కసాపురం.. తగ్గిన భక్తుల తాకిడి

ABN , First Publish Date - 2020-03-18T10:20:40+05:30 IST

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంపై కరోనా ప్రభావం పడింది. ఉగాది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా విజృంభించడంతో నెట్టికంటి ఆలయంలో వాటిని రద్దుచేయక తప్పలేదు.

కసాపురం.. తగ్గిన భక్తుల తాకిడి

రద్దయిన ఉగాది ఉత్సవాలు, ఆర్జిత సేవలు


గుంతకల్లు, మార్చి 17: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంపై కరోనా ప్రభావం పడింది. ఉగాది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా విజృంభించడంతో నెట్టికంటి ఆలయంలో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఈ ఆలయంలో శని, మంగళవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మంగళవారం కరోనా కారణంగా భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. శ్రీశైలం, షిరిడీ దేవస్థానాలపై కూడా కరోనా దెబ్బ పడడంతో ఆ ప్రభావం ఇతర దేవాలయాలపై కూడా చూపుతోంది. దీనికితోడు ఎండోమెంటు శాఖ నుంచి వస్తున్న సూచనల మేరకు ఆలయ కార్యక్రమాలపై వేటుపడుతోంది. 


ఉగాది ఉత్సవాలుండవు

ఈనెల 25న ఉగాది పర్వదినం రానున్న సందర్భాన్ని పురస్కరించుకుని వారంరోజులుగా ఆలయంలో ఏర్పాట్లు చేపట్టారు. 25నుంచి ఉగాది ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం, రథోత్సవం, లంకాదహనం కార్యక్రమాలు వరుసగా మూడు రోజులపాటు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా విజృంభణతో వాటిని నిర్వహించరాదని ఆలయ అధికారులు నిర్ణయించారు. పండుగ రోజుల్లో కేవలం పూజాదికాలకే పరిమితం చేశారు. అలాగే తెలుగు సంవత్సరాది రోజు ప్రతి సంవత్సరం నిర్వహించే సామూహిక పంచాంగశ్రవణ కార్యక్రమాన్ని కూడా ఆపేయనున్నారు. కేవలం మైక్‌ద్వారా వినిపించనున్నారు.


ఆర్జిత సేవలూ బంద్‌

కరోనా వైరస్‌ విజృంభణను నియంత్రించడానికి ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయంలోకి గుంపులు గుంపులుగా భక్తులు వెళ్లకుండా నియంత్రించనున్నారు. ఇందులో భాగంగా ఆకుపూజలు, వడమాల ధారణలు, అభిషేకాలు, నామార్చనలు, తదితర ఆర్జిత సేవలు రద్దుచేశారు. అలాగే గత మంగళవారం నుంచి ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించరాదని నిర్ణయించారు. ఆలయ సిబ్బంది, ఆంజనేయ సేవా సమితి, ఇతర ధార్మిక సంస్థల సహకారంతో వలంటీర్లను నియమించి కరోనా లక్షణాలు కలిగినవారు కనిపిస్తే వారిని గుంపు నుంచి వేరుచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆలయంలోకి ఉగాది ఉత్సవాల సందర్భంగా ఎక్కువమందిని పంపకుండా బయటి నుంచే నియంత్రించి, వేగంగా జనాన్ని తరలించేస్తారు. 


కరోనా నియంత్రణకు చర్యలు

భక్తుల్లో కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ సిబ్బందికి వైద్య పరికరాలు సమకూర్చే పనిలోపడ్డారు. లడ్డూ తయారీ, అన్నదాన సత్రంలోని సిబ్బంది కోసం గ్లౌజులు, మాస్కులు, తలకు తొడుక్కోవడానికి క్యాపులు కొనుగోలు చేశారు. క్యూలైన్లు, వసతి గదులు తదితర ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం శానిటైజర్లను కొంటున్నారు. భక్తులకు అవగాహన కల్పించడానికి కరపత్రాలు, ప్రచార ఫ్లెక్సీలు తయారు చేయించే పనిలో పడ్డారు.

Updated Date - 2020-03-18T10:20:40+05:30 IST