రష్యా దేశస్థుడికి కరోనా?
ABN , First Publish Date - 2020-03-16T10:27:12+05:30 IST
రష్యా దేశస్థుడికి కరోనా?
సాయిదర్శనానికి పుట్టపర్తి రాక... అనంత ఆస్పత్రి ఐసొలేషన్ వార్డులో చికిత్స
అనంతపురం వైద్యం, మార్చి 15: జిల్లాలో కరోనా అనుమానిత బాధితులు వెలుగులోకి వస్తూండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కదిరి ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలున్నాయంటూ జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్సలందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాఽధి నిర్ధారణ కోసం తిరుపతికి శాంపిల్స్ పంపించారు. అయితే ఆ వృద్ధుడి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతూండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా రష్యా దేశస్థుడికి కరోనా లక్షణాలున్నాయంటూ వైద్యులు జిల్లా అధికారుల దృష్టికి తెచ్చారు. రష్యాకు చెందిన 32 ఏళ్ల యువకుడు సాయిదర్శనం కోసం ఈనెల 6న పుట్టపర్తికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దగ్గు, జలుబు తీవ్రంగా ఉండడంతో స్థానికంగా గల ఆస్పత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. అయినా.. తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆ వ్యక్తిని జిల్లా సర్వజనాస్పత్రిలోని ఐసొలేషన్‌వార్డులో ఉంచి చికిత్సలందిస్తున్నారు. మరోవైపు వ్యాధి నిర్ధారణ కోసం తిరుపతికి శాంపిల్స్ పంపించారు. వైద్యులు మాత్రం వ్యాధి నిర్ధారణ కాలేదని, ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్సలందిస్తూ పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు.