’రియల్‌’ మాయ!

ABN , First Publish Date - 2020-11-25T06:36:04+05:30 IST

కొత్త జిల్లా కేంద్రమంటూ హిందూపురంలో విస్తృత ప్రచారం చేస్తూ రియల్టర్లు హైప్‌ సృష్టిస్తున్నారు. నెలరోజులుగా ఎటుచూసినా రియల్‌ వ్యాపారులు, మధ్యవర్తులు రియల్‌ మాయ కన్పిస్తోంది.

’రియల్‌’ మాయ!
తూమకుంట వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్‌

కొత్త జిల్లా కేంద్రమంటూ  విస్తృత ప్రచారం

భూముల ఽధరలు భారీగా పెంచిన వైనం

ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు

పురంలో పుట్టగొడుగుల్లా  అనధికార వెంచర్లు


హిందూపురం, నవంబరు 24: కొత్త జిల్లా కేంద్రమంటూ హిందూపురంలో విస్తృత ప్రచారం చేస్తూ రియల్టర్లు హైప్‌ సృష్టిస్తున్నారు. నెలరోజులుగా ఎటుచూసినా రియల్‌ వ్యాపారులు, మధ్యవర్తులు రియల్‌ మాయ కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాలను తలదన్నేవిధంగా భూముల ధరలు పెంచేశారు. హిందూపురంతోపాటు శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. పట్టణంలో ఒక్కసారిగా భూముల ధరలు రెండింతలు పెంచారు. జనాన్ని రియల్‌ మా యలో పడేసి, కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వ చ్చే జనవరి నాటికి కొత్త జిల్లా కేంద్రంపై స్పష్టత వస్తుందని అప్పటిదాకా ఆగుదామని చాలామంది ఇళ్ల స్థలా లు, భూములను విక్రయించకుండా దాటేస్తున్నారు. పట్టణంతోపాటు చుట్టుపక్రల భూములు, ఇళ్ల స్థలాలకు హద్దులు, ఫెన్సింగ్‌ ఏర్పాట్లు సాగుతున్న తీరు చూస్తే ఏ మేరకు ప్రచారం సాగుతోందో తెలుస్తుంది. కొత్తజిల్లా కేంద్రం ఎక్కడనేది ఇంత వరకు ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగానికి కూడా తెలియకపోయినా రియల్టర్లు మాత్రం హిందూపురమే కొత్త జిల్లా కేంద్రమంటూ ఊదరగొడుతున్నారు.


పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమే కొత్త జిల్లాగా ప్రచారం

రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా కేంద్రంగా హిందూ పురంతోపాటు పుట్టపర్తి, పెనుకొండ తెరపైకి వచ్చినా.. పార్లమెంటు నియోజక వర్గ కేంద్రమైన హిందూపురానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు. హిందూపురం స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీతోపాటు వాణిజ్య కేంద్రమనీ, 1.6 లక్షల జనాభా ఉందని జిల్లా కేంద్రం కావటానికి అన్ని అర్హతలున్నాయిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల హిందూపురంలో ప్రభు త్వ కా ర్యాలయాలు, స్థలాలను జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు అధికార యంత్రాంగం పరిశీలించి, వెళ్లారు. వరుసగా అధికార బృం దాలు హిందూపురంలో పర్యటిస్తుండటంతో కొత్త జిల్లా కేంద్రం గా రూపొందించడానికి అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు సా మాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.


 జనవరి దాకా ఆగుదాం..

కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం ఎక్కడనేది వచ్చే ఏడాది జనవరికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. హిందూపురం ఇటీవల భారీగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భూములు, స్థలాల ధరలు పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంగా అవతరిస్తే రెండింతలు పెరిగేఅవకాశం ఉందన్న భావనతో అప్పటిదాకా భూములు, ఇళ్ల స్థలాలు విక్రయించడానికి చాలామంది వెనుకంజ వేస్తున్నారు. కోనేవారు ఉన్నా.. అమ్మేవారు లేరనే విధంగా హిందూపురంలో రియల్‌ వ్యాపారం నడుస్తోంది. రియల్టర్లు మాత్రం వ్యాపారానికి ఇదే మంచి అవకాశమని లేఅవుట్లు వేసి, విక్రయిస్తున్నారు.  జిల్లా కేంద్రంపై స్పష్టత లేకున్నా భూములు, ఇళ్ల స్థలాల కొనుగోళ్లు ఊపందుకోవటంతో ఇది ఎందాకా పోతుందోనన్న ఆందోళన పట్టణ ప్రజల్లో నెలకొంది.


