‘రెట్టింపు’ దోపిడీ!

ABN , First Publish Date - 2020-09-12T09:41:01+05:30 IST

నాడు-నేడు పనుల్లో ఫర్నీచర్‌, శానిటరీ వేర్‌ వస్తువుల సరఫరాలో దోపిడీకి తెరలేపారు. మార్కెట్‌ రేటు కంటే రెట్టింపు

‘రెట్టింపు’ దోపిడీ!

‘నాడు-నేడు’ ఫర్నీచర్‌, మెటీరియల్‌కు రెట్టింపు ధరల చెల్లింపు..

 మెటీరియల్‌కు రూ.118 కోట్లు కేటాయింపు

 రాష్ట్రస్థాయిలోనే టెండర్లు, అక్కడి నుంచే సరఫరా

 గ్రీన్‌ చాక్‌బోర్డులు రూ.10,299

 డెస్కులు రూ.6700 పైనే..

 మార్కెట్‌ ధరల కన్నా అధికం..

 సామగ్రి సరఫరాలో తీవ్ర జాప్యం


అనంతపురం విద్య, సెప్టెంబరు 11: నాడు-నేడు పనుల్లో ఫర్నీచర్‌, శానిటరీ వేర్‌ వస్తువుల సరఫరాలో దోపిడీకి తెరలేపారు. మార్కెట్‌ రేటు కంటే రెట్టింపు ధరలతో దోచేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో రూ.3000 ఉన్న వస్తువులను రూ.6 వేలు, రూ.5 వేలు ఉన్నవి.. రూ.10 వేలకు రేట్లు కట్టేసి సొమ్ము చేసుకోవటానికి సిద్ధమయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


నాడు-నేడు పనుల్లో రాష్ట్ర స్థాయి (సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మెటీరియల్‌) నుంచి సరఫరా చేసే ఫర్నిచర్‌, శానిటరీ వేర్‌ వస్తువుల సర ఫరాలో కోట్ల రూపాయల నిధుల స్వాహాకు తెరలేచింది. నిధులు భోజ్యం ఒక ఎత్తయితే.. గడువు ముగిసినా జిల్లాలో సగం మండలాలకు కూడా మెటీరియల్‌ సరఫరా చేయలేదు. తీవ్ర జాప్యం చేస్తున్నా విద్యాశాఖాధికారులు నోరుమెదపలేని పరిస్థితి.


కళ్లు చెదిరే రేట్లు

జిల్లావ్యాప్తంగా 1255 నాడు-నేడు స్కూళ్లకు రూ.321 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. సివిల్‌ పనులు, సెంట్రల్‌ ప్రొ క్యూర్‌మెంట్‌కు రెండు భాగాలుగా బడ్జెట్‌ కేటాయించారు. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు రూ.118 కోట్లు కేటాయించా రు. సివిల్‌ పనుల కింద మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, విద్యుత్‌ పనులకు ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు దగ్గరుండి ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ నిధులపై వారికి అజమాయిషీ ఉంటుంది. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ డబ్బు అంతా మాయగానే ఉంటుంది. పైస్థాయిలోనే కట్‌ చేసుకుని, అక్కడి నుంచే సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మెటీరియల్‌ సరఫరా చేస్తారు.


మొత్తం 13 రకాల మెటీరియల్‌ రావాల్సి ఉంటుంది. ఒకటి నుంచి 3వ తరగతి వరకూ విని యోగించే డ్యూయల్‌ డెస్క్‌ టైప్‌-1 రూ.6768.38, 4 నుంచి 6వ తరగతి వరకూ వాడే డ్యూయెల్‌ డెస్క్‌ టైప్‌-2 రూ.6821.78, 7 నుంచి 10వ తరగతి వరకూ వినియోగించే డ్యూయెల్‌ డెస్క్‌ టైప్‌-3 రూ.6895.00, గ్రీన్‌ చాక్‌బోర్డులు రూ.10,299, సీలింగ్‌ ఫ్యాన్‌ రూ.1440, అల్మరా రూ.9400కు అందించనున్నారు. మరుగుడొడ్లలో వాడే పలు బేసిన్స్‌కు (శానిటరీ, యూనిరినల్‌ బౌల్స్‌) రూ.1336.05 నుంచి రూ.7600 వరకూ చెల్లించనున్నారు. 


భారీగా టోకరా..

నాడు-నేడు పనులకు మెటీరియల్‌ సరఫరాలో భారీగానే టోకరా పడిందన్న విమర్శలు ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అల్మరా, బెంచీలు, గ్రీన్‌ చాక్‌ బోర్డుల రేట్లు సగానికి సగం పెంచేసి, దోపిడీకి తెరలేపారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రీన్‌ చాక్‌బోర్డులకు  రూ.10 వేలకు పైనే చెల్లిస్తుండటం, అల్మరాకు వెచ్చించే రూ.9400కు రెండు బీరువాలు వస్తాయనీ, రూ.3000, రూ.3500 మంచి డెస్కులు స్థానికంగానే అందుబాటులో ఉన్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేత లు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికే కనీవినీ ఎరుగని రీతిలో రేట్లు పెంచేసి, టెండర్ల ద్వారా కట్టబెట్టి రాష్ట్రస్థాయి నుంచే సరఫరా చేయనుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


సరఫరాలో జాప్యం

మెటీరియల్‌ సరఫరాలో తీవ్ర జాప్యం అవుతోంది. గత నెలాఖరుకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పు డిప్పుడే అందజేస్తున్నారు. కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాయదుర్గం, కదిరి, ధర్మవరం, హిం దూపురం నియోజకవర్గాల్లోని స్కూళ్లకు సీలింగ్‌ ఫ్యాన్లు 2265 మాత్రమే సరఫరా కాగా.. అల్మరాలు 36, టైప్‌ 1 డెస్కులు 149, టైప్‌ 2 డెస్కులు 487, టైప్‌ 3 డెస్కులు 1376 సరఫరా చేశారు. శానిటరీ మెటీరియల్‌ 51 స్కూళ్లకు మాత్రమే చేర్చారు. గడువు ముగిసినా అధికారులు చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు.


 గడువు ముగిసిన మాట వాస్తవమే:తిలక్‌ విద్యాసాగర్‌, ఏపీసీ, సమగ్రశిక్ష

మెటీరియల్‌ సరఫరా గడువు ముగిసిన మాట వాస్తవ మే. 11 మండలాలకు శానిటరీ వేర్‌, 9 మండలాలకు ఫ్యాన్లు వచ్చాయి. ఇంకా రావాల్సి ఉంది.

Updated Date - 2020-09-12T09:41:01+05:30 IST