కొసరంత పనికి... కొండంత వెచ్చింపు!

ABN , First Publish Date - 2020-03-02T10:11:48+05:30 IST

‘మన అనంత - సుందర అనంత’ ముద్దొచ్చే ఈ పేరు... కలెక్టర్‌ గంధం చంద్రుడు నగర పరిశుభ్రతకు నడుంకట్టి చేపట్టిన ఉన్నతమైన కార్యక్రమం.

కొసరంత పనికి... కొండంత వెచ్చింపు!

 ‘షో’గా మారిన ‘మన అనంత- సుందర అనంత’

పనిచేసేదంతా కార్మికులే

అద్దెకు ప్రతి వారం రెండు జేసేబీలు, ఐదు ట్రాక్టర్లు

ప్రతిసారీ కొత్త బ్లౌజులు, మాస్క్‌లు, కవర్లు, టబ్బుల కొనుగోలు

రోజూ ఖర్చు రూ.పాతికవేలు

కార్మికులకేమో పిసరంత విదల్చని వైనం


అనంతపురం కార్పొరేషన్‌, మార్చి1 : ‘మన అనంత - సుందర అనంత’ ముద్దొచ్చే ఈ పేరు... కలెక్టర్‌ గంధం చంద్రుడు నగర పరిశుభ్రతకు నడుంకట్టి చేపట్టిన ఉన్నతమైన కార్యక్రమం. నగరపాలక సంస్థకు స్పెషల్‌ ఆఫీసర్‌ హోదాలో జిల్లా సర్వోన్నతాధికారి సమక్షంలో ప్రతి వారం సాగే కార్యక్రమం ఇది. ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు తెల్లవారగానే వాలిపోతారు. పరకలు చేతపట్టి కొత్త బ్లౌజ్‌లు, మాస్క్‌లు తగిలించుకుంటారు. అంతలోనే మీడియా వాలిపోతుంది. అందుబాటులో ఉన్న ఇంత చెత్త, మురుగును కొత్త టబ్బుల్లో నింపేసి ఫొటోలకు ఫోజులు, ఛానళ్లకు నాలుగు మాటలు చెబుతారు... ఇక అంతే. ఎండ పొడుసుకొచ్చేలోగా అక్కడి వారంతా మాయమైపోతారు.


ఏదో జరిగిపోతోందని ఆసక్తిగా చూసిన స్థానిక సామాన్య జనం... ‘షో’గా మారిన తంతును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అంతేనా అంటే... చేసిన కొసరంత పనికి లెక్కకు మించి ఖర్చు. పోనీ పని చేసిందీ స్వచ్ఛందంగా వచ్చిన పాలకులు, అధికారులు, ప్రముఖులు అంటే అదీలేదు. వీరంతా షో చేసి మిగిలిన బండెడు చాకిరీ చేసేది నగర పాలక సంస్థ కార్మికులే కావడం విడ్డూరం. పాపం ఈ కార్మికుల మొహాలకేమో కనీసం అరిగిపోయిన మాస్క్‌లు, బ్లౌజ్‌లూ గతిలేవు. ఇదీ నగరపాలక సంస్థ అధికారుల తీరు.


నగర పాలక సంస్థలో చేపడుతున్న ‘మన అనంత - సుందర అనంత’తో పరిశుభ్రత మెరుగుపడుతోందా..? లేక అది షోగా మిగిలిపోనుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి శనివారం నగరంలో ఈ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకే అధిక పని ఉంటుంది. కొందరు అక్కడికి కేవలం షో చేయడానికి మాత్రమే వస్తున్నారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ కార్యక్రమం పేరుతో కార్పొరేషన్‌కు ఆ రోజు ఖర్చు తడిసిపోతోంది. చేతికి ధరించే గ్లౌజులు, మాస్క్‌ల నుంచి వాహనాలకు అద్దె చెల్లించేవరకు అదనపు భారంగానే తేలుతోంది. కలెక్టర్‌ చొరవతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ అదనపు ఖర్చు చేయడంలో అవసరం ఏంటనే వాదన తెరపైకి వస్తోంది. అదే పని ఎక్కువమంది కార్మికులతో, కార్పొరేషన్‌ వాహనాలతోనే చేయిస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేదో పూజా కార్యక్రమం అయినట్లు అద్దె వాహనాలు తెప్పించడంలో ఆంతర్యం అంతుబట్టడం లేదు. 


