గోపాలమిత్రలకు కష్టకాలం !

ABN , First Publish Date - 2020-08-12T08:14:58+05:30 IST

గోపాల మిత్రలకు కష్టకాలమొచ్చింది. క్షేత్ర స్థాయిలో పాడి రైతు లకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న గోపాల మిత్రల మనుగ

గోపాలమిత్రలకు కష్టకాలం !

 14 నెలలుగా వేతనాలు పెండింగ్‌ 

 పోస్టుల ఖాళీతో  రైతు భరోసా కేంద్రాలకు మ్యాపింగ్‌ 

 భర్తీ చేస్తే ఏం చేస్తారో తెలియని అయోమయం 

 న్యాయం చేయాలంటూ ప్రజాప్రతినిధులకు విన్నపాలు

 ఎవరూ పట్టించుకోని వైనం 


అనంతపురం వ్యవసాయం, ఆగస్టు 9 : గోపాల మిత్రలకు కష్టకాలమొచ్చింది. క్షేత్ర స్థాయిలో పాడి రైతు లకు అందుబాటులో ఉంటూ  సేవలందిస్తున్న గోపాల మిత్రల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 14 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి వారికి ఏర్పడడింది. వేతనాలు ఇప్పించి తమకు న్యాయం చేయాలం టూ ముఖ్య ప్రజాప్రతినిధులకు పలు మార్లు విన్నవించి నా ఎలాంటి ఫలితం లేదు. దీంతో భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించుకునేందుకు గోపాల మిత్రల సంఘం నాయకు లు సిద్ధమవుతున్నారు. 


 రైతు భరోసా కేంద్రాలకు మ్యాపింగ్‌ 

20 ఏళ్ల ప్రాజెక్టు కింద గోపాలమిత్రలను విధుల్లో చేర్చుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌ నెలాఖరుకు 20 సంవత్సరాల గడువు ముగిసింది. ఆ తర్వాత కొనసాగింపు పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోడంతో గోపాలమిత్రలు రోడ్డెక్కారు. పలు రూపాల్లో నిరసన తెలిపారు. ఈ క్రమం లో రైతు భరోసా కేంద్రాల్లో విలేజ్‌ వెటర్నరీ పోస్టులు ఖాళీగా ఉండటంతో గోపాలమిత్రలను ఆర్‌బీసీలకు మ్యాపింగ్‌ చేశారు. జిల్లాలో పశుసంవర్థక సహాయకులు (ఏహెచ్‌ఏ) పోస్టులు ఖాళీగా ఉండటంతో 371 మంది గోపాలమిత్రలను రైతు భరోసా కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌ ఏహెచ్‌ఏలుగా మ్యాపింగ్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌ నుంచి  రైతు భరోసా కేంద్రాల ద్వారా క్షేత్ర స్థాయిలో గో పాలమిత్రలు విధులు నిర్వర్తిస్తున్నారు.


పనులు చేస్తున్నా వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు. గతంలో డీఎల్‌డీఏ ద్వారా గోపాల మిత్రలకు ప్రతి  నెలా వేతనాలు ఇచ్చే వారు. ఒక్కో గోపాల మిత్రకు రూ.6,500 వేతనంతోపాటు ఇన్సెంటివ్‌ రూ.2వేలు ఇవ్వాల్సి ఉంది. నిధులు విడుదల కాలేదన్న కారణంతో ఇప్పటి దాకా వేతనాలు మంజూరు చేయలేదు. అయితే సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏహె చ్‌ఏ పోస్టులను భర్తీ చేస్తే గోపాలమిత్ర పరిస్థితి ఏమి టన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమను ఏహెచ్‌ఏలుగా నియమించి ఉద్యోగ భద్రత, వేతన బకాయిలు ఇవ్వాలని గోపాల మిత్రలు కోరుతున్నారు.   


ట్రెజరీ ద్వారా వేతనాలు మంజూరు

పశుసంవర్థక శాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే గోపాల మిత్ర లకు పెండింగ్‌లోని వేతనాలు అందిస్తాం. రైతు భరోసా కేంద్రాల్లో ఏహెచ్‌ఏ పోస్టులు ఖాళీగా ఉండటంతో గోపాల మిత్రలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాం. భవిష్యత్‌లో ప్రభుత్వం నిర్ణయం మేరకు ముందుకు వెళతాం. 

                               - సన్యాసిరావు, జేడీ, పశుసవర్థక శాఖ  


Updated Date - 2020-08-12T08:14:58+05:30 IST