వీళ్లు మాకొద్దు..!

ABN , First Publish Date - 2020-11-21T06:21:11+05:30 IST

బదిలీ అనంతరం కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్లిన కొందరు జిల్లా నీటి యాజమాన్యం సంస్థ (డ్వామా) అధికారులు, సిబ్బందికి చుక్కెదురవుతోంది. కొన్ని మండలాల్లో కొత్త అధికారులు, సిబ్బంది విధుల్లో చేరకుండా స్థానిక నాయకులు అడ్డు పడుతున్నారు.

వీళ్లు మాకొద్దు..!

డ్వామా సిబ్బందికి చుక్కెదురు..

బదిలీ స్థానాల్లో చేరకుండా 

కొందరు నేతల అడ్డగింత

బాధ్యతలు స్వీకరించొద్దని హుకుం

తమకు నచ్చిన వారినే పంపాలంటూ 

ఉన్నతాధికారిపై ఒత్తిళ్లు

అయోమయంలో యంత్రాంగం

అనంతపురం వ్యవసాయం, నవంబరు 20: బదిలీ అనంతరం కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్లిన కొందరు జిల్లా నీటి యాజమాన్యం సంస్థ (డ్వామా) అధికారులు, సిబ్బందికి చుక్కెదురవుతోంది. కొన్ని మండలాల్లో కొత్త అధికారులు, సిబ్బంది విధుల్లో చేరకుండా స్థానిక నాయకులు అడ్డు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలు స్వీకరించొద్దని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాత స్థానాల నుంచి రిలీవై, కొత్త స్థానాలకు వెళ్లిన ఆయా సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకోవాలని బతిమలాడినా నాయకులు అంగీకరించట్లేదు. ముఖ్య ప్రజాప్రతినిధుల ద్వారా తాము చెప్పిన వారిని మాత్రమే తమ ప్రాంతానికి పంపాలంటూ డ్వామా ఉన్నతాధికారిపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని అయోమయంలో డ్వామా యంత్రాంగం పడింది.


నేతల అడ్డగింత

జిల్లావ్యాప్తంగా డ్వామాలో ఏపీఓలు 31, ఈసీ/జేఈ 28, టెక్నికల్‌ అసిస్టెంట్లు 213, కంప్యూటర్‌ ఆపరేటర్లు 166, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్లు 3, సీడీ-సీఎల్‌ఆర్‌సీ 2 మొత్తం 443 మంది ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేశారు. రెండువారాల క్రితం కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ డ్వామా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరు ముందస్తుగా రాజకీయ నేతల సిఫార్సులతో బదిలీలు చేయించుకోగా.. మరికొందరు అధికారులు ఉత్తర్వులిచ్చిన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బదిలీ ఉత్తర్వుల మేరకు కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్లిన కొందరు అధికారులు, సిబ్బందికి చేదు అనుభవం ఎదురవుతోంది. ఆయా స్థానాల్లో వారిని చేరకుండా నేతలు అడ్డు పడుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, తమకు నచ్చిన వారిని వేయించుకుంటామని ఖరాకండిగా చెబుతున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో సమస్యను ఉన్నతాధికారి దృష్టికి ఇప్పటికే కొందరు తీసుకొచ్చినట్లు సమాచారం. మరికొందరు ఉన్నతాధికారికి చెప్పాలా..? వద్దా.. అనే మీమాంసలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాలు గడుస్తున్నా కొత్త స్థానాల్లో అధికారులు, సిబ్బంది చేరటంలో జాప్యమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తోచని అయోమయంలో డ్వామా యంత్రాంగం పడింది. ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మార్చేందుకు కుదరదని చెప్పినా.. ఆయా ప్రాంతాల నాయకులు వినటం లేదని సమాచారం. ఎలాగైనా తాము చెప్పిన వారిని పంపాలంటూ తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది. సాధారణ బదిలీ ఉత్తర్వులిచ్చినా డిప్యుటేషన్‌ పేరుపై తమ వారిని పంపేలా చూడాల్సిందేనంటూ మంకుపట్టుపట్టినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో అభ్యంతరాలున్న ప్రాంతాల్లో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఈ అంశంపైనే ఆ శాఖలో తీవ్ర చర్చ సాగుతోంది.

Updated Date - 2020-11-21T06:21:11+05:30 IST