-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Corona with fangs
-
కోరలు చాస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-03-25T11:10:39+05:30 IST
జిల్లాలో కరోనా భూతం కోరలు చాస్తోంది. ఇప్పటివరకు అదిగో... ఇదిగో అంటూ వదంతులతో జనం, అధికారులు టెన్షన్‌లో పడిపోయారు.

అనంతలో అనుమానితులు రెట్టింపు
ఒక్కరోజే 19 మంది శాంపిళ్ల సేకరణ
జిల్లా వైద్య కళాశాలలోనే నిర్ధారణ పరీక్షలు
నిర్ధారణ కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
పరీక్షల నివేదికలపై ఆరా
అనుమానితుల్లో ఓ వైద్యురాలు
డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి జేసీ ఢిల్లీరావు
విదేశీయులు, ఏర్పాట్లపై సమీక్ష
అనంత ఆస్పత్రి ఐసోలేషన్‌కు ఇద్దరు
అనంతపురం వైద్యం, మార్చి 24 : జిల్లాలో కరోనా భూతం కోరలు చాస్తోంది. ఇప్పటివరకు అదిగో... ఇదిగో అంటూ వదంతులతో జనం, అధికారులు టెన్షన్‌లో పడిపోయారు. ప్రస్తుతం అదే నిజమవుతోంది. తాజాగా జిల్లాలో కరోనా అనుమానితులు రెట్టింపవుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. కరోనా ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి 13 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు తీసి తిరుపతికి పంపించారు. అయితే అందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే కరోనా రెండవ దశకు చేరిందని... అన్ని దేశాలు, ఇతర రాష్ర్టాలు చర్యలను బిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాకు ఒక్కసారిగా వేలాదిగా ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి జనం తరలివచ్చారు.
మరోవైపు తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు అధికమవుతూ వస్తున్నాయి. ఇదేస్థాయిలో జిల్లాలోనూ అనుమానితుల సంఖ్య రెట్టింపవుతూ వస్తోంది. మంగళవారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా దాదాపు 19 మంది వరకు అనుమానిత కేసులు వచ్చాయి. వారికి కరోనా వ్యాధి నిర్ధారించేందుకు జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్‌లో నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ, హెచ్‌ఓడీ డాక్టర్ స్వర్ణలత పర్యవేక్షణలో నిర్ధారణ పరీక్షలను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 19 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ గంధం చంద్రుడు వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్ష పరికరాలను పరిశీలించారు. నిర్ధారణ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, ఫలితం ఎలా వస్తుందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తొలిరోజు నిర్ధారణ పరీక్షలకు ఎన్ని శాంపిల్స్ వచ్చాయి, ఎన్ని పరీక్షలు పూర్తి చేశారు... వాటి ఫలితాల గురించి రికార్డులను పరిశీలిస్తూ అడిగి తెలుసుకున్నారు.
కరోనా అనుమానితుల్లో మహిళా డాక్టర్, విద్యార్థిని
ఐసోలేషన్‌కు తరలింపు
కరోనా అనుమానితుల్లో ఓ మహిళా డాక్టర్, విద్యార్థిని ఉన్నారు. పెనుకొండ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఇటీవల ఆస్ర్టేలియాకు వెళ్లి వచ్చారు. అక్కడ తన సోదరుడితో కలిసి కారులో ప్రయాణం చేశారు. ఆ దేశం నుంచి జిల్లాకు వచ్చిన తర్వాత జలుబు, దగ్గు లక్షణాలు ఉండడంతో అనుమానంతో జిల్లా ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి అనంతరం ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే ధర్మవరానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో చదువుకుంటోంది.
ఆమె హైదరాబాద్ నుంచి సొంతూరుకు చేరుకున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతోంది. దీంతో పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి రాగా వైద్యులు పరీక్షించారు. అనుమానం ఉండడంతో ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఓ చిన్నారితో పాటు మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరు చేరడంతో మొత్తం నలుగురు ఐసోలేషన్‌లో ఉండిపోయారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జేసీ సమీక్ష
కరోనా విజృంభణ, కలవరం నేపథ్యంలో జేసీ ఢిల్లీరావు మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వచ్చారు. డీఎంహెచ్‌ఓ, ఇతర ప్రోగ్రామ్ అధికారులతో సమావేశమయ్యారు. కరోనాపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు... ఏఏ దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు, అందులో మన జిల్లావాసులు, విదేశీయులు ఎందరున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా నియంత్రణకు వైద్యశాఖ చేపట్టిన చర్యలు, ఏర్పాట్లపై ఆరా తీశారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.