ఢిల్లీ దడ.. మక్కా గుబులు

ABN , First Publish Date - 2020-04-01T09:44:27+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులతో జిల్లాలో టెన్షన్‌ పెరిగిపోయింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ఓ మతపరమైన కా ర్యక్రమానికి, మక్కాయాత్రకు వెళ్లినవారు జిల్లాకు తిరిగివచ్చారు.

ఢిల్లీ దడ.. మక్కా గుబులు

భయాందోళనల్లో ప్రజలు

రెండు పాజిటివ్‌ కేసులే కారణం

నేటికీ ఆ 155 మందినీ గుర్తించని వైనం

హైదరాబాదు, బెంగళూరు నుంచి మోటారు సైకిళ్లపై జిల్లాలోకి ప్రవేశం

కొరవడిన నిఘా..

ఇలా అయితే అరికట్టడమెలా...?

తలమునకలవుతున్న యంత్రాంగం


అనంతపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ కేసులతో జిల్లాలో టెన్షన్‌ పెరిగిపోయింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ఓ మతపరమైన కా ర్యక్రమానికి, మక్కాయాత్రకు వెళ్లినవారు జిల్లాకు తిరిగివచ్చారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒకవైపు ఢిల్లీ దడ.. మరోవైపు మక్కాయాత్ర గు బులు జిల్లా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ రెండు సంఘటనలు కాదని... విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారిలో 155మందిని ఇప్పటికీ గుర్తించలేదు. అలాగే హైదరాబాదు, బెంగళూరు నగరాల నుంచి మోటారు సైకిళ్లపై కొందరు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారిని కూడా ఇప్పటివరకూ జిల్లా యంత్రాంగం గుర్తించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ తీవ్రతరమవుతోందని చెప్పవచ్చు.


అయితే అడ్డుకట్ట వేయడంలో జిల్లాయంత్రాంగం విఫలమయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో నిన్నమొన్నటివరకూ పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు ఎలాంటి టెన్షన్‌కూ గురికాలేదు. అయితే తాజాగా రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చాపకింద నీరులా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లినవారిని గుర్తించడంతో పాటు వారు ఎవరెవరిని కలిశారు..? వారి కుటుంబసభ్యుల పరిస్థితి ఎలా ఉంది..? ఇంతకూ వారిని ఢిల్లీకి తీసుకెళ్లడంలో ఎవరు ప్రముఖ పాత్ర పోషించారు..? మక్కా యాత్రకు వెళ్లిన వారి పరిస్థితి ఏమిటి..? వారు జిల్లాకు వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారు..? వంటి ప్రశ్నలకు జిల్లా యంత్రాంగం సమాధానాలు రాబట్టలేకపోయింది. జిల్లా యంత్రాంగం వద్ద స్పష్టమైన గణాంకాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇలా అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం ఎలా సాధ్యమనే ప్రశ్న జిల్లా ప్రజల్లో ఉదయిస్తోంది. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే. 


మక్కా యాత్రతో గుబులు మొదలు..

హిందూపురం, లేపాక్షిలో కరోనా వైరస్‌ కలకలానికి ప్రధాన కారణం ఆ ప్రాం తాల్లో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడమే. ఈ కేసులతో ఆ రెండు ప్రాంతాలతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చేతులు కాలాక ఆకు లు పట్టుకున్న చందంగా అధికారుల వ్యవహారశైలి ఉంది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన తరువాత ఆ రెండు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. హిందూపురం, కర్ణాటక రాష్ట్రంలోని గౌరీబిదనూరుకు చెందిన 45మంది ఇటీవలే మక్కాకు వెళ్లా రు. ఈనెల 24న అక్కడి నుంచి హైదరాబాదు మీదుగా హిందూపురం చేరుకు న్నారు. అక్కడి నుంచి గౌరీబిదనూరుకు వెళ్లారు. వీరంతా సమీప బంధువులే కా వడం విశేషం. వీరిలో 14 మంది గౌరీబిదనూరుకు చెందిన వారు కాగా.. మిగిలిన వారంతా హిందూపురం వాసులే. ఆ మరుసటి రోజు హిందూపురానికి చెం దిన 31మందిలో 27మందిని క్వారంటైన్‌లో ఉంచారు.


ఇందులో ఒక వృద్ధుడు అదే రోజు గుండెపోటుతో మరణించాడు. అలాగే గౌరీబిదనూరుకు చెందిన మరో వృ ద్ధురాలు అదేరోజు కరోనా వైర్‌సతో చనిపోయింది. ప్రస్తుతం పాజిటివ్‌ నిర్ధారణ అయిన ఇద్దరిలో ఒకరు పదేళ్ల బాలుడు కాగా, అతడు ఆ వృద్ధురాలికి మనవడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గౌరీబిదనూరుకు చెందిన 14మందిలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. మిగిలిన 12మందిలో 8 మందికి పాజిటివ్‌ ఉ న్నట్లు కర్ణాటక రాష్ట్ర వైద్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాకు సరిహద్దు ప్రాంతం గౌరీబిదనూరు కావడంతో ఆ పరిసర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన వారంతా క్వారంటైన్‌లో ఉన్నారు. వీరందరికీ ఇప్పటికే శాంపిల్స్‌ తీశారు. కొందరికి నెగిటివ్‌ వచ్చింది. మరికొందరి నివేదికలు రావాల్సి ఉంది. మక్కాకు వెళ్లివచ్చిన హిందూపురం వాసులు సుమారు 100మందితో మాట్లాడినట్లు తెలుస్తోంది. వారందరికీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొత్త మ్మీద జిల్లా ప్రజల్లో మక్కాయాత్ర గుబులు రేపిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


ఢిల్లీ దడ..

