భయం.. భయంగా..!

ABN , First Publish Date - 2020-11-03T07:00:34+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు భయం.. భయంగా.. బడిబాట పట్టారు. సోమవారం పాఠశాలలు పునఃప్రా రంభమయ్యాయి.

భయం.. భయంగా..!

అనంతపురం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు భయం.. భయంగా.. బడిబాట పట్టారు. సోమవారం పాఠశాలలు పునఃప్రా రంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో జిల్లా యంత్రాంగం ఆ మేరకు పాఠశాలలను తెరిచింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పాఠశాలల కు వెళ్లేందుకు ఉత్సాహం చూపలేదు. జిల్లావ్యాప్తంగా 6420 మంది టీచర్లు పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా.. 5120 (79 శాతం) హాజరయ్యారు. విద్యార్థులు 40 శాతం మాత్రమే హాజరయ్యారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 26,675 మంది ఉండగా.. 11475 (43శాతం) మంది బడికెళ్లారు. 9వ తరగతి విద్యార్థులు 26,073 మందికిగాను 10,028 (38 శాతం) మంది మాత్రమే హాజరయ్యారు.


కొవిడ్‌ నిబంధనల అమలులో మీనమేషాలు

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయటంలో ఉపాధ్యాయులు మీనమేషాలు లెక్కించారు. కొన్ని పాఠశాలల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయలేదు. మరికొన్ని బడుల్లో శానిటైజేషన చేయటంలో ఉపాధ్యాయులు అలసత్వం వహించారు. తొలిరోజు అసౌకర్యాల నడుమ విద్యార్థులకు తూతూ మంత్రంగా చదువులు చెప్పి, మమ అనిపించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థుల నుంచి అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టించుకోవటంపై మాత్రం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. జిల్లాలోని దాదాపు 1200 పాఠశాలల్లో నాడు-నేడు పనులు సాగుతుండటంతో బల్లలు లేక నేలమీదే కూర్చోవాల్సి వచ్చింది. మరికొన్ని పాఠశాలల్లో చెట్ల నీడన పాఠాలు విన్నారు. మధ్యాహ్నం వరకే సమయం కుదించటంతో కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టకుండానే విద్యార్థులను ఇళ్లకు పంపారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు.


జిల్లాలో మచ్చుకు కొన్ని ఘటనలు  

శింగనమలలోని జడ్పీ హైస్కూల్లో 9, 10 తరగతుల విద్యార్థులు 180 మంది ఉండగా.. ఒక్కో తరగతికి సగ టున 25 శాతం మంది హాజరయ్యారు. డీఈఓ ఆదేశాలను భేఖాతరు చేస్తూ వారికి మధ్యాహ్న భోజనం పెట్టకుండానే ఇళ్లకు పంపారు. ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే.. భోజన ఏజెన్సీ నిర్వాహకులు కరోనా టెస్టు చేయించుకునేందుకు వెళ్లారంటూ దాటవేశారు.

 

బెళుగుప్ప ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులు మొత్తం 710 మంది ఉన్నారు. వారిలో 258 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి శానిటైజర్‌ తప్పా.. థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వ హించలేదు.


బత్తలపల్లి బాలుర పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 86 మంది ఉండగా.. 28 మంది మాత్రమే హాజరయ్యారు. విద్యార్థులను చెట్ల కిందే కూర్చోబెట్టి, చదువులు చెప్పారు. 


ముదిగుబ్బలోని బాలికల ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులుండగా.. 19 మంది హాజరయ్యారు. పాఠశాలల్లో డెస్క్‌లు లేకపోవడంతో నేలమీదనే కూర్చోబెట్టారు.


గార్లదిన్నె మండల పరిధిలో 9 జిల్లా పరిషత,  ఒక ఆదర్శ పాఠశాల ఉన్నాయి. వీటిలో 9, 10 తరగతుల విద్యార్థులు 1160 మంది ఉండగా.. 287 మంది హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా గదులు సరిపోకపోవటంతో కొందరిని చెట్లకింద కూర్చోబెట్టి, పాఠాలు చెప్పారు. 


నార్పల మండలంలో కరోనా ఎఫెక్ట్‌తో 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్లారు. ఇక్కడ తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఉత్సాహం చూపలేదన్న అబిప్రాయం ఉపాధ్యాయ వర్గాల నుంచే వినిపించింది.


కదిరి డివిజనలోని పలు పాఠశాలల్లో నాడు-నేడు పనులు సాగుతుండటంతో గదుల కొరత తీవ్రంగా కని పించింది. గదుల్లేక గాండ్లపెంటలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చెట్లకిందే కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సి వచ్చింది.


విడపనకల్లు మండలంలోని గడేకల్లు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తెచ్చిన విద్యార్థులను మాత్రమే అనుమతించారు.


చెన్నేకొత్తపల్లిలో మాస్కులు లేకుండా వచ్చిన కొంతమంది విద్యార్థులను స్కూల్లోకి అనుమతించ కపోవటంతో విద్యార్థులు ఇంటిదారి పట్టారు.


కళ్యాణదుర్గం పరిధిలోని పలు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు, మరుగుదొడ్లు, బెంచీలు, విద్యుత సౌకర్యాలు లేక అవస్థలు పడ్డారు.


Updated Date - 2020-11-03T07:00:34+05:30 IST