మరో ఐదుగురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-26T11:05:53+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ ..

మరో ఐదుగురికి పాజిటివ్‌

అందరూ హిందూపురం వాసులే 

జిల్లాలో 51కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ఒకరి డిశ్చార్జ్‌ 


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌25 : జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు  శనివారం వెల్లడించారు. ఈ ఐదుగురూ హిందూపురం వాసులే కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వీరిలో నింకంపల్లికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి, హౌసింగ్‌బోర్డుకు చెందిన యు వకుడు(24), బాలాజీనగర్‌కు చెందిన తండ్రి(41), కుమారుడు(15), ఆర్టీసీ కాలనీకి  చెందిన వ్యక్తి (41)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఐదు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 51కి చేరింది. ఇప్పటికే నలుగురు కరోనా బారిన పడి చనిపోయారు. తాజాగా ఒకరు కోలుకుని డిశ్చార్జి అ య్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 14కి చేరింది. మిగిలిన 33 మంది అనంతపురం, బత్తలపల్లి ఆస్పత్రుల్లో చికిత్స పొం దుతున్నారు. 


వణుకుతున్న జనం... అనంతలో హై టెన్షన్‌

కరోనా పేరు వింటేనే జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌తో కరోనా విస్తృతమవుతోంది. జిల్లాలోని 51 కరోనా కేసులలో దాదాపు 49 కాంటాక్ట్‌ వల్లే వ్యాపించాయి. ఇందులో వైద్యసేవలు అందించిన డాక్టర్లు, నర్సులతోపాటు అమాయకులు అధికమంది కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు.


ప్రధానంగా హిందూపురం కేసులతోనే జిల్లాలో వైరస్‌ విజృంభించింది. కాంటాక్ట్‌ కేసులు అధికమవుతుండటంతో వారితో లింకు ఉన్న వారు మరింత టెన్షన్‌ పడుతున్నారు. ఇప్పటికే వందలాదిమందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. కొత్త కేసుల కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. కాంటాక్ట్‌ అయిన వారందరి శాంపిళ్లు తీసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య కూడా జిల్లాలో పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారనీ, వారి వివరాలు వెల్లడించడంలేదన్న ప్రచారం సాగుతోంది. కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం సైతం ఉక్కిరిబిక్కిరవుతోంది. 


 పిల్లలకు కరోనా..

కరోనా మహమ్మారికి పిల్లలు బలికావాల్సి వస్తోంది. కుటుంబంలో తల్లిదండ్రులకు సోకటం ద్వారా వారి పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణవుతోంది. తొలుత లేపాక్షికి చెందిన 9 ఏళ్ల బాలుడికి కరోనా సోకింది. ఆస్పత్రిలో దాదాపు 17 రోజుల చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా బయటపడ్డాడు. తర్వాత రొళ్ల తహసీల్దార్‌ కరోనా బారిన పడగా.. 20 ఏళ్ల ఆమె తనయుడికి మహమ్మారి సోకింది. అతడు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందున్నాడు. కొత్తగా ప్రకటించిన కేసుల్లో హిందూపురంలో తండ్రికి కరోనా నిర్ధారణ కాగా.. ఆయన 15 ఏళ్ల కుమారుడు వైరస్‌ బారిన పడ్డాడు. ఇలా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కరోనా వ్యాపిస్తోంది.

Updated Date - 2020-04-26T11:05:53+05:30 IST