ప్రజల్లో భరోసా నింపండి

ABN , First Publish Date - 2020-03-25T11:14:09+05:30 IST

ప్రజల్లో పంచాయతీ సిబ్బంది భరోసా నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సూ చించారు.

ప్రజల్లో భరోసా నింపండి

టెలికాన్ఫెరెన్స్‌ ద్వారా పంచాయతీ సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశం..


అనంతపురం రైల్వే, మార్చి 24: ప్రజల్లో పంచాయతీ సిబ్బంది భరోసా నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సూ చించారు.  డీపీఓ రామనాథరెడ్డితో కలిసి పంచాయతీ సిబ్బందితో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీఓ, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, పంచాయతీ సెక్రటరీలకు పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచు కునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆయన అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటికి రాకుండా తగిన అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడా నిత్యావసర సరుకుల కొరత రాకుండా చూడాలన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులన్నీ అందుబాటులో ఉంటాయని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఆయన చెప్పారు.


అలాగే ఎక్కడా అధిక రేట్లకు విక్రయాలు జరగకుండా.. నలుగురి కంటే ఎక్కువమంది జన సమూహం లేకుండా పంచాయతీ సిబ్బంది తగిన జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో నిత్యావసర సరుకులను వలంటీర్ల ద్వారా పంపిణీ చేయించేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. వలంటీర్లు వారికి కేటాయించిన 50 నివాసాలకు సంబంధించి మైకు ద్వారా గానీ, ర్యాలీల ద్వారా గానీ కరోనా వైరస్‌ నివారణ చర్యలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు వారికి ఐదు సూచనలు చేశారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు.

Updated Date - 2020-03-25T11:14:09+05:30 IST