కరోనా వైద్య సేవలకు సీపీఎం కార్యాలయాలు

ABN , First Publish Date - 2020-03-25T11:14:45+05:30 IST

కరోనా బాధితులకు వైద్యసేవలందించేందుకు జిల్లావ్యాప్తంగా గల సీపీఎం కార్యాలయాలను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు.

కరోనా వైద్య సేవలకు సీపీఎం కార్యాలయాలు

వైద్య, పారిశుధ్య సేవల్లో స్వచ్ఛంద సేవకులుగా పార్టీ కార్యకర్తలు

సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌


అనంతపురం టౌన్‌, మార్చి 24: కరోనా బాధితులకు వైద్యసేవలందించేందుకు జిల్లావ్యాప్తంగా గల సీపీఎం కార్యాలయాలను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కా ర్యక్రమాల్లో పాల్గొనేందుకు సీపీఎం కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయం మంగళవారం జిల్లా కలెక్టరు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఈ మెయిల్‌ ద్వారా రాతపూర్వకంగా ఆయన తెలియజేశారు. దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ బాధితులు పెరిగిపోతున్నందున నివారణ కోసం రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అలాగే వివిధ సంస్థలు, వ్యక్తులు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు.


వ్యాధి లక్షణాల గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ దాని ప్రమాదాన్ని యు వతలో కొందరు చాలా తేలికగా తీసుకుంటున్నారన్నారు. ప్రపంచ దేశాల అనుభవాలు గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నవారే ఈ రకంగా వ్యహరించడం బాధ్యతారాహిత్యమన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేవలం ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే సరిపోదని, బాధ్యత కలిగిన పార్టీలు, యువత ముందుకు రావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా గల సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తలను ఈ వ్యాధి నిరోధానికి వినియోగించుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో కర్నూలులో వరదలు వచ్చినపుడు జిల్లా నుంచి సీపీఎం కార్యకర్తలు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారని, జిల్లాలో కరువు వచ్చిన సందర్భంలోనూ సీపీఎం ఆధ్వర్యంలో గంజి కేంద్రాలు నిర్వహించామని, కేరళలో వరదలు వచ్చినప్పుడూ విరాళాలు సేకరించి పంపామని గుర్తు చేశారు.

Read more