కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరమేదీ?

ABN , First Publish Date - 2020-12-06T06:06:44+05:30 IST

వ్యవసాయం తప్పా వేరే పనితెలియని రైతులు ఏటేటా నష్టాలే పలకరిస్తున్నా సేద్యాన్ని వీడటం లేదు. ఈ ఏడై నా పంట పండకపోతుందా అన్న ఆశతో అప్పులు చేసి, ఆలి పుస్తెలమ్మి సాగు చేసిన పంట అతివృష్టితో ఒకసారి, అనావృష్టితో మరోసారి నష్టాలనే మిగులుస్తోంది.

కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరమేదీ?

ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలను

వీడని అప్పుల గోడు

ఏడాది గడుస్తున్నా 

దక్కని ప్రభుత్వ సాయం

నిరీక్షిస్తున్న బాధితులు 

నిర్లక్ష్య వైఖరిలో అధికార యంత్రాంగం 

అనంతపురం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం తప్పా వేరే పనితెలియని రైతులు ఏటేటా నష్టాలే పలకరిస్తున్నా సేద్యాన్ని వీడటం లేదు. ఈ ఏడై నా పంట పండకపోతుందా అన్న ఆశతో అప్పులు చేసి, ఆలి పుస్తెలమ్మి సాగు చేసిన పంట అతివృష్టితో ఒకసారి, అనావృష్టితో మరోసారి నష్టాలనే మిగులుస్తోంది. అప్పు లు మాత్రం పేరుకుపోతున్నాయి. వాటిని తీర్చే మార్గం కానరాక, భవిష్యత్‌పై ఆశలేక అనంత అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న ఆ ఇంటి ఇల్లాలు, పిల్లలు సాగించే జీవన పోరాటం కన్నీటి సావాసమే. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మాటలతోనే సరిపెడుతుండటం, అధికారుల నిర్లక్ష్య వైఖరి వెరసి బాధితులను మరింత క్షోభకు లోను చేస్తున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 2014 నుంచి 2019 మే వరకూ 129 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరికి రూ.5 లక్షల ప్ర కారం దాదాపు రూ.6.5 కోట్ల వరకూ చెల్లించారు. ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2019 డిసెంబరు నాటి వరకూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించింది. ఆ తరువాత అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం 27 మంది అన్నదాతలు అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు నేటికీ ప్రభుత్వం నుంచి పెంచిన ఆర్థికసాయం రూ.7 లక్షలు అందలేదు. ఏడాదిగా బాధిత రైతు కుటుంబాలకు ఎదురుచూపులే మిగిలాయి.  


వీడని అప్పుల బాధలు

అప్పల బాధ భరించలేక రైతు చనిపోయినా ఆయన కుటుంబాన్ని అప్పుల బాధలు వీడటం లేదు. సకాలంలో ప్రభు త్వ సాయం అందకపోవటంతో అప్పులు తిప్పలు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమం లో కుటుంబ సభ్యులు సైతం వేదనకు లోనవుతున్నారు. కొందరు బాధిత రైతు కుటుంబాల సభ్యులు కూలి పనులకు వెళ్లి బతకడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. 


నివేదికల తయారీలోనే పుణ్యకాలం పూర్తి

రైతు బలవన్మరణానికి పాల్పడితే అతడు నిజంగా అప్పుల బాధతోనే అఘాయిత్యం చేసుకున్నాడా.. లేదా అనేది అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక ఇచ్చేందుకు మూడు, నాలుగు మాసాలు పడుతుందంటే.. విచారణ పేరుతో ఎంత జాప్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మండలస్థాయిలో తహసీల్దార్‌, ఎస్‌ఐ, వీఆర్వోలు కమిటీగా ఏర్పడి, నివేదిక ఇవ్వాలి. దానిని డివిజన్‌ స్థాయిలో డీఎస్పీ, ఆర్డీఓలు పరిశీలించి, మరో నివేదికను జేడీఏ కార్యాలయానికి పంపాలి. అటు నుంచి కలెక్టరేట్‌కు వెళ్లాలి. అక్కడ ఆమోదం పొందిన తరువాత కమిషనరేట్‌కు పంపాలి. అక్కడ ఆమోదం తరువాత తిరిగి జేడీఏ కార్యాలయం, ఆ తరువాత కలెక్టరేట్‌కు వెళ్లాలి. ఇలా ఇన్ని శాఖలు చుట్టొచ్చేసరికి బాధిత రైతు కుటుంబానికి ఆర్థికసాయం సకాలంలో అందటం గగనంగా మారుతోంది. కమిటీల పేరుతో కాలయాపన తప్పా.. మరొకటి కనిపించట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి 60 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా అధికారులు మాత్రం అప్పుల బాధతో 27 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. వీరిలో ఇప్పటికీ 11 మందికి సంబంధించి నివేదికలు తయారు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఉపాధి పనులకెళ్తూ..

