డబ్బు కోసం.. కిడ్నాప్‌, హత్య

ABN , First Publish Date - 2020-02-08T11:35:13+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు డబ్బు సంపాదించాలి... కష్టపడే కన్నా మోసం చేస్తే ఎక్కువ వస్తాయని ఆశ పడ్డాడు.

డబ్బు కోసం.. కిడ్నాప్‌, హత్య

మద్యంలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి ఘాతుకం

చేపల వ్యాపారిని హత్య చేసిన నిందితుడి అరెస్టు 


బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు డబ్బు సంపాదించాలి... కష్టపడే కన్నా మోసం చేస్తే ఎక్కువ వస్తాయని ఆశ పడ్డాడు. పథకం ప్రకారం తనకు పరిచయం ఉన్న చేపల వ్యాపారిని ఎంచుకున్నాడు. మగువ, మద్యం ఎరవేసి గదికి పిలిచి హత్య చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులను డబ్బు డిమాండ్‌ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. చేపల వ్యాపారిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ప్రధాన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి సుత్తి, కొడవలి, రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.  


అనంతపురానికి చెందిన ఎం. రాజునాయక్‌ అలియాస్‌ సంతో్‌షరాజ్‌ అలియాస్‌ షేక్‌ రియాజ్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు. డిగ్రీ మధ్యలోనే చదువు ఆపేసి ఉగ్యోగం కోసం 2007లో నగరానికి వచ్చాడు. అప్పటి నుంచి పలు పనులు చేశాడు. మెకానిక్‌గా, జూనియర్‌ ఆర్టి్‌స్టగా పనిచేశాడు. ప్రస్తుతం పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. 2011లో శారదాబాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు, 2015లో నసీబ్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. రెండు కుటుంబాలను పోషిస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. డబ్బు సంపాదించాలని.. ధనవంతుడిని కిడ్నాప్‌ చేయాలని భావించాడు. 2016 లో ఏజీ కాలనీకి చెందిన చేపల వ్యాపారి పి. రమేష్‌ ఇంట్లో కొద్ది రోజులు అద్దెకున్నాడు. ఆ సమయంలో ఆయన వ్యాపారాలు, బలహీనతల గురించి తెలుసుకున్నాడు. రమేష్‌ వద్ద డబ్బు బాగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. రమేష్‌, రాజు నాయక్‌ తరచూ మద్యం తాగేవారు. ఇల్లు ఖాళీ చేసినా పరిచయం కొనసాగించాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే రమే్‌షను కిడ్నాప్‌ చేయాలని రాజునాయక్‌ భావించాడు.  


పథకం ప్రకారం...

జవహర్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్న రాజునాయక్‌ తన పథకాన్ని అమలు చేసే పనిలో పడ్డాడు. గత నెల 26న ఓ అమ్మాయి బొమ్మను రమేష్‌ వాట్సా్‌పకు పంపించి తన గదికి రావాలని కోరాడు. రమేష్‌ ఆరోజు గదికి వెళ్లాడు. అక్కడ అమ్మాయి లేకపోవడంతో వెళ్లిపోయాడు. రాజునాయక్‌ ఈనెల ఒకటో తేదీన రమే్‌షకు మరోసారి ఫోన్‌ చేసి మద్యం తాగుదాం రమ్మని కోరాడు. గదిలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. సరిపోలేదని రమేష్‌ తన వద్ద ఉన్న రూ. 500 రాజు నాయక్‌కు ఇచ్చి మద్యం తీసుకురావాలని చెప్పగా రమేష్‌ వాహనంపై రహ్మత్‌నగర్‌ వెళ్లి తీసుకొచ్చాడు. వస్తూ వస్తూ కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో రెండు రెస్టిల్‌ (నిద్రమాత్రలు) టాబ్లెట్‌లు కలిపి తెచ్చాడు. అది తాగగానే రమేష్‌ మత్తులోకి వెళ్లిపోయాడు.


అక్కడే ఉన్న సుత్తితో అతడి తల, కణితమీద కొట్టాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గదికి తాళం వేసి రాజు బయటకు వెళ్లిపోయాడు. 2వ తేదీన రమేష్‌ తనవద్దే ఉన్నాడని అతడి కుటుంబ సభ్యులకు మెసేజ్‌ పెట్టాడు. రూ. 90 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. మెసేజ్‌లను రమేష్‌ సెల్‌ఫోన్‌ నుంచి పెట్టడంతో కు టుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెం టనే సంజీవరెడ్డినగర్‌ పోలీసులను ఆశ్రయించా రు. పోలీసులు వాట్సాప్‌ కాల్‌తో నిందితుడితో మా ట్లాడుతూ సిగ్నల్స్‌ ఆధారంగా అతుడు ఉండే ప్రా ంతాన్ని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.  


చేతికి డబ్బులు అందుతాయనుకునే లోపు... 

ఈనెల 3వ తేదీన రమేష్‌ హత్య గురించి రాజు తన భార్య నసీబ్‌కు చెప్పాడు. గదికి వెళ్లి రమేష్‌ ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలను తీసుకొని మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టాడు. సంతోష్‌ రాజ్‌ పేరిట డాక్యుమెంట్లు ఇచ్చాడు. రెండు కవర్లు, కొడవలి తీసుకొని రమేష్‌ మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలనుకున్నాడు. ముందుకు రెండు చేతులు నరికేశాడు. వాటిని నల్లటి కవర్లలో పెట్టాడు. దుర్వాసన వస్తుండడంతో భరించలేక బయటకు వెళ్లిపోయాడు. పక్కింట్లో ఉంటున్న మహిళ వాసన వస్తుండడంతో రాజునాయక్‌ను అడిగింది. గదిలో గ్యాస్‌ లీకైందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డబ్బు కోసం మృతుడి కుటుంబ సభ్యులతో బేరాలకు దిగాడు. పోలీసులు 4వ తేదీన నిందితుడిని పట్టుకునేందుకు డబ్బు సిద్ధం చేసినట్టు ఓ వీడియో తీసి పంపించారు. అతడిని నమ్మించే ప్రయత్నం చేశారు.


5వ తేదీన డబ్బు తీసుకొని రమే్‌షను వదిలేస్తానని చెప్పాడు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు 4వ తేదీన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య ఉదంతం బయటపడింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ పుటేజీని పరిశీలించగా రాజునాయక్‌ పలుమార్లు వెళ్లినట్లు తేలింది. మల్కాజిగిరిలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  రాజునాయక్‌ పై గతంలో సంతో్‌షనగర్‌ పోలీసుస్టేషన్‌లో కుటుంబ తగాదాల కింద కేసు నమోదైంది. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. హత్యగురించి తెలిసినప్పటికీ రాజు భార్య నసీబ్‌ పోలీసులకు చెప్పకపోవడం నేరమేనని, ఆమెను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, సంజీవరెడ్డినగర్‌ సీఐ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T11:35:13+05:30 IST