.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

అనంతలో భారీ వర్షం

నిండిన చెక్‌డ్యాంలు, కుంటలు

తాడిపత్రిలో నేలకొరిగిన చెట్లు

గుత్తిలో కూలిన మిద్దె


రాయదుర్గంరూరల్‌/గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మన హాళ్‌, జూలై 21 :

మండలంలో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురిసినట్లు తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. 21.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఆవులదట్ల, జుంజురాంపల్లి, రేకులకుంట, నాగిరెడ్డిపల్లి, కదరంపల్లి, వేపరాల తదితర ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, ఉపాధి హామీ పనుల ద్వారా ఏర్పాటు చేసిన పంటకుంటలలో నీరు చేరి కళకళలాడాయి. గుమ్మఘట్ట  మండలంలో 38.7 మి.మీ,  కణేకల్లులో 37.2 మి.మీ,  బొమ్మనహాళ్‌ మండలంలో 43.2 మి.మీ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 


కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు, ఫారంఫండ్లు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి. కంబదూరులో 66.8 మి.మీ, కుందుర్పి 65.0, శెట్టూరు 46.8, బ్రహ్మసముద్రం 38.2, బెళుగుప్ప 42.0, కళ్యాణదుర్గం 29.2మి.మీల వర్షపాతం నమోదయ్యింది. 


గుత్తి : గుత్తి మండల వ్యాప్తంగా 75.4 మి.మీ వర్షపాతనం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి గుత్తి-పత్తికొండ రహదారిలోని ఉప్పువంక పొంగిపొర్లింది. వాహనాల రాకపోకలకు స్తంభించాయి. 


తాడిపత్రి : పట్టణంలోని సంజీవనగర్‌ జీరోరోడ్డులో చెట్టు రోడ్డుకు అడ్డంగా నేలకూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెన్నానది పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయి. మండలంలోని సజ్జలదిన్నె వంక పారింది. పెద్దవడుగూరు మండలంలోని వంకలు, వాగులు నీటితో నిండాయి. మండలకేంద్రంలోని బీసీకాలనీకి వెళ్లే రహదారి వర్షానికి కోతకు గురికావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. యాడికి, పెద్దపప్పూరు, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. 


ఉరవకొండ : పట్టణంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పదవ వార్డులోని భాగ్యమ్మకు చెందిన మిద్దె కూలిపోయింది. రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా మిద్దె నాని పైకప్పు కూలిపోయింది.  


హిందూపురం టౌన్‌/ధర్మవరం రూరల్‌/మడకశిర  :  మం డలాల్లో ఆది, సోమవారాల్లో కురిసిన వర్షానికి వంకలు, వా గులు పారాయి.  హిందూపురం మండలంలోని తూముకుంట, గోళ్ళాపురం, కొటిపి, కంచెనపల్లి, జీవ్‌మాకులపల్లి, పులమతి, శిరివరం, కల్లూరు, చోళసముద్రం, తదితర ప్రాంతాల కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరాయి. హిందూపురంలో 70 మి.మీ.గా, లేపాక్షి ప్రాంతంలో 130 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. చోళసముద్రం వద్ద పేదల కోసం వేసిన లేఅవుట్‌లోకి నీరు వచ్చి చేరాయి. ధర్మవరం మండలంలో 55.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ వర్షానికి మండలంలోని గొల్లపల్లి వంక ఉధృతంగా పారగా, పోతులనాగేపల్లి చిత్రావతి వంక పరవళ్లు తొక్కాయి. అదేవిధంగా కుణుతూరు, రేగాటిపల్లి, బడన్నపల్లి, గొట్లూరు, తదితర గ్రామాలలో చెక్‌డ్యాంలు నిండి పొంగిపొర్లాయి. గొల్లపల్లి, చిత్రావతి వంకలలో చేపలు పట్టేందుకు స్థానికులు వెళ్లారు.  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర మండలంలో 16 మి.మీ., అమరాపురం మండలంలో 55 మి.మీ, గుడిబం డ మండలంలో 30మి.మీ, రొళ్ల మండలంలో 32.2 మి.మీ, అగళి మండలంలో 54.9 మి.మీ వర్షపాతం నమోదైంది. 


 రానున్న ఐదురోజుల్లో వర్ష సూచన

బుక్కరాయసమద్రం, జూలై 21:  జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు. రాయలసీమలో 65.2 శాతం ఉండగా, సాధారణ సగటు వర్ష పాతం 3.1 మి. మీ ఉండగా మండలాల్లో 5.1 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు  32-33 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా రాత్రి సమయంలో 24-25 డిగ్రీల సెల్సియస్‌ నమోదువుతుందన్నారు.  నైరుతి దిశగా గాలలు గంటకు9-10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం పూట 82-84 శాతం, మధ్యాహ్నం 40-49 శాతం ఉండే అవకాశం ఉందన్నారు.


వేరుశనగ, ఆముదం ,జొన్న పంటలు సాగు చేసుకోవచ్చు :  ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వేరుశనగ, ఆముదం జొన్న పంటలు సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్త సహదేవరెడ్డి రైతులుకు సూచించారు. తప్పనిసరిగా రైతులు విత్తనశుద్ధి చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-07-22T10:09:33+05:30 IST