కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి

ABN , First Publish Date - 2020-07-14T11:17:41+05:30 IST

కరోనా లక్షణాలున్న ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం ప్రకటన ద్వా రా విజ్ఞప్తి..

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ  పరీక్షలు చేయించుకోవాలి

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, జూలై13(ఆంధ్రజ్యోతి): కరోనా లక్షణాలున్న ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం ప్రకటన ద్వా రా విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పొడి దగ్గు, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తదితర లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలో అన్ని పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ శాంపిల్‌ ఇవ్వొచ్చన్నారు. కరోనా నేపథ్యంలో వైద్య సలహాల కోసం వైఎ్‌సఆర్‌ టెలీ మెడిసిన్‌ 14410 లేదంటే 104 నెంబర్లలో సంప్రదించాలన్నారు.


రక్షణ చర్యలు తీసుకోవాలి

కొవిడ్‌-19 మరింత వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇంటిని కొవిడ్‌ దుర్బేధ్యంగా మార్చుకోవాలన్నారు. రోజూ ఉదయాన్నే ఎండలో 20 నిముషాలపాటు శ్వాస వ్యాయామాలు, యోగా తప్పనిసరిగా చేయాలన్నారు. గోరువెచ్చని నీటినే తాగాలన్నారు. అరగంటకోసారి కొద్దికొద్దిగా రోజులో 5 లీటర్ల వరకూ నీరు తాగాలన్నారు. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, సొంటి, పసుపు, లవంగాలను నీటిలో మరిగించి, రెండుమూడు పూటలు తాగాలన్నారు. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటెకెడు పసుపు కలుపుకుని, తాగాలన్నారు.


శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు కోడిగుడ్లు, పాలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ ఎక్కువగా తినాలన్నారు. రాగిజావ తాగాలన్నారు. బీపీ, షుగర్‌ అత్యవసరమైన మందులతోపాటు పారాసిటమల్‌, సిట్రజిన్‌, దగ్గు మాత్రలు, మౌత్‌వా్‌ష, గార్గిల్‌ కోసం బిటాడిన్‌, విటమిన్‌-సి, డి, బికాంప్లెక్స్‌, ఆవిరి కోసం జండూబామ్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇలా ఎవరికి వారు రక్షణ చర్యలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు.


కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పరిశీలన

ఎస్కేయూ, జూలై13: వర్సిటీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం పరిశీలించారు. వైద్యులతో మాట్లాడారు. కరో నా బాధితులకు చికిత్స తదితర అంశాలపై ఆరాతీశారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ సిరితో పాటు పలువురు నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:17:41+05:30 IST