అక్కడ ఒట్టిచేతులు... ఇక్కడ రోజూ కొత్తవే...

మన అనంత-సుందర అనంత ప్రధాన లక్ష్యం చెత్త కనిపించకూడదనేదే. ఆ విధానం బాగానే ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కేవలం ఆ పేరు కోసమే ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేయడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కార్యక్రమానికి వచ్చే వారిలో 90 శాతం మంది కాలువల్లోని మురుగు తీయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ పని చేయాల్సింది పారిశుధ్య కార్మికులే. ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల చేతులకు బ్లౌజులు, ముఖానికి మాస్క్‌లు లేక అల్లాడిపోతున్నారు. కానీ సుందర అనంత కార్యక్రమంలో మాత్రం ప్రతి రోజూ కొత్త గ్లౌజులు ప్రత్యక్షమవుతున్నాయి. వీఐపీలకు మరింత ఎక్కువ ధరతో కొనుగోలు చేసినవి ఇస్తున్నారు. 


అద్దె వాహనాలు దండగ?

కార్పొరేషన్‌లో ట్రాక్టర్లు, చిన్న, పెద్ద కంప్యాక్టర్లు, చిన్న జేసీబీలు ఇలా మొత్తం 40కిపైగా ఉన్నాయి. కానీ మన అనంత-సుందర అనంతలో ప్రతి శనివారం రెండు జేసీబీలు, ఐదు ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు. కార్పొరేషన్‌కు చెందిన ఏకైక జేసీబీ నెలల తరబడి మూలనపడింది. దాన్ని బాగు చేయించడంలో అలసత్వం చేశారు. రెండు రోజుల క్రితం బాగు చేయించామని అధికారులు చెబుతున్నారు. ఒక జేసీబీ వాహనానికి గంట అద్దె రూ.950 వరకు చెల్లించాలి. నాలుగు గంటలపాటు పని జరిగితే ఒక్కో వాహనానికి రూ.3800 చొప్పున రెండు వాహనాలకు రూ.7600 చెల్లించాలి. ఇక ట్రాక్టర్లు గంటకు రూ.400 వరకు చెల్లించాలి. వాటికి కూడా నాలుగు గంటలకు రూ.8 వేలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక వీఐపీలకు వాడే గ్లౌజ్‌లు(జత) రూ.70లపైమాటేనని అధికారులు అంటున్నారు. అవి ఎప్పటికప్పుడు వాడి పడేస్తారు. ప్రతి వారం 25 నుంచి 30 వరకు కొనుగోలు చేస్తారట.


రూ.1800 ఖర్చు. ఇక అదనంగా మరో రూ.15 నుంచి రూ.20 వరకు మరో 80 మందికి ఖర్చు చేస్తున్నారు. అంటే వీటికి రూ.1600 చెల్లించాలి. తొలిరోజు టబ్‌లు, పరకలు తీసుకొస్తే... వాటిని కొందరు ఇంటికి పట్టుకెళ్లారట. దీంతో అప్పటి నుంచి పెద్ద ప్లాస్టిక్‌ (బ్లాక్‌)వి ఒక్కొక్కటి రూ.30 కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. వీటిపైనా రూ.900 వరకు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ పారలు, గంపలు, పరకలకు చేస్తున్న ఖర్చు అదనం. ఇలా రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉగాది వరకు కొనసాగనుంది. దాదాపు పది వారాలపాటు నిర్వహించనున్నారు. తాజాగా గతనెల 29న టౌవర్‌క్లాక్‌ సమీపంలో ప్రత్యేకంగా హీలియం బెలూన్‌ ఆవిష్కరించారు. ఈ బెలూన్‌ ఖర్చు రూ.50 దాటినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఖాళీ స్థలాల్లో వున్నచెత్తను సుందర అనంతపేరుతో తొలగించే కార్యక్రమం చేపడుండటం వివర్శలకు దారితీస్తోంది. ఆ స్థలాల యాజమాన్యాలతో తొలగిస్తే... సుందర అనంతపేరుతో చేపడుతున్న ఖర్చు తగ్గుతుందన్న భావన నగర ప్రజలనుంచి వ్యక్తం అవుతోంది. ఇలా అదనపు ఖర్చుతో ప్రజాధనం వృథావుతొందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుండటం అధికారుల ఆలోచన తీరుకు అద్దంపడుతుండటం గమనార్హం.

Updated Date - 2020-03-02T10:11:48+05:30 IST