పెరిగిన రిజిస్ట్రేషన్లు

జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రచారంతో హిందూపురంతోపాటు కర్ణాటక నుంచి ఇళ్లస్థలాలు, భూములు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. హిందూపురం పట్ణణ సమీపంలోని ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి, పరిగి మండలం మోదా, మోడల్‌ కాలనీ, సేవామందిరం, కిరికెర, కొటిపి, కొట్నూర్‌, కగ్గల్లు, శ్రీకంఠపురం, తూమకుంట, మోతుకపల్లి ప్రాంతాల్లో ఇటీవల ఇళ్ల స్థలాలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కర్ణాటక వారే అధికంగా ఉన్నట్లు రియల్టర్లు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరులో రోజుకు 40 డ్యాంకుమెంట్ల రిజిస్ర్టేషన్లు చే యగా.. అక్టోబరు 15 నుంచి ఆ సంఖ్య 70 నుంచి 80కి చేరిన ట్లు రిజిస్ర్టేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నారు. వందల సంఖ్యలో అగ్రిమెంట్లు అవుతున్నాయి. చాలామంది అగ్రిమెంట్ల మీదనే విక్రయాలు చేస్తున్నారు.


ఆకాశాన్నంటిన ఇంటి స్థలాల ధరలు

నెలన్నర కిందట వరకు హిందూపురం శివారులో సెంటు రూ.ఒకటిన్నర లక్ష ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచేశారు. పట్టణంలో సెంటు ధర రూ.15 లక్షలకుపైనే నడుస్తోంది. ఇందులో దిక్కులను బట్టి మరింత ధర పెంచారు. ఎకరం కోటి అన్నా దొరకని విధంగా పెంచేశారు. ప్రధానంగా పట్టణంలో ముద్దిరెడ్డిపల్లి, డీఆర్‌ కాలనీ, విద్యానగర్‌, టీచర్స్‌కాలనీ, డీబీకాలనీ, శ్రీకంఠపురం, దన్‌రోడ్‌, బైపా్‌సరోడ్‌, మోతుకుపల్లి, నింకంపల్లి, కోట్నూర్‌, బెంగళూరు, కిరెకెర, తూమకుంట ప్రధాన రహదారి, కొటిపి, సడ్లపల్లి రోడ్‌లో ఇటీవల వెంచర్లు వెలుస్తున్నాయి. భూమి చదును చేసి పేపర్‌పై లేఅవుట్‌తో రియల్టర్ల విక్రయాలు సాగిస్తున్నా రు. పట్టణంతోపాటు రహదారుల్లో 350పైగా అనధికార వెంచర్లున్నాయి. గతంలో వీటన్నింటిని గుర్తించి, నోటీసులు జారీ చేసినా ఇంతవరకు చర్యలు తీసుకున్న పాపానపోలేదు. వచ్చే ఏడాది జనవరిలోపు కొనుగోలు చేయాలనీ, ఆ తరువాత ధరలు తమ చేతిలో ఉండవని మాయ చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన వెంచర్లు, స్థలాలు మాయ మాటున విక్రయించే పనిలో ఉన్నారు. ఇలా సబ్‌రిస్ర్టార్‌ కార్యాలయం వద్ద వందల సంఖ్యలో మధ్యవర్తులు, రియల్టర్లే కన్పిస్తున్నారు.


ఇళ్ల స్థలాల ధరలు పెంచేశారు..

కొత్త జిల్లా కేంద్రం పేరుతో నెలన్నరగా ఇళ్ల స్థలాల ధరలు పెంచేశారు. పట్టణ శివారులో రెండున్నర సెంటు ధర రూ.5 లక్షల వరకు ఉండేది. ఆది ఇప్పుడు రూ.పది లక్షలకు చేరింది. ప్రతి సెంటుపై రెండు లక్షల నుంచి మూడు లక్షలు పెంచారు. సామాన్యులు ఇంటి స్థలం కొనుగోలు చేయలేని స్థితికి వచ్చింది. ప్రసుత్తం హిందూపురంలో కొత్త జిల్లా పేరుతో రియల్‌ మాయ నడుస్తోంది.         

- చౌరెడ్డి, హిందూపురం


జనవరి దాకా ఆగదామంటున్నారు 

ఇటీవల హిందూపురంలో జిల్లా అధికార బృందం పర్యటించి, ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు పరిశీలించింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు ఖాయమని ప్రచారం సాగుతోంది. ఇందులో స్పష్టత లేకపోయినా ఇళ్ల స్థలాలు, భూములు విక్రయించే వారు జనవరి దాకా ఆగుదామని అంటున్నారు. కొనుగోలు చేసేవారున్నా.. అమ్మేవారు ముందుకు రావట్లేదు. అడిగితే ఇష్టం వ చ్చిన ధరలు చెబుతున్నారు. 

- తిమ్మయ్య, హిందూపురం

Read more