కరోనా కేసులు నమోదైనా.. పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-04-01T09:47:25+05:30 IST

కరోనా కేసులు నమోదైనా.. పట్టించుకోరా?

కరోనా కేసులు నమోదైనా.. పట్టించుకోరా?

లాక్‌డౌన్‌ ప్రకటించి రోజులు గడుస్తున్నా.. అనంత కూరగాయల మార్కెట్‌లో తగ్గని రద్దీ..

  కనిపించని భౌతిక దూరం.. రోడ్లు కిటకిట.. జిల్లాలో కరోనా కేసులు తేలినా నిర్లక్ష్యం వీడని అధికారులు..

  ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని వైనం.. ఇలాగైతే కరోనా కరాళనృత్యమేనని నగర వాసుల ఆందోళన..


కరోనా వైర్‌సను అడ్డుకోవాలంటే ఇళ్లలో ఉండటమే మార్గమని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. ఆ దిశగా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితులు, నిత్యావసరాల కోసం బయటికొచ్చినా భౌతిక దూరం పాటించాలని నొక్కి చెబుతున్నాయి. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించి రోజులు గడుస్తున్నాయి. కరోనా కూడా అనంత జిల్లాలోకి ప్రవేశించింది. అయినా అధికారులు నిద్రమత్తు వీడట్లేదు. ప్రతిరోజూ అనంతపురంలోని పాతూరులో గల కూరగాయల మార్కెట్‌ వద్ద విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇది ప్రమాదకరమని నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. నిద్రమత్తు వీడట్లేదు.


అక్కడ రద్దీ తగ్గించే దిశగా చర్యలు చేపట్టట్లేదు. ఆ దిశగా అణువంతైనా చొరవ చూపట్లేదు. మార్కెట్‌ను మూసేయటమే మంచిదని నగరవాసులు కోరుకుంటున్నా.. అధికారుల చెవికెక్కట్లేదు. నగర ప్రజల ప్రాణాలు పోతే మాకేంటనుకున్నారో, ఏమో? వారి నిర్లక్ష్యం చూస్తుంటే ఇది నిజమనిపిస్తోంది. లాక్‌డౌన్‌ ప్రకటించి ఇన్ని రోజులైనా మంగళవారం కూడా పాతూరు మార్కెట్‌లో విపరీతమైన రద్దీ కనిపించింది. భౌతిక దూరం కాదు కదా.. కనీసం అడుగు తీసి అడుగేయటానికి కూడా కష్టంగా ఉంది. చుట్టుపక్కల తిలక్‌రోడ్డు, గాంధీబజారు తదితర రోడ్లన్నీ వాహనదారులతో కిటకిటలాడాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా కట్టడి కాదు కదా.. కరాళనృత్యం చేస్తుందని నగర వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని కోరుతున్నారు.


 ఫొటోలు : ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Updated Date - 2020-04-01T09:47:25+05:30 IST