రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

ABN , First Publish Date - 2020-02-16T09:40:42+05:30 IST

జిల్లాలో రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు

రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం రూరల్‌, ఫిబ్రవరి 15 : జిల్లాలో రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం రూరల్‌మండల పరిధిలోని పూలకుంట, మన్నీల గ్రామాల్లో ఆత్మహత్యకు పాల్పడిన రైతు అక్కులప్ప కుటుంబసభ్యులను కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా ప్రభుత్వం నుంచి మంజూరైన పరిహారం ఉత్తర్వులను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు పరిహారం కింద ఒక్కొక్కరికి రూ.7లక్షల చొప్పున మంజూరైందన్నారు. పూలకుంట గ్రామంలో గత ఏడాది నవంబరు 28న ఆత్మహత్య చేసుకున్న అక్కులప్ప భార్య మంగమ్మ బ్యాంకు ఖాతాలోకి ఈనెల 10న డబ్బు జమ చేయగా, శనివారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అందజేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారన్నారు.


రైతులు ఏవైనా సమస్యలుంటే తమదృష్టికి తీసుకురావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. రైతులందరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వ్యవసాయశాఖ జేడీ హబీబ్‌ బాషా మాట్లాడుతూ మండలంలో 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, వారందరికి పరిహారం మంజూరైందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి, తహసీల్దార్‌ రామాంజనేయరెడ్డి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి,  ఏఓ వెంకటేశ్వర ప్రసాద్‌, ఏఈఓ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T09:40:42+05:30 IST