కేజీబీవీ ప్రవేశాల్లో గోల్‌మాల్!
ABN , First Publish Date - 2020-09-03T10:52:16+05:30 IST
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) ఆరో తరగతి ప్రవేశాల్లో గోల్‌మాల్‌కు తెరతీశారు...

అర్హులకు అన్యాయం
2,480 సీట్ల కేటాయింపులో గందరగోళం
ఆందోళనలో విద్యార్థినులు
అనర్హుల ఏరివేతకు యత్నాలు
అనంతపురం విద్య, సెప్టెంబరు 2: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) ఆరో తరగతి ప్రవేశాల్లో గోల్‌మాల్‌కు తెరతీశారు. సమగ్రశిక్ష అధికారుల అనాలోచిత నిర్ణయాలు, పర్యవేక్షణ లేమి కారణంగా బడిబయట పిల్లలు, అనాథలకు కాకుండా ఇతరులకు సీట్లు కేటాయించారు. అసలైన అర్హులకు సీట్లు దక్కలేదు. అధికశాతం అనర్హులకు కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 62 కేజీబీవీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీట్ల కేటాయింపు తతంగం మొత్తం సమగ్రశిక్ష ఎస్పీడీ కార్యాలయం నుంచి సాగటంతో ప్రవేశాల ప్రక్రియ ఇష్టారాజ్యానికి పరాకాష్టగా మారిందన్న విమర్శలున్నాయి. దీంతో జిల్లా సమగ్రశిక్ష అధికారులు విచారణకు దిగారు. అనర్హుల పేర్లు తొలగించేందుకు సిద్ధమయ్యారు.
అర్హులకు ఏదీ న్యాయం?
బడిబయట పిల్లలు, అనాథలు, తల్లిగానీ, తండ్రిగానీ మరణించిన వారి పిల్లలకు కేజీబీవీల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. బాలికల్లో డ్రాపౌట్స్ తగ్గించటం, బడి బయట పిల్లలు లేకుండా చేసి అక్షరాస్యత పెంచాలన్నదే కేజీబీవీల లక్ష్యం. ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరారు. దీంతో రాష్ట్రస్థాయిలోనే ప్రక్రియ సాగింది. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు కూడా జిల్లా అధికారుల వద్ద లేవు. సీట్ల కేటాయింపు అడ్డగోలుగా సాగింది. బడి బయట పిల్లలు, అనాథలు కాకుండా బడిలో చదివే వారికే అధికంగా సీట్లు కేటాయించినట్లు సమాచారం.
కళ్యాణదుర్గం కేజీబీవీకి 11 మంది విద్యార్థినులు ఎంపికవగా.. పరిశీలనలో ఒక్కరు కూడా బడి బయట పిల్లలు లేరని తేలినట్లు సమాచారం. శెట్టూరులో 15 మందికిగాను ముగ్గురే అర్హులని తేలింది. కుందుర్పిలో 18 మందికిగాను 8 మంది మాత్రమే అర్హులు అని తేలింది. ఇలా జిల్లాలోని 62 కేజీవీవీల్లో 2480 సీట్ల కేటాయింపు గందరగోళంగా మారింది. దీంతో జిల్లా సమగ్రశిక్ష అధికారులు విచారణకు దిగారు. అర్హులు ఎంత మందికి సీట్లు కేటాయించారు? ఎంతమంది అనర్హులున్నారో.. తేల్చే పనిలో పడ్డారు. కేజీబీవీ ప్రత్యేకాధికారుల నుంచి వివరాలు రాబడుతున్నారు. ప్రవేశాలను ప్రభుత్వం గాలికొదిలేయటంతో గందరగోళానికి తెరతీసింది.