‘ఆర్టీసీ’ ఆదాయంపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-03-18T10:25:43+05:30 IST

అనంతపురం రీజియన్‌ ఏపీఎస్‌ ఆర్టీసీ(ప్రజారవాణాశాఖ)పై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది.

‘ఆర్టీసీ’ ఆదాయంపై కరోనా ప్రభావం

బస్సులు ఎక్కేందుకు జంకుతున్న జనం

దూరప్రయాణాలు తాత్కాలికంగా రద్దు 

బస్సుల్లో కెమికల్‌ స్ర్పేయింగ్‌ 


అనంతపురం టౌన్‌, మార్చి 17: అనంతపురం రీజియన్‌ ఏపీఎస్‌ ఆర్టీసీ(ప్రజారవాణాశాఖ)పై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సులు ఎక్కాలంటే నే పది మందితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రయాణికులు జంకుతున్నారు. ప్రధానంగా ఏసీ బస్సులు, దూరప్రాంతాలకు వెళ్లే బస్సులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో రీజియన్‌లోని అన్నిడిపోల బస్సులకూ కలిపి రోజుకు రూ.1.25 కోట్ల కలెక్షన్‌ వచ్చేది. అయితే కరోనా ప్రభావం కారణంగా పది రోజుల నుంచి అది రూ.1.10 కోట్లకు మించడం లేదు. అయితే తాజాగా తాడిపత్రి దర్గా ఉరుసు ఉత్సవాలు, కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగడం వల్ల ప్రయాణికుల రాకపోకలు అధికంగా జరిగి రీజియన్‌పై ఒత్తిడి పెద్దగా పడలేదని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.


జిల్లావ్యాప్తంగా గల 13 డిపోల్లోనూ మొత్తం 933 బస్సులుండగా వాటిలో పల్లెవెలుగు 502, అల్ర్టా పల్లె వెలుగు 06, ఎక్స్‌ప్రెస్‌ 265, అల్ర్టా డీలక్స్‌ 27, సూపర్‌లగ్జరీ 125, ఏసీ(వెన్నెల, ఇంద్ర) 08 బస్సులున్నాయి. ఇవన్నీ రోజుకు 3.61లక్షల కిలోమీటర్ల మేరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ బస్సుల ద్వారా కిలోమీటరుకు రూ.35.50లు చొప్పున ఆదాయం వస్తుండగా ప్రస్తుతం రూ.32లకు పడిపోయింది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉండే అనంత ఆర్టీసీ బస్టాండు ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తూండడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీంతో బస్టాండ్లలో సందడి తగ్గుముఖం పట్టింది. రిజర్వేషన్‌ కౌంటర్లు సైతం ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. 


నివారణ చర్యలు చేపడుతున్నాం : సుమంత్‌, ఆర్‌ఎం

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా బస్టాండు ఆవరణలో ఇప్పటికే అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. అలాగే ఏసీ, సూపర్‌లగ్జరీ బస్సుల్లో ఈనెల 15 నుంచి కెమికల్‌ స్ర్పే నిర్వహిస్తూ వస్తున్నాం. బస్టాండ్లతోపాటు బస్సుల్లోనూ పరిశుభ్రత పాటించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ప్రయాణికులు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు మాస్కులు ధరించడం శ్రేయస్కరం.

Updated Date - 2020-03-18T10:25:43+05:30 IST