కరోనా విషయంలో అశ్రద్ధ వద్దు

ABN , First Publish Date - 2020-12-13T06:13:37+05:30 IST

కరోనా విషయంలో అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి.. ప్రజలను కోరారు.

కరోనా విషయంలో అశ్రద్ధ వద్దు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ సిరి


50 రోజులపాటు అవగాహనకార్యక్రమాలు: జేసీ సిరి


అనంతపురం, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): కరోనా విషయంలో అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి.. ప్రజలను కోరారు. కరోనా బారిన పడకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకుగానూ 50 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. పశ్చిమదేశాల్లో కరోనా రెండోదశ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజ లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల ప్రారంభం నుంచి జనవరి 19 వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కరోనా కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వహించరాదన్నారు. మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించడం మూలంగా ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరోనా వైరస్‌ ప్రబలినపుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో.. వాటిని ఇప్పుడూ పాటించాలన్నారు. జిల్లాలోని 63 మండలాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డెమో ఇన్‌చార్జ్‌ ఉమాపతి, డిప్యూటీ హెచ్‌ఓ గంగాధర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్ర పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-13T06:13:37+05:30 IST