ఇదేం పద్ధతి?.. కరోనా డిశ్చార్జ్‌లపై అధికారుల బాధ్యతారాహిత్యం

ABN , First Publish Date - 2020-10-27T19:12:57+05:30 IST

కరోనా బాధితుల డిశ్చార్జ్‌ల విషయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌ ఆస్పత్రికి..

ఇదేం పద్ధతి?.. కరోనా డిశ్చార్జ్‌లపై అధికారుల బాధ్యతారాహిత్యం

- రెండో సారి పరీక్షలు లేకుండానే ఇళ్లకు

- బాధితులను బలవంతంగా పంపేస్తున్న వైనం

- వైరస్‌ ఉందో పోయిందో తెలియక తికమక

- ఆందోళనలో కుటుంబ సభ్యులు, జనం


అనంతపురం: బెళుగుప్పకు చెందిన ఓ వృద్ధురాలికి 40 రోజుల కిందట కరోనా సోకింది. జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చింది.  చికిత్స అందిస్తున్నా శ్వాస సమస్య తగ్గలేదు. కూర్చున్నా, లేచినా అయాసం. అయితే ఆ వృద్ధురాలిపై డాక్టర్లు  కనికరం చూపలేదు. చాలా రోజులుగా ఉన్నావ్‌ ఇక ఇంటికి వెళ్లు అని బలవంతంగా డిశ్చార్జ్‌ చేశారు. దీంతో దిక్కు తోచక  ఆ వృద్ధురాలిని బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ వృద్ధురాలు అన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉన్నా రెండో సారి కరోనా పరీక్షలు చేయలేదు. కరోనా పాజిటివా... నెగిటివా అని చెప్పలేదు.


పుట్టపర్తి ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు చేరారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. అయితే తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఇక్కడే ఉంటానని ఆ వృద్ధురాలు వేడుకుంది. అయినా డాక్టర్లు వినలేదు. చివరకు వైద్య శాఖలో పని చేస్తున్న ఆమె బంధువు విజ్ఞప్తి మేరకు మరో రెండు రోజులు పెట్టుకొని డిశ్చార్జ్‌ చేసి పంపించారు. ఆమెకు కరోనా పూర్తిగా తగ్గిందా లేదా అని కూడా నిర్ధారించకుండా పంపించారు.


కరోనా బాధితుల డిశ్చార్జ్‌ల విషయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌ ఆస్పత్రికి వచ్చిన పాజిటివ్‌ బాధితులను మూడు నాలుగు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేసి పంపిస్తున్నారు. తమకు ఇంకా సమస్య ఉందని చెప్పినా బలవంతంగా ఏమి కాదు ఇళ్లకు వెళ్లండని పంపిస్తున్నారు. గతంలో పాజిటివ్‌ కేసులు ఆస్పత్రికి వస్తే కనీసం 10  నుంచి 14 రోజుల పాటు ఉంచుకొని చికిత్సలు అందించేవారు. రెండో సారి పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వస్తే డిశ్చార్జ్‌ చేసి పంపించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వచ్చిన పాజిటివ్‌ బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారని గుర్తిస్తే వెంటనే డిశ్చార్జ్‌ చేసి పంపిస్తున్నారు. కొందరిని వారం రోజులకు, మరి కొందరిని నాలుగైదు రోజులకు, ఇంకొందరిని రెండుమూడు రోజులకే డిశ్చార్జ్‌ చేసి పంపిస్తున్నారు. బాధితులకు బెడ్లు దొరకడం కష్టంగా ఉన్న సమయంలో త్వరగా డిశ్చార్జ్‌ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ నెలారంభం నుంచి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుతూ వస్తోంది. గత 20 రోజులుగా పరిశీలిస్తే ఈ సంఖ్య దాదాపు 70 శాతం తగ్గిపోయింది. ఆస్పత్రులలో చేరి చికిత్స పొందే బాధితుల సంఖ్య పడిపోయింది. అనేక ఆస్పత్రులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను కొవిడ్‌ సేవల నుంచి తప్పించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో కూడా కరోనా విభాగాలను ఎత్తి వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పాజిటివ్‌ బాధితులలో 60 శాతం మంది ఇంటి వద్దే ఉంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2 వేలలోపే పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 500 మంది మాత్రమే కొవిడ్‌ ఆస్పత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. అలాంటప్పుడు వచ్చిన పాజిటివ్‌ బాధితుడికి వైద్య సేవలు అందించి పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్‌ చేయవచ్చు. కానీ ఇక్కడ అధికారులు బలవంతంగా డిశ్చార్జ్‌ చేసి పంపి స్తున్నారు. 


యథేచ్ఛగా రోడ్లపైకి...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌ నిబంధనలు పాటించడం లేదు. మెజారిటి బాధితులకు వారి ఇళ్లలో  వసతులు కూడా లేవు. మరోవైపు పనులపై ఆధారపడి జీవిస్తున్నవారు ఇళ్లకు వెళ్లిన వెంటనే రోడ్లపైకి వస్తున్నారు. జనంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనా ఉందా లేదా అనేది కూడా వారికి తెలియకపోవడం వల్ల విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీనికి కారణం రెండోసారి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి డిశ్చార్జ్‌ చేయకపోవడం వల్లేనని తెలుస్తోంది. కరోనా కనీసం 14 రోజుల పాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. భౌతిక దూరం విధిగా పాటించాలని సూచనలు ఇస్తున్నారు. కాని అధికారులు కరోనా బాధితుల డిశ్చార్జ్‌ల విషయంలో మాత్రం ఏదీ పట్టించుకోవడం లేదు. అసలే చలికాలం మొదలైంది. కరోనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. దీంతో ఎలాంటి నిర్ధారణ చేయకుండా డిశ్చార్జ్‌ చేసి పంపిస్తుండటంతో ఇతరులకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు పాజిటివ్‌ బాధితులకు రెండోసారి పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ అని తేలిన తర్వాతే డిశ్చార్జ్‌ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


ఆరోగ్యాన్ని బట్టి డిశ్చార్జ్‌ చేస్తున్నాం : డాక్టర్‌ రామస్వామినాయక్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

కరోనాతో అడ్మిట్‌ అయిన తర్వాత వారి ఆరోగ్యాన్ని బట్టి డిశ్చార్జ్‌ చేస్తున్నాం. ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలాంటి సమస్యతో బాధపడుతూ వచ్చాడు. ట్రీట్‌మెంట్‌ తర్వాత ఆ సమస్య అలాగే ఉందా, తగ్గిపోయిందా అని పరిశీలిస్తున్నాం. సమస్య తగ్గి ఆరోగ్యంగా ఉంటే డిశ్చార్జ్‌ చేసి పంపిస్తున్నాం. రెండోసారి పరీక్షలు ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడు చేయడంలేదు. కనీసం వారం రోజులు ఆస్పత్రిలోనే ఉంచుకుంటున్నాం. ఆ తర్వాతే పంపిస్తున్నాం.

Updated Date - 2020-10-27T19:12:57+05:30 IST