ఉచిత సరుకుల్లో మాయాజాలం

ABN , First Publish Date - 2020-04-08T09:53:15+05:30 IST

ఉచిత సరుకుల పంపిణీలో కొందరు డీ లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కందిబేడలు దోపిడీ చేసేందుకు పలు

ఉచిత సరుకుల్లో మాయాజాలం

కార్డుదారుల ప్రమేయం లేకుండానే తంతు  

రెవెన్యూ సిబ్బంది వేలిముద్రలతో లబ్ధిదారులకు కుచ్చుటోపీ 

కంది బేడలు, బియ్యం బొక్కేస్తున్న వైనం 

లబోదిబోమంటున్న బాధితవర్గాలు 

పట్టించుకోని పౌరసరఫరాల అధికారులు 


అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 7: ఉచిత సరుకుల పంపిణీలో కొందరు డీ లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కందిబేడలు దోపిడీ చేసేందుకు పలు రకాలుగా కుట్రలు పన్నుతున్నారు. కార్డుదారుల ప్రమేయం లేకుండానే కంది బేడలు, బియ్యం నొక్కేసిన వైనం తాజాగా బహిర్గతమైంది. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో బియ్యం కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందిబేడలు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. గతనెల 29 నుంచి పంపిణీ మొదలు పెట్టింది. తొలుత జిల్లా వ్యాప్తంగా సగం మండలాలకే కందిబేడలు సరఫరా చేశారు.


దీంతో ఎఫ్‌పీ షా పుల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. కంది బేడలు స్టాక్‌ రాకపోవడంతో మళ్లీ ఇస్తామని చెప్పారు. మూడు రోజులుగా కంది బేడలు సరఫరా అయినా కార్డుదారులకు మాత్రం ఇవ్వడం లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కార్డుదారుకు బదులు స్థానిక  వీఆర్వో లేదా వీఆర్‌ఏ వేలిముద్రలతో ఉచిత సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్నే కొందరు డీలర్లు అవకాశంగా మలచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  రెవెన్యూ సిబ్బందితో వేలిముద్రలు వేయించుకుని కార్డుదారుల ప్రమేయం లేకుండానే కందిబేడలు తీసేసుకుంటున్నారు. 


కంది బేడలు, బియ్యం బొక్కేస్తున్న వైనం 

లాక్‌డౌన్‌తో కందిబేడలకు డిమాండు పెరిగింది. విపత్కర పరిస్థితుల్లోనూ కొం దరు డీలర్లు తమ వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై పేదలకు అందాల్సిన కంది బేడలు, బియ్యం బొక్కేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి నెలకొంది. 


తమ షాపునకు రెగ్యులర్‌గా వస్తున్న కార్డుదారులకు అందాల్సిన సరుకులు కొం దరు డీలర్లు నొక్కుతోంటే.. కార్డు నెంబర్‌ ఆధారంగా ఇతర షాపులకు చెందిన కార్డుదారుల సరుకులు కూడా మరికొందరు డీలర్లు మాయం చేస్తూండడం గమనార్హం. దీంతో బాధిత లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. ఉచిత సరుకుల పంపిణీపై పౌరసరఫరాల అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్లే డీలర్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. 


మచ్చుకు కొన్ని ఉదాహరణలు..

ఎక్కలూరి గౌస్‌ మొహిద్దీన్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఆజాద్‌నగర్‌లో ని వాసముంటున్నాడు. ప్రభుత్వ ఉచిత సరుకుల కోసం అదే కాలనీలోని ఎఫ్‌పీషాపునకు వెళ్లాడు. ఆయనకు చెందిన (వైఏపీ 1285021ఏ0278) ఏఏవై కార్డుపై కళ్యాణదుర్గం రోడ్డులోని మరో ఎఫ్‌పీ షాపులో సరుకులు తీసుకున్నట్లు చూపిస్తోందని డీలర్‌ చెప్పాడు. దీంతో కార్డుదారుడు అవాక్కయ్యాడు. తాను ఏ షాపునకూ వెళ్లలేదని, అలాంటప్పుడు బియ్యం ఎలా తీసుకుటానని ప్రశ్నిస్తున్నాడు. అధికారులే తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. 


కళ్యాణదుర్గానికి చెందిన లక్ష్మీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి అనంతపునం నగరంలోని ఆజాద్‌నగర్‌లో కొన్నేళ్లుగా నివాసముంటోంది. అదే కాలనీలోని ఎఫ్‌పీ షాపులో (కార్డు నెంబర్‌ డబ్ల్యూఏపీ 1223019ఏ0134) నాలుగు రోజుల క్రితం బియ్యం, చక్కెర తీసుకువెళ్లింది. అప్పటికి కందిబేడలు సరఫరా చేయకపోవడంతో వాటి కోసం మళ్లీ రావాలని డీలర్‌ సూచించాడు. మంగళవారం ఆమె తిరిగి ఎఫ్‌పీ షాపునకు వెళ్లింది. అయితే కందిబేడలు ఇచ్చేందుకు ఈపోస్‌ మిషన్‌లో డీలర్‌ స్టేటస్‌ చూడగా ఈనెల 4వ తేదీ కళ్యాణదుర్గంలోని ఎఫ్‌పీ షాపులో కందిబేడలు తీసుకున్నట్లు చూపడం గమనార్హం. అలాగే నార్పలకు చెందిన పప్పూరు శ్రీరాములు తన కుటుంబ సభ్యులతో కలిసి అదే కాలనీలో ఉంటున్నా డు.


ఈనెల 4వ తేదీ ఆజాద్‌ నగర్‌లోని ఎఫ్‌పీషాపులో బియ్యం, చక్కెర తీసుకువెళ్లాడు. కందిబేడలు స్టాక్‌ లేకపోవడంతో మళ్లీ రావాలని డీలర్‌ చెప్పాడు. కానీ అదేరోజు నార్పలలోని మరో ఎప్‌పీ షాపులో కంది బేడలు తీసుకున్నట్లు ఈ పోస్‌ లో నమోదైంది. తాము ఇతర ఎఫ్‌పీ షాపులకు వెళ్లకపోయినా తమ ప్రమేయం లేకుండానే కందిబేడలు తీసుకున్నట్లు చూపిస్తూండడంతో కార్డుదారులు అవాక్కవుతున్నారు. తమ సమస్య పరిష్కరించే నాథుడే లేడా అంటూ నిట్టూరుస్తున్నారు. 


Updated Date - 2020-04-08T09:53:15+05:30 IST