వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. ఒకవేళ వారికే అవకాశమిస్తే..!
ABN , First Publish Date - 2020-03-02T10:16:12+05:30 IST
అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది.

గ్రూపుల సెగ..!
బాహాబాహికి వెనుకాడని ప్రజాప్రతినిధులు, నేతలు
బహిరంగంగానే పరస్పర విమర్శల దాడి
ఆధిపత్యమే లక్ష్యంగా వ్యవహారాలు
ఆవేదన చెందుతున్న అసంతృప్తులు
పార్టీకి దూరంగా కొందరు విధేయులు
నియోజకవర్గాల్లో వారసుల జోరు
స్థానిక ఎన్నికల్లో తమ పదవులకు గండి పడుతుందేమోనని ద్వితీయశ్రేణి నాయకుల ఆందోళన
జిల్లాలో నివురుగప్పిన నిప్పులా వైసీపీలో అసంతృప్తి
అనంతపురం(ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. దివంగత వైఎస్‌ఆర్‌కు విధేయులుగా ఉన్న కొందరు నాయకులు సైతం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పార్టీ ప్రజాప్రతి నిధులు, ముఖ్యనేతలు బాహాబాహికి వెనుకాడటం లేదు. బహిరంగంగానే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. హిందూపురంలో తాజాగా జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం.
ఆధిపత్యం కోసం అక్కడ రెండు వర్గాలు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు నవీన్ నిశ్చల్‌లు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగడం పెద్ద దుమారం రేపింది. వైరివర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ వ్యక్తిగత ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి పట్టిన కరోనా వైరస్ అని నవీన్ నిశ్చల్, ఆయనకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ ముఖ్య నాయకులు కొటిపి హనుమంతురెడ్డి, కొండూరు వేణు గోపాల్‌రెడ్డి బహిరంగంగానే విమర్శించారు.
వైసీపీ ద్రోహి నవీన్‌నిశ్చల్ అంటూ ఎమ్మెల్సీతో పాటు ఆయన వర్గీయులు, మద్దతుదారులు ప్రతివిమర్శలు చేశారు. రెండు వర్గాలు తమ సామాజికవర్గాలను పోగేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టేందుకు వెనకాడటం లేదు. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహికి దిగుతుండటంతో ఎవరిపై కేసులు నమోదు చేస్తే ఏం తలనొప్పులు వస్తాయోనని పోలీసులు కొట్టుమిట్టాడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన మహమ్మద్ ఇక్బాల్ ఓటమి చవిచూడటమే ఆ రెండు వర్గాల మధ్య వర్గపోరుకు దారితీసింది. తన ఓటమికి నవీన్ నిశ్చల్, కొటిపి హనుమంతురెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలే కారణమని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజాగా కొటిపి హనుమంతురెడ్డిపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి చేయడంతో మొదలైన రగడ వారి మధ్య వైరాన్ని పెంచిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దాడులు, పరస్పర విమర్శలు, ప్రతివిమర్శల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి
జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా అనుయాయులకే రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనిస్తున్నారన్న విమర్శలను ఆ పార్టీ శ్రేణుల నుంచే కొందరు ప్రజాప్రతినిధులు మూటగట్టుకుంటున్నారు. నోరున్న నాయకులను ఆ పార్టీ ముఖ్యులు దగ్గరకు చేరనివ్వకపోవడంతో ఈ పరిస్థితి తారస్థాయికి చేరుకుంటోందనే వాదన ఆ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో తన వారినే అందలం ఎక్కించడంతో వైసీపీ అధినాయకత్వ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్న నాయకుడిపై గెలుపొందిన ఆ ప్రజాప్రతినిధిపై స్థానిక నేతలు తీవ్రస్థాయిలో అసంతృప్తితో రగిలి పోతున్నారని సమాచారం. సంపాదన ఒక్కరికే చెందాలన్న సిద్ధాంతంతో ముందుకు వెళ్తుండటం స్థానిక నాయకులు అసంతృప్తికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఓ మహిళా ప్రజాప్రతినిధి కాంట్రాక్ట్ పనులను స్థానిక నాయకులకు కాకుండా కంపెనీలకు ఇస్తుండటంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితులుగా మెలిగిన నాయకులు సైతం ఆ ప్రజాప్రతినిధికి దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుస్తోంది. మరో మహిళా ప్రజాప్రతినిధి పట్ల స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ రెండు వర్గాలు బలంగా ఉండటంతో ఆ ఎమ్మెల్యే నుంచి ఒక వర్గానికే మద్దతు ఉండటంతో మరో వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు నాయకులందరూ సమష్టిగా పనిచేసినప్పటికీ ఆ తరువాత ఒక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పెచ్చరిల్లే అవకాశం
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ద్వితీయ స్థాయి నేతల మధ్య నెలకొన్న అసంతృప్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పెచ్చరిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. మేయర్, మున్సిపల్ చైర్మన్‌లు, జడ్పీ చైర్మన్ పదవులను ఎవరకి వారు తమ అనుయాయులు, అనుచర వర్గానికే దక్కించుకోవాలనే తపన మరింత వర్గపోరుకు దారితీసే అవకాశం కల్పింస్తుందని తెలుస్తోంది. ఈ అంశంలో రిజర్వేషన్‌లు మరింత అసంతృప్తిని రగిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
వారసుల రాజకీయం
జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వారసులు నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో ఆది నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకుల్లో ఒకింత అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ వారసులకు పట్టం కడుతారోనన్న భయం ద్వితీయశ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతోంది. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ సోదరులు నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనంతపురం అర్బన్‌లోనూ ఎమ్మెల్యే సోదరుడు, గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తనయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో స్థానిక ముఖ్య నాయకులు సైతం వారి వెంట నడిచే పరిస్థితులు నెలకొంటుండటం అసంతృప్తులకు కారణంగా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.