చేతికొచ్చిన పంటను అమ్ముకోలేని దుస్థితి

ABN , First Publish Date - 2020-03-27T09:40:41+05:30 IST

కరోనా ప్రభావం వల్ల పండ్లతోటల రైతులు నిండామునిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

చేతికొచ్చిన పంటను అమ్ముకోలేని దుస్థితి

ట్రాన్స్‌పోర్ట్‌ లేక కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు

చేసేదిలేక పంటను పొలంలోనే వదిలేస్తున్న అన్నదాతలు


ధర్మవరం, మార్చి 26: కరోనా ప్రభావం వల్ల పండ్లతోటల రైతులు నిండామునిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి పంటలు సాగు చేసి పండించిన పంటలను అమ్ముకునే సమయంలో కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నారు. దీంతో రవాణా లేక దిగుబడి ఎగుమతి గాక కొనేవారు రాకపోవడంతో   రైతన్నల పరిస్థితి ఘోరంగా తయారైంది. 


 ప్రధానంగా రేగాటిపల్లి, సీతారాంపల్లి, ఉప్పునేశనపల్లి, చిగిచెర్ల, చింతలపల్లి తదితర గ్రామాలలో కలింగర, అరటి తదితర పంటలు సాగుచేసిన రైతులు విలవిలలాడుతున్నారు. రేగాటిపల్లిలో రైతు లక్ష్మీనారాయణరెడ్డి కలింగర పంట అమ్ముకోలేక వదిలేయడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులు ఆ కాయలు కోసుకుని ద్విచక్రవాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అరటిపంట కూడా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టన్ను రూ.1000కి ఇస్తామన్నా కొనుగోలు చేసేవారు లేరు.  ప్రస్తుతం సాగుచేస్తున్న వివిధ .పంటలు కూడా మందుల కొరత వల్ల రోగాల బారిన పడుతున్నాయి. ఏది ఏమైనా కరోనా ప్రభావం వల్ల అత్యధికంగా నష్టపోతున్నది రైతులే అన్న విషయం స్పష్టమవుతోంది. 

Updated Date - 2020-03-27T09:40:41+05:30 IST