అంతా గోప్యం..!

ABN , First Publish Date - 2020-08-16T11:03:58+05:30 IST

విద్యుత్‌ శాఖలో టెండర్ల ప్రక్రియ అంతా గోప్యం. టెండర్‌ బాక్సులు ఓపెన్‌ చేసినా.. ఎవరు దక్కించుకున్నారో ప్రకటించరు.. ఎందుకు తెలపరో.. ఎ

అంతా గోప్యం..!

 విద్యుత్‌ శాఖలో రహస్యంగా టెండర్ల ప్రక్రియ

 స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్లలో చోద్యం..

 అనుకూలమైన వారికి కట్టబెట్టే కుతంత్రాలు..

 ఉన్నతాధికారుల తీరుపై శాఖలో గుసగుసలు


అనంతపురంరూరల్‌, ఆగస్టు15: విద్యుత్‌ శాఖలో టెండర్ల ప్రక్రియ అంతా గోప్యం. టెండర్‌ బాక్సులు ఓపెన్‌ చేసినా.. ఎవరు దక్కించుకున్నారో ప్రకటించరు.. ఎందుకు తెలపరో.. ఎవ్వరికీ తెలియదు. ఇలా అంతా రహస్యంగా సాగిస్తున్నారు. అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకే ఉన్నతాధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఆ శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి.


విద్యుత్‌ శాఖలో స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్ల ప్రక్రియ అంతా గోప్యంగా సాగుతోంది. రిజర్వేషన్ల ఎంపిక, టెండర్‌ ఓపెన్‌ అంతా గుట్టుగా చేస్తున్నారు. దీనిపై ఆ శాఖలోనే గుసగుసలు మొదలయ్యాయి. తమకు అనుకూలమైన వారు, ముడుపులు ఇచ్చేవారికి కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సంబంధిత అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురం నగరంలో పాత కాంట్రాక్టర్‌కే స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్లను ఇప్పించేందుకు అతడి సామాజికవర్గం అధికారులు, ఉద్యోగులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమచారం. ఈ వ్యవహారం మొత్తం శాఖ జిల్లా ఉన్నాతాధికారుల సమక్షంలో సాగుతుండటం విమర్శలకు తావిస్తోంది.


గుట్టుగా రిజర్వేషన్ల ఎంపిక

జిల్లా విద్యుత్‌ శాఖ పరిధిలో ఐదు డివిజన్లున్నాయి. వీటిలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 15 లక్షలుపైగా విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటిలో అనంతపురం, అనంతపురం వెస్ట్‌, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి ఇలా తొమ్మిది స్పాట్‌ బిల్లింగ్‌ కేంద్రాలుగా విభజించి, బిల్లులు వసూలు చేస్తున్నారు.


బిల్లుల వసూళ్లకు సంబంధించి ఇటీవల ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియను రిజర్వేషన్‌ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. నిబంధనలకు పాతరేసి, కేవలం అనంతపురం, కదిరి ప్రాంతాలను ఎస్సీ రిజర్వ్‌ చేశారు. జిల్లా విద్యుత్‌ శాఖలో ఎక్కువగా పనిచేస్తున్న వర్గం వారికే రిజర్వేషన్లు కల్పించారన్న విమర్శలున్నాయి. చివరికి రిజర్వేషన్ల ఎంపికను లాటరీ పద్ధతిలో నాలుగు గోడల మధ్య ముగించేశారు.


రహస్యంగానే టెండర్ల ఓపెన్‌

గతనెల 20వ తేదీన టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 30 వరకు టెండర్లు స్వీకరించారు. గడువును ఈనెల 10 వరకు పొడిగించి, టెండర్లు స్వీకరించారు. 14న టెండర్లు ఓపెన్‌ చేశారు. ఇక్కడా గోప్యత పాటించారు. మాములుగా టెండర్‌ ఓపెన్‌ ప్రక్రియ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల సమక్షంలో చేపట్టాలి. ఇవేవీ లేకుండానే పూర్తి చేశారు. పదుల సంఖ్యలో టెండర్లు దాఖలైనట్లు సమాచారం. అధికారులు మాత్రం టెండర్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎవరికి ఖరారయ్యాయి? అన్న విషయాలను నేటికీ వెల్లడించకపోవటం విరమర్శలకు తావిస్తోంది.


అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకే!

తమకు అనుకూలమైన, ముడుపులు మట్టజెప్పేవారికి టెండర్లను కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పాత కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించాలని చూస్తున్నారన్న వాదనలున్నాయి. అనంతపురానికి సంబంధించిన టెండర్‌ను పాత కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు స్థానికంగా ఉన్న ఆ వర్గం అధికారులు, ఉద్యోగులు పావులు కదుపుతున్నారన్న విమర్శలున్నాయి.


ఆ కాంట్రాక్టర్‌ గతంలో ఓ అధికారికి కారు బహుమతిగా ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే శాఖలోని అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా తనకున్న పలుకుబడితో టెండర్‌ ఎలాగైనా దిక్కించుకోవాలని అతడు బేరసారాలు సాగిస్తున్నన్నట్లు ఆయావర్గాల సమాచారం. దీనిపై జిల్లా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారిని వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్‌ చేయగా.. ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

Updated Date - 2020-08-16T11:03:58+05:30 IST