విద్యార్థులకు పరీక్షే..!
ABN , First Publish Date - 2020-09-18T11:04:32+05:30 IST
ఆర్ట్స్ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల మార్పుతో ఏర్పడిన అయోమయంతోపాటు, వసతి, భోజన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలె

మొదట కేంద్రాల మార్పునకు ఆప్షన్
ఆప్షన్ ఇచ్చాక వాటి ఎత్తివేత
చివరకు అనంతలోనే అందరికీ పరీక్షలు
అనంతపురం విద్య, సెప్టెంబరు 17: ఆర్ట్స్ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల మార్పుతో ఏర్పడిన అయోమయంతోపాటు, వసతి, భోజన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అనేక ములుపులు తిరిగి ఎట్టకేలకు విద్యార్థులకు శుక్రవారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. 1741 మంది హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సుదూర ప్రాంత విద్యార్థులకు వారి సమీప పట్టణాల్లోని పరీక్షా కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చుకునేలా అధికారులు సూచించారు.
దీంతో అనంతపురంలో 1,622, పెనుకొండలో 66, కర్నూలులో 16, పత్తికొండలో 37 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇటీవల కర్నూలు అధికారులు కేంద్రాల నిర్వహణ తమకు ఇబ్బంది అంటూ చేతులెత్తేయటంతో చివరల్లో మార్చాల్సి వచ్చింది. దీంతో చేసేదిలేక అనంతపురం ఆర్ట్స్ కళాశాల సెంటర్‌లోనే అందరికీ పరీక్షలు నిర్వహించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం చేరవేసింది.
హాస్టల్ ప్రారంభం కాకపోవటంతో విద్యార్థులకు వసతి, భోజనం ఇక్కట్లు తప్పేలా లేవు. అవస్థల నడుమే పరీక్షలకు నేటి నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకూ బీఏ, బీకాం, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకూ బీఎస్సీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.