-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Corona
-
అనంతలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 70 కేసులు
ABN , First Publish Date - 2020-06-23T09:56:38+05:30 IST
కరువు జిల్లాలో కరోనా జడలు విప్పింది. కేసులు..

జడలు విప్పిన కరోనా
మరో 70 మందికి పాజిటివ్
జిల్లా కేంద్రంలోనే 33 కేసులు
అనంతపురం(ఆంధ్రజ్యోతి): కరువు జిల్లాలో కరోనా జడలు విప్పింది. కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 800 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం మరో 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారిక బులెటిన్‌లో వెల్లడించారు. ఈ లెక్కన జిల్లాలో కరోనా కేసులు సంఖ్య 870కి చేరింది. ఇటీవల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సోమవారం ప్రకటించిన 70 కేసుల్లో అనంతపురం నగరంలోనే అత్యధికంగా నమోదయ్యాయని తెలుస్తోంది. 33 మంది నగర వాసులే ఉన్నట్లు సమాచారం. రుద్రంపేట, సంఘమిత్రకాలనీ, మారుతీనగర్, జనశక్తినగర్, నీరుగంటి వీధి, గుల్జార్‌పేట, అశోక్‌నగర్, సంగమే్‌షనగర్, ఉమానగర్, కొవ్వూరునగర్, అరవింద్‌నగర్, ఓబుళదేవరనగర్, చిన్మయనగర్(రాప్తాడు) పరిధిలో కేసులు నమోదయ్యాయి.
బాధితులను కొవిడ్-19 ఆస్పత్రులకు తరలించారు. వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌లను క్వారంటైన్‌కు తరలించారు. ఇలా రోజూ పదుల సంఖ్యలో నగరంలో పాజిటివ్ కేసులు బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ నగరంలోని ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన కేసులు శివారు కాలనీలకు వ్యాపిస్తున్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. చిలమత్తూరు, పామిడి, గుత్తి, తాడిపత్రి, పెనుకొండ, ధర్మవరం ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. చిలమత్తూరు మండలంలోని తుమ్మలకుంట గ్రామంలో గర్భిణికి నిర్ధారణ అయింది. ఇదివరకే ఓ గర్భిణి కరోనా బారిన పడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా మరో గర్భిణి వైరస్ కోరల్లో చిక్కింది.
ధర్మవరంలో తగ్గని జోరు..
ధర్మవరంఅర్బన్: పట్టణంలో వైరస్ జోరు తగ్గట్లేదు. మరో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53కి చేరింది. మొట్టమొదటి సారిగా కొత్తపేట, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఆరుగురు గర్భిణులు, హోంగార్డు, మరో వ్యక్తి ఉన్నారన్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించి, పాజిటివ్ వ్యక్తుల కాంటాక్టులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
గార్లదిన్నె: మండల కేంద్రంలో జనరల్ స్టోర్ నిర్వాహకుడికి కరోనా సోకింది. పది రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో అతడిని అధికారులు ఎస్కేయూ ఐసోలేషన్‌కు తరలించారు. ఆ ప్రాంతమంతా శానిటైజేషన్ చేశారు. రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
కరోనాతో వృద్ధుడి మృతి
పామిడి మండలంలోని రామరాజుపల్లికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రోహినాథ్ తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చికిత్సల నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అక్కడి నుంచి అనంతపురం వచ్చి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండల కేంద్రంలో హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. బాధితుడిని అనంతపురం ఐసోలేషన్‌కు తరలించారు.
సోమందేపల్లి: మండలకేంద్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఓ యువకుడికి పాజిటివ్ అని తేలటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలుండటంతో ఇతడు మూడురోజుల క్రితం పరీక్షలు చేయించుకున్నాడు. పాజిటివ్ అని తెలిసినా ఎవరికీ చెప్పకుండా గ్రామంలో తిరిగినట్లు సమాచారం. సోమవారం విషయం వెలుగులోకి రావటంతో ఎస్‌ఐ వెంకటరమణ వెంటనే దుకాణాలను మూయించారు. తహసీల్దార్ అలెగ్జాండర్‌తో కలిసి, కాలనీని రెడ్‌జోన్ చేశారు.
మైలసముద్రంలో..
కొత్తచెరువు: మండలంలోని మైలసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. ఇతడు హిందూపురంలో కొన్నాళ్లు ఉండి, స్వగ్రామానికి వచ్చాడు. అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు కొత్తచెరువు మండల అధికారులకు తెలిపారు. అతడిని బత్తలపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి, గుంతపల్లిలో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ వైరస్ బారిన పడటంతో క్వారంటైన్‌కు తరలించారు.
హిందూపురం: పట్టణంలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఓ రైల్వే ఉద్యోగితోపాటు అతడి కుటుంబంలో మరొకరు వైరస్ బారిన పడ్డారు. ఆ ఉద్యోగి రోజూ హిందూపురం నుంచి బెంగళూరుకు రైలులో విధులకు వెళ్లివస్తున్నారు. దీంతో రైల్వే ఉద్యోగులను కాంటాక్ట్ భయం పట్టుకుంది. పెనుకొండ కియ వద్ద రెండు, పరిగిలో ఒకరికి వైరస్ సోకింది.
రాయదుర్గంటౌన్: పట్టణంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కొవిడ్-19 వైద్యుడు రంగస్వామి తెలిపారు. పట్టణంలోని మటన్ మార్కెట్ ఏరియాలో నివాసముంటూ కియ కార్ల పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా అని తేలటంతో ఎస్కేయూ క్వారంటైన్‌కు తరలించారు. అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, స్నేహితుడిని పట్టణంలోని క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. వారి శాంపిళ్లు తీసి, పరీక్షలకు పంపారు. నలుగురికీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యుడు తెలిపారు. వారిని అనంతపురం ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా
తాడిపత్రి: పట్టణంలో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం అనంతపురంలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. పాజిటివ్ అని తేలటంతో బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. హెడ్‌కానిస్టేబుల్ కరోనా బారిన పడటంతో అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది. ఆయనతో కాంటాక్ట్ ఉన్నవారిపై ఆరా తీస్తున్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో కొవిడ్ పరీక్షలు
అనంతపురంరూరల్: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో మిగతా అందరికీ పరీక్షలు చేశారు.
నాలుగు బ్యాంకు శాఖలు మూసివేత
అనంతపురం క్లాక్‌టవర్: కరోనా వైరస్ వ్యాప్తితో నాలుగు బ్యాంకు శాఖలను మూసివేశారు. అనంతపురంలోని సాయినగర్, సుభాష్ రోడ్డు, శింగనమల, అనంతపురం రూరల్ మండలం చియ్యేడు బ్యాంకు శాఖల్లో కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో సేవలను నిలిపేశారు. రెండుమూడు రోజుల్లో ఆయా కార్యాలయాల్లో శుభ్రం చేసిన తరువాత బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఎల్‌డీఎం మోహన్‌మురళి తెలిపారు.
నలుగురు డిశ్చార్జ్
హిందూపురం కొవిడ్ ఆస్పత్రి నుంచి సోమవారం నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసుల మొదటి, రెండవ కాంటాక్ట్ అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.