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఓ మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 73 మంది వెళ్లి ఇటీవలే తిరిగివచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆ కార్యక్రమానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లినవారిలో కొందరికి ఇతర జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ మతపరమైన కార్యక్రమానికి జిల్లాలోని హిందూపురం, పరిసర ప్రాంతాల నుంచి 16మంది, కదిరి నుంచి 12మంది, గుంతకల్లు నుంచి ఏడుగురు, రాయదుర్గం నుంచి 10 మంది, ధర్మవరం నుంచి ఒకరు, అనంతపురం, తాడిపత్రి నుంచి మిగిలిన వారు వెళ్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీకి వెళ్లిన 73మందిలో కదిరికి చెందిన 12మంది అక్కడే ఉండిపోయారు. అంటే మిగిలిన 61మందిలో జిల్లా యంత్రాంగం 49మందిని గుర్తించింది. మిగిలిన వారంతా తె లంగాణ, ఇతర జిల్లాలకు  చెందిన వారని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.


వీరందరినీ క్వారంటైన్‌కు పంపారు. కరోనా వైరస్‌ పరీక్షలు కూడా నిర్వహించినట్లు అ ధికారికంగా వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ రిపోర్టులు ఎలా వచ్చాయో తెలియలేదు. కాగా, ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన జిల్లావాసులందరూ ఎవరెవరిని కలిశారో ఇప్పటివరకూ జిల్లా యంత్రాంగం గుర్తించలేదు. వారు జిల్లాకు వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ ప్రభావం ఏ మేరకు చూపుతుందోననే ఆందోళన స్థానికులను వెంటాడుతోంది. 


ప్రజల్లోనే ఆ 155మంది..

విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1015మందిలో ఇప్పటివరకూ 860 మందిని మాత్రమే గుర్తించారు. మిగిలిన 155 మంది ప్రజల్లోనే తిరుగుతున్నారు. వారు ఎవరనేది ఇప్పటివరకూ జిల్లా యంత్రాంగం గుర్తించలేదు. జిల్లా ప్రజలను ఇది ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు బెంగళూరు, హైదరాబాదులో ఉంటున్న జిల్లాకు చెందినవారు కొందరు రెండు మూడు రోజుల నుంచి మోటారు సైకిళ్లపై గుట్టుచప్పుడు కాకుండా గ్రామాలకు చేరుతున్నట్లు సమాచారం. యల్లనూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందినవారు రెండు మూడురోజుల్లో ఐదారు గురు ఇలా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వారి నుంచి వస్తున్నాయి. ఇలా ఆ రెండు నగరాల నుంచి అనేక గ్రామాలకు ఎంతోమంది చేరుకుంటున్నా..అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలు స్థానిక ప్రజలపై మ రింత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అలాంటి వారిని గుర్తించి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


కొరవడిన నిఘా..

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ఇలా ఎంతోమంది ప్రవేశిస్తున్నారంటే పోలీసుల నిఘా కొరవడినట్లు స్పష్టమవుతోంది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నా..జిల్లాలోకి బెంగళూరు, హైదరాబాదు, బళ్లారి నగరాల నుంచి మోటారు సైకిళ్లు, ఆటోల ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారంటే.. నిఘా ఏమాత్రం ఉందో పోలీసు అధికారులకే తెలియాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిఘా మరింత పెంచాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. రోడ్లపై వాహనాలు యథేచ్ఛగా సంచరిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే ఎక్కడికక్కడ నిర్భంధ ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలు, వ్యాన్లు తప్పనిసరిగా  తనిఖీ చేయాల్సి ఉంది. ఆ దిశగా పోలీసులు దృష్టి సారించి ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.


కరోనా సమాచారం

అడ్మిషన్‌లో ఉన్నవారు : 11 మంది

శాంపిల్స్‌ సేకరణ : 79  మంది

పాజిటివ్‌ కేసులు : 02

నెగిటివ్‌ కేసులు : 66

పెండింగ్‌ రిపోర్టులు : 11

విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారు : 1015 మంది

పట్టణవాసులు : 550

గ్రామీణ ప్రజలు : 465

ఇప్పటి వరకూ గుర్తించినది : 860 

హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నవారు : 825 మంది

గుర్తించనివారు : 155 మంది

14 రోజుల పర్యవేక్షణలో ఉన్నవారు : 144 మంది

28 రోజుల పర్యవేక్షణలో ఉన్నవారు : 521 మంది

28 రోజులు పూర్తి చేసుకున్న వారు : 195 మంది

క్వారంటైన్‌ ప్రాంతాలు : 43

హిందూపురంలో : 28 మంది

పుట్టపర్తిలో : నలుగురు

లేపాక్షిలో : ఐదుగురు

రొద్దంలో : ఒకరు

రాప్తాడు(టీటీడీసీ)లో : 48 మంది

గుత్తిలో : 154 మంది

సీఆర్‌ఐటీలో : 59 మంది

ఐసొలేషన్‌లో ఉన్నవారు : 13 మంది

హిందూపురంలో : ఇద్దరు

అనంతపురంలో : 11 మంది

Updated Date - 2020-04-01T09:44:27+05:30 IST