- ఈమె పేరు హిమబిందు. భర్త గంగాధర్‌బాబు. తలుపుల మండలం చదులవాండ్లపల్లి స్వగ్రామం. వీరికి 5.7 ఎకరాల భూమి ఉంది. కుమారుడు, ఒక కుమార్తె సంతానం. వారికున్న పొలంలో వివిధ రకాల పంటలు సాగుచేస్తూ వచ్చారు. ఏటా పెట్టుబడి రాకపోగా.. అప్పులే మిగిలాయి. దీనికితోడు 7 బోర్లు వేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఓవైపు పంటసాగుకు అప్పులు.. మరోవైపు బోర్ల కోసం చేసిన అప్పులు దాదాపు రూ.7.85 లక్షలకు చేరాయి. వాటిని తీర్చే మార్గం కానరాక ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఉరివేసుకుని గంగాధర్‌బాబు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త అర్ధంతరంగా తనువు చాలించటంతో హిమబిందు తన పిల్లలను పోషించుకునేందుకు కూలి, ఉపాధి పనులకు వెళ్తోంది. ప్రభుత్వమందించే పరిహారం కోసం అధికారులడిగిన అన్ని రికార్డులను ఆందజేసింది. అయినా ఇంతవరకూ పరిహారం అందలేదు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికమవటంతో హిమబిందు పరిస్థితి దయనీయంగా మారింది.


బేల్దారి పనితో కుటుంబ పోషణ

- ఈమె పేరు రాజేశ్వరి. ఊరు కందుకూరు. భర్త అంకె పోతులయ్య(32). వీరికి రెండెకరాల భూమి ఉంది. ఆ భూమిలో వేరుశనగతోపాటు ఇతరత్రా పంటలు సాగుచేసినప్పటికీ.. పెట్టుబడులు కూడా దక్కలేదు. దీంతో రూ.6 లక్షలు అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం కనిపించక ఈ ఏడాది ఫిబ్రవరి 4న పోతులయ్య ఉరి వేసుకుని, ప్రాణం తీసుకున్నాడు. దీంతో ముగ్గురు పిల్లల పోషణ భారం రాజేశ్వరిపై పడింది. పిల్లలను అంటిపె ట్టుకుని కూలి పనులకెళ్తూ కాలం వెల్లదీస్తోంది. రోజూ అనంతపురం నగరానికి వచ్చి, బేల్దారి పనిచేస్తూ వచ్చిన ఆ సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. 9వ తరగతి చదువుతున్న కుమార్తె అఖిలకు బడి లేకపోతే తనతోపాటు కూలి పనులకు తీసుకెళ్తోంది. కుటుంబ యజమాని లేకపోతే ముగ్గురు పిల్లలను పోషించటం ఎంతకష్టమో ఊహించుకోవచ్చు. ఓవైపు వ్యవసాయం కోసం భర్త చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. మ రోవైపు పిల్లల పోషణ భారంగా మారుతున్న పరి స్థితుల్లో తన భర్త బలవన్మరణంతో ప్రభుత్వం అందించే ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తోందామె.కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా..

- ఈమె పేరు గంగమ్మ. కనగానపల్లి మండలం చంద్రాచర్ల స్వగ్రామం. ఈమె భర్త రైతు లింగన్న అప్పులు అధికమై, పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరికీ వివాహం చేశారు. వారికున్న 5 ఎకరాల పొలంలో వేరుశనగ, దోస, కాయ గూరల పంటలు సాగుచేస్తున్నారు. గిట్టుబాటు ఽలేక నష్టాలు రావడంతో రూ.5 లక్షల వరకూ అప్పులు చేశారు. బ్యాంకులో మరో రూ.1.5 లక్షల వరకూ పంట రుణం తీసుకున్నారు. అప్పులకు వడ్డీలు అధికమవటంతో మానసికంగా కుంగిపోయిన రైతు లింగన్న ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. రుణదాతలకు సమాధానం చెప్పలేక, ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ గంగమ్మ తిరుగుతోంది.